ఇంటర్‌లో ఎన్‌సీఈఆర్‌టీ సిలబస్
ABN, Publish Date - Sep 21 , 2024 | 03:43 AM
ప్రభుత్వ జూనియర్ కాలేజీలను పటిష్ఠం చేసి, వాటిలో చదివే విద్యార్థులు జాతీయస్థాయి పోటీ పరీక్షల్లో రాణించేలా తీర్చిదిద్దే దిశగా ఇంటర్ విద్యాశాఖ సంస్కరణలకు శ్రీకారం చుట్టింది.
వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు.. కీలక నిర్ణయం తీసుకున్న ఇంటర్ బోర్డు
పరీక్షలు యథాతథం.. గణితంలో 2 పేపర్లు
జాతీయ స్థాయిలో పోటీపడేలా బోధన
ప్రైవేటు కళాశాలలతోనూ కీలక చర్చలు
అన్ని కాలేజీల్లో రెమిడియల్ తరగతులు
జిల్లాల్లో అకడమిక్ పర్యవేక్షణ కేంద్రాలు
సంస్కరణల దిశగా ఇంటర్మీడియెట్ బోర్డు
అమరావతి, సెప్టెంబరు 20(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ జూనియర్ కాలేజీలను పటిష్ఠం చేసి, వాటిలో చదివే విద్యార్థులు జాతీయస్థాయి పోటీ పరీక్షల్లో రాణించేలా తీర్చిదిద్దే దిశగా ఇంటర్ విద్యాశాఖ సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. 2025-26 విద్యా సంవత్సరం నుంచి మొత్తం పాఠ్యాంశాలను(సిలబస్) మార్చేయాలని నిర్ణయించింది. ఇప్పటివరకు స్టేట్ సిలబస్ పుస్తకాలు అమ ల్లో ఉండగా వాటి స్థానంలో ఎన్‌సీఈఆర్‌టీ సిలబ్‌సను ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. సిలబ్‌సను ఎన్‌సీఈఆర్‌టీలోకి మార్చినా పరీక్షల విధానం యథాతథంగానే కొనసాగించనుంది. ఎన్‌సీఈఆర్‌టీలో గణితం ఒక్కటే సబ్జెక్టుగా ఉంటుంది. కానీ రాష్ట్రంలో ఇంటర్‌లో గణితం 2సబ్జెక్టులుగా ఉంటుంది. దీనికోసం ఎన్‌సీఈఆర్‌టీ గణిత సిలబ్‌సను రెండుగా విభజించి 1ఏ, 1బీ, 2ఏ, 2బీలుగా అమలు చేయనుంది. జేఈఈ, సీయూఈటీ, క్లాట్ లాంటి పరీక్షల్లో వచ్చే ప్రశ్నలు ఎక్కువగా ఎన్‌సీఈఆర్‌టీ సిలబస్ ఆధారంగానే వస్తున్నాయని గుర్తించిన ప్రభుత్వం ఈ మేరకు మార్పులు చేయాలని నిర్ణయించింది. రాష్ట్రంలోని ప్రైవేటు ఇంటర్ కాలేజీలు చాలా వరకు ఎన్‌సీఈఆర్‌టీ సిలబ్‌సనే అనుసరిస్తున్నా యి. ఆ కారణంగానే ప్రైవేటు కాలేజీల్లో చదువుతున్న విద్యార్థులు ఐఐటీల్లో సీట్లు ఎక్కువగా సాధిస్తున్నారు. ఆ దిశగా ప్రభుత్వ కాలేజీల్లోని విద్యార్థులను కూడా మెరుగుపరచాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. దీనిలో భాగంగా ఇటీవల ఇంటర్ విద్యాశాఖ కమిషనర్ కృతికా శుక్లా.. నారాయణ, శ్రీచైతన్యలాంటి ప్రముఖ విద్యా సంస్థల అకడమిక్ ప్రతినిధులతో చర్చ లు జరిపారు. వారు అనుసరిస్తున్న బోధనా విధానాలను అడిగి తెలుసుకున్నారు. కొన్నింటిని ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ప్రవేశపెట్టాలని నిర్ణయించారు.
విద్యార్థి ట్రాకింగ్
ప్రైవేటు కాలేజీల్లో విద