జిల్లాలో కొత్త రేషన్ దుకాణాలు
ABN, Publish Date - Oct 17 , 2024 | 01:12 AM
రేషన్ కార్డుల బైఫర్‌కేషన్ ప్రక్రియతో ఎన్టీఆర్ జిల్లాలో కొత్తగా 80 రేషన్ దుకాణాలు ఏర్పడబోతున్నాయి. విజయవాడ రెవెన్యూ డివిజన్ పరిధిలో అత్యధికంగా 61 రేషన్ దుకాణాలు కొత్తగా ఏర్పాటు కానున్నాయి.
ఆంధ్రజ్యోతి, విజయవాడ: రేషన్ కార్డుల బైఫర్‌కేషన్ ప్రక్రియతో ఎన్టీఆర్ జిల్లాలో కొత్తగా 80 రేషన్ దుకాణాలు ఏర్పడబోతున్నాయి. విజయవాడ రెవెన్యూ డివిజన్ పరిధిలో అత్యధికంగా 61 రేషన్ దుకాణాలు కొత్తగా ఏర్పాటు కానున్నాయి. ఇందులోనూ విజయవాడ నగరంలోనే అత్యధిక సంఖ్యలో ఉన్నట్టు తెలుస్తోంది. తిరువూరు రెవెన్యూ డివిజన్ పరిధిలో 10 రేషన్ దుకాణాలకు, నందిగామ రెవెన్యూ డివిజన్ పరిధిలో 9 రేషన్ దుకాణాలు ఏర్పాటు కానున్నాయి. నూతన చౌక దుకాణాలకు సంబంధించి త్వరలోనే నోటిఫికేషన్ వెలువడనుంది. డీలర్ల ఎంపికకు సంబంధించి రాతపరీక్ష విధానంలో మెరిట్ ఆధారంగా ఎంపిక చేసే అవకాశం ఉంది. రాతపరీక్షలు ఉత్తీర్ణులైన వారిని విద్యార్హతలు, రిజర్వేషన్ల ప్రాతిపదికన ఎంపిక చేసే పరిస్థితి కనిపిస్తోంది. రేషన్ డీలర్ల నోటిఫికేషన్‌తో ఎన్టీఆర్ జిల్లాలో 80 మందికి ఉపాధి అవకాశాలు లభించే పరిస్థితి ఏర్పడబోతోంది.
అభ్యంతరాల తిరస్కరణ
జిల్లా వ్యాప్తంగా రేషన్ డీలర్లు విజయవాడ, నందిగామ, తిరువూరు ఆర్‌డీవోలకు తమ అభ్యంతరాలను తెలిపారు. అభ్యంతరాలను పరిశీలిస్తే.. గత వైసీపీ ప్రభుత్వంలో సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసిన క్రమంలో సచివాలయాల ప్రాతిపదికన మ్యాపింగ్ చేశారని, అది కూడా నాలుగేళ్లు కావస్తోందన్నారు. తర్వాత మధ్యలో ఎక్కడా మ్యాపింగ్‌ను క్రమబద్దీకరణ చేయలేదన్నారు. చాలామంది చనిపోయిన వారున్నారని, వేరే ప్రాంతాలకు వెళ్లిపోయిన వారున్నారని ముందు ఈ సమస్యలను పరిష్కరించి తర్వాత బైఫర్‌కేషన్‌ను పరిశీలించాల్సిందిగా విజ్ఞప్తి చేశా రు. రేషన్ డీలర్ల అభ్యంతరాలు ప్రభుత్వ మార్గదర్శకాలకు విరుద్ధంగా ఉన్నాయంటూ ఆర్‌డీవోలు కొట్టివేశారు. దీనిపై మళ్లీ రేషన్ డీలర్ల సంఘం కోర్టును ఆశ్రయించేందుకు సన్నాహాలు చేస్తోంది.
Updated Date - Oct 17 , 2024 | 07:48 AM