కొత్త పారిశ్రామిక విధానాలు భేష్
ABN, Publish Date - Oct 18 , 2024 | 04:08 AM
రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన కొత్త పారిశ్రామిక విధానాలు పరిశ్రమలకు ఊతమిచ్చేలా ఉన్నాయని రాష్ట్ర పరిశ్రమల సమాఖ్య (ఏపీ ఛాంబర్స్) ప్రతినిధులు కొనియాడారు.
ఇవి దేశంలోనే అత్యద్భుతమైన విధానాలు
పరిశ్రమల సమాఖ్య ప్రతినిధుల ప్రశంసలు
అమరావతి, అక్టోబరు 17(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన కొత్త పారిశ్రామిక విధానాలు పరిశ్రమలకు ఊతమిచ్చేలా ఉన్నాయని రాష్ట్ర పరిశ్రమల సమాఖ్య (ఏపీ ఛాంబర్స్) ప్రతినిధులు కొనియాడారు. దేశంలోనే అత్యద్భుతమైన విధానాలను రూపొందించినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రులు, కార్యదర్శులకు వారు కృతజ్ఞతలు తెలిపారు. గురువారం విజయవాడలోని ఏపీ ఛాంబర్స్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో సమాఖ్య అధ్యక్షుడు పొట్లూరి భాస్కరరావు మాట్లాడుతూ పెట్టుబడుల ఆకర్షణకు, రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి కొత్త పారిశ్రామిక పాలసీలు దోహదపడతాయని చెప్పారు. కొత్త పాలసీలతో పారిశ్రామికవేత్తలకు చేకూరే ప్రయోజనాలను సమాఖ్య ప్రధాన కార్యదర్శి బి.రాజశేఖర్, ఏపీ ఎంఎ్‌సఎంఈ ఇండస్ట్రీస్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ రామచంద్రరావు, ఏపీ ఛాంబర్స్ ఎనర్జీ కమిటీ వైస్ చైర్మన్ ఫణిచంద్ర, అఫిలియేట్స్ కౌన్సిల్ వైస్ చైర్మన్ రాధిక, ఛాంబర్స్ బోర్డు సభ్యురాలు అపర్ణ వివరించారు. రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించిన ఆరు నూతన పారిశ్రామిక పాలసీల్లో గతంలో ఎన్నడూ లేని విధంగా పెట్టుబడిదారులకు భారీ ప్రోత్సాహకాలు ప్రకటించడం ప్రశంసనీయమన్నారు. ఈ పాలసీల అమలుకు ఉత్తర్వులు జారీ చేసి, మార్గదర్శకాలను విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. కొత్త పాలసీలు అమలులోకి వస్తే రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతి పరుగులు పెడుతుందని అభిప్రాయపడ్డారు.
Updated Date - Oct 18 , 2024 | 04:10 AM