వైసీపీలో దళిత, బీసీలకు గౌరవం లేదు: ఎంఎస్ రాజు
ABN, Publish Date - Jan 29 , 2024 | 02:21 AM
వైసీపీలోని దళిత, బీసీ, మైనార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలకు కనీస గౌరవం లేదని టీడీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ఎంఎస్ రాజు మండిపడ్డారు. అనంతపురంలోని టీడీపీ జిల్లా
అనంతపురం అర్బన్, జనవరి 28: వైసీపీలోని దళిత, బీసీ, మైనార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలకు కనీస గౌరవం లేదని టీడీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ఎంఎస్ రాజు మండిపడ్డారు. అనంతపురంలోని టీడీపీ జిల్లా కార్యాలయంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. దళిత మంత్రులు, ఎమ్మెల్యేలను సీఎం జగన్ రబ్బరు స్టాంపులుగా మార్చాడన్నారు. వైసీపీలో 28 మంది దళిత ఎమ్మెల్యేల్లో 23 మందికి సీట్లు ఇవ్వకపోవడం, స్థానచలనం చేయడం చూస్తుంటే దళితులపై జగన్‌కు ఏ పాటి చిత్తశుద్ధి ఉందో అర్థమవుతోందన్నారు.
టీడీపీ హయాంలో దళితులకు అమలుపర్చిన 27 సంక్షేమ పథకాలు సీఎం జగన్ రద్దు చేశాడన్నారు. రూ.28వేలకోట్ల ఎస్సీ, ఎస్టీ సబ్‌స్లాన్ నిధులు ఇతర పథకాలకు మళ్లించాడని, 50వేల బ్యాక్‌లాగ్ పోస్టులు భర్తీ చేయకుండా దళితులను నిరుద్యోగులుగా మిగిల్చాడని, 188 మంది దళితులను ఊచకోత కోసిన దుర్మార్గుడని మండిపడ్డారు. ఇప్పటికైనా వైసీపీలోని దళిత, బీసీ, మైనార్టీ ఎమ్మెల్యేలకు సిగ్గు, పౌరుషం ఉంటే వెంటనే రాజీనామా చేసి బయటకు రావాలన్నారు. సామాజిక న్యాయం టీడీపీతోనే సాధ్యమని, రాబోయే ఎన్నికల్లో టీడీపీ విజయానికి అందరూ కృషి చేయాలని కోరారు.
Updated Date - Jan 29 , 2024 | 07:20 AM