బుర్రా అవుట్
ABN, Publish Date - Jan 18 , 2024 | 11:30 PM
వైసీపీలో అభ్యర్థుల ఎంపిక వ్యవహారం అనేక మలుపులు తిరుగుతోంది. కనిగిరి ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్‌యాదవ్‌నుపక్కనపెట్టేశారు. ఆయన స్థానంలో అసమ్మతి నేత, హనుమంతునిపాడు జడ్పీటీసీ సభ్యుడు దద్దాల నారాయణయాదవ్‌కు అవకాశం ఇచ్చారు. మరికొన్ని మార్పులు, చేర్పులపై పరిశీలన అనంతరం మార్కాపురం, కందుకూరుల్లో సిటింగ్ ఎమ్మెల్యేలు కుందురు నాగార్జునరెడ్డి, మానుగుంట మహీధరరెడ్డిలకు అవకాశాలు మెరుగుపడ్డాయి. భూసేకరణకు అవసరమైన నిధులు రాబట్టుకున్న ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డికి తిరిగి ఒంగోలులో పోటీకి గ్రీన్‌సిగ్నల్ లభించింది. గిద్దలూరులో రెడ్డి సామాజికవర్గానికి చెందిన స్థానిక నేతకు అవకాశం ఇవ్వాలని భావిస్తున్నారు. ఒంగోలు లోక్‌సభ స్థానానికి ఎంపీ మాగుంటను కాదనుకున్న జగన్.. రెడ్డి కార్పొరేషన్ ఛైర్మన్ సత్యనారాయణరెడ్డి పేరును పరిశీలనలోకి తీసుకున్నారు. శుక్ర, శనివారాల్లో తుది జాబితా విడుదలయ్యే అవకాశం కనిపిస్తోంది.
కనిగిరి నుంచి దద్దాలకు అవకాశం
మార్కాపురంలో పోటీ చేయలేమన్న శిద్దా
జంకెకు ఫైనాన్స్ సమస్య
మార్కాపురంలో నాగార్జునరెడ్డికే చాన్స్
కందుకూరు విషయంలో సందిగ్ధం
మహీధరరెడ్డి వైపే మొగ్గు
గిద్దలూరుకు స్థానిక నేత పేరు పరిశీలన
ఎంపీగా సత్యనారాయణరెడ్డి పేరు పరిశీలన
ఒంగోలు సీటు బాలినేనికే .. 22న ర్యాలీ
ఆంధ్రజ్యోతి, ఒంగోలు
వైసీపీలో అభ్యర్థుల ఎంపిక వ్యవహారం అనేక మలుపులు తిరుగుతోంది. కనిగిరి ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్‌యాదవ్‌నుపక్కనపెట్టేశారు. ఆయన స్థానంలో అసమ్మతి నేత, హనుమంతునిపాడు జడ్పీటీసీ సభ్యుడు దద్దాల నారాయణయాదవ్‌కు అవకాశం ఇచ్చారు. మరికొన్ని మార్పులు, చేర్పులపై పరిశీలన అనంతరం మార్కాపురం, కందుకూరుల్లో సిటింగ్ ఎమ్మెల్యేలు కుందురు నాగార్జునరెడ్డి, మానుగుంట మహీధరరెడ్డిలకు అవకాశాలు మెరుగుపడ్డాయి. భూసేకరణకు అవసరమైన నిధులు రాబట్టుకున్న ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డికి తిరిగి ఒంగోలులో పోటీకి గ్రీన్‌సిగ్నల్ లభించింది. గిద్దలూరులో రెడ్డి సామాజికవర్గానికి చెందిన స్థానిక నేతకు అవకాశం ఇవ్వాలని భావిస్తున్నారు. ఒంగోలు లోక్‌సభ స్థానానికి ఎంపీ మాగుంటను కాదనుకున్న జగన్.. రెడ్డి కార్పొరేషన్ ఛైర్మన్ సత్యనారాయణరెడ్డి పేరును పరిశీలనలోకి తీసుకున్నారు. శుక్ర, శనివారాల్లో తుది జాబితా విడుదలయ్యే అవకాశం కనిపిస్తోంది.
బుర్రాకు నోచాన్స్
కనిగిరి ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్‌కు టికెట్ ఖాయమని నిన్న మొన్నటివరకూ చెప్పిన జగన్ గురువారం సాయంత్రం నిర్ణయాన్ని మార్చుకున్నారు. తొలుత బుర్రాతో మాట్లాడిన సీఎం.. ‘మీకు నియోజకవర్గంలో అసమ్మతినేతలు సహకరించే పరిస్థితి కనిపించడం లేదు. తాజా సర్వే నివేదికలు కూడా మీకు వ్యతిరేకంగా వచ్చాయి. అందువల్ల మిమ్మల్ని తప్పించక తప్పడం లేదు’ అని చెప్పినట్లు తెలిసింది. వెంటనే బుర్రా ఏదో చెప్పుకోబోగా వేచి ఉండండి ఇతరత్రా అవకాశాలు చూస్తామని చెప్పినట్లు సమాచారం. ఆ తర్వాత హనుమంతునిపాడు జడ్పీటీసీ సభ్యుడు, ఎమ్మెల్యే బుర్రా వ్యతిరేకవర్గంలో ఉన్న దద్దాల నారాయణయాదవ్‌ను పిలిచి వెళ్లి పనిచేసుకోండని ఆదేశించారు. ఆమేరకు నారాయణ పేరును ఖరారుచేస్తూ జాబితా ప్రకటించాలని కూడా విజయసాయిరెడ్డిని జగన్ ఆదేశించినట్లు తెలిసింది. తొలుత బుర్రాతో జగన్ మాట్లాడిన సమయంలో కందుకూరు లేక మరో నియోజకవర్గానికి వెళ్తారా? అని అడిగితే ఆయన ససేమిరా అన్నట్లు తెలుస్తోంది. ఇంకోవైపు బుర్రా వియ్యంకుడైన కృష్ణా జిల్లా పెనమలూరు ఎమ్మెల్యే పార్థసారథిని కూడా ఇటీవల పెనమలూరు నుంచి జగన్ తప్పించిన విషయం తెలిసిందే. ఆయన టీడీపీలో చేరేందుకు రంగం సిద్ధమైనట్లు ప్రచారం జరుగుతోంది. ఈనేపథ్యంలో కనిగిరి నుంచి బుర్రాను తప్పించడం పలురకాల అనుమానాలకు తెరలేపింది. ప్రస్తుతం కనిగిరి అభ్యర్థిగా ఎంపికైన నారాయణయాదవ్ 2019లో వైసీపీలో చేరి స్థానిక సంస్థల ఎన్నికల అనంతరం వరకు బుర్రాతో కలిసి ఉన్నారు. వ్యాపారవేత్త అయిన నారాయణయాదవ్‌కు బుర్రాకు రియల్‌ఎస్టేట్ వ్యాపారపరమైన సమస్యలతో మనస్పర్థలు వచ్చి దూరమయ్యారు. ఎమ్మెల్యే బుర్రా వ్యతిరేకవర్గంతో కలిసి పయనించారు.
ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా సత్యనారాయణరెడ్డి పేరు పరిశీలన
ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డిని పక్కనపెట్టిన జగన్.. రెడ్డి సామాజికవర్గం వారికే అవకాశం ఇవ్వాలన్న తన నిర్ణయాన్ని మరోసారి స్పష్టం చేశారు. తిరుపతి జిల్లా చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి పోటీచేయాలని ఆశించినప్పటికీ స్థానిక నాయకుల నుంచి సానుకూలత రాలేదని సమాచారం. దీంతో కనిగిరికి చెందిన రెడ్డి కార్పొరేషన్ ఛైర్మన్ సత్యనారాయణరెడ్డి పేరును పరిశీలనలోకి తీసుకున్నట్లు సమాచారం.
ఒంగోలు నుంచే బాలినేని
ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి అడిగిన నివేశన స్థలాలకు అవసరమైన భూసేకరణ కోసం రూ.180 కోట్ల విడుదలకు గురువారం మధ్యాహ్నం ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. బుధవారం సాయంత్రమే మౌలిక సదుపాయాల కల్పనకు రూ.21 కోట్లను కలెక్టర్ మంజూరు చేశారు. దీంతో తాను ఒంగోలులోనే పోటీచేస్తానని సీఎం జగన్‌కు బాలినేని చెప్పినట్లు తెలిసింది. ఆమేరకు సోమవారం ఒంగోలులో పేదలపక్షపాతి బాలినేని అనే పేరుతో ర్యాలీ నిర్వహణకు ఆయన అనుచరులు సన్నాహాలు చేస్తున్నారు. గురువారం రాత్రి విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్లిన బాలినేని సోమవారం ఒంగోలు రానున్నారు.
మహీధరరెడ్డితో భేటీ
కందుకూరు ఎమ్మెల్యే మహీధరరెడ్డి కూడా ముఖ్యమంత్రిని కలిశారు. ఒకదశలో బొట్ల రామారావు పేరును పరిశీలనలోకి తీసుకున్న జగన్ తాజాగా కనిగిరి ఎమ్మెల్యే బుర్రాను కందుకూరుకు మార్చాలని భావించారు. బుర్రా అందుకు సిద్ధపడకపోగా, మహీధర్‌రెడ్డికోసం నెల్లూరు ఎంపీగా పోటీచేయబోతున్న వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి గట్టిగా పట్టుబట్టినట్లు తెలిసింది. ఈనేపథ్యంలో మహీధర్‌రెడ్డితో సీఎం.. ‘పరిస్థితులు ఎలా ఉన్నాయి. అభ్యర్థుల ఎంపికలో పార్టీ ఆలోచనాధోరణిపై మీ అభిప్రాయం ఏమిటి?’ అని అడిగినట్లు తెలిసింది. ఆతర్వాత రెండురోజుల్లో సముచిత నిర్ణయం తీసుకుంటానని చెప్పినట్లు తెలిసింది. మీరు ఏ నిర్ణయం తీసుకున్నా అభ్యంతరం లేదని మహీధర్‌రెడ్డి కూడా సూటిగానే ఆయనతో చెప్పారు. అయితే మానుగుంట వైపే జగన్ మొగ్గుచూపుతున్నట్లు సమాచారం.
గిద్దలూరుపై సస్పెన్స్
గిద్దలూరు అభ్యర్థి ఎంపికపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. బాలినేని ఒంగోలు నుంచే తిరిగి పోటీచేయటం ఖాయమవడంతో అక్కడ రెడ్డి సామాజికవర్గానికి చెందిన మరో నాయకుడిని రంగంలోకి దించాలని నిర్ణయించుకున్నారు. ఎమ్మెల్యే బాలినేని కుమారుడు ప్రణీత్‌రెడ్డి, రెడ్డి కార్పొరేషన్ ఛైర్మన్ సత్యనారాయణరెడ్డి తదితర కొన్ని పేర్లు పరిశీలనకు వచ్చినట్లు సమాచారం. అయితే రెడ్డి సామాజికవర్గంలోనే స్థానికుడికి అవకాశం ఇవ్వాలన్న భావనకు వచ్చినట్లు తెలిసింది. ఎమ్మెల్యే రాంబాబుపై అసమ్మతిబావుటా ఎగురవేసిన రమణారెడ్డితోపాటు మరో ఒకట్రెండు పేర్లు పరిశీలిస్తున్నట్లు సమాచారం.
Updated Date - Jan 18 , 2024 | 11:30 PM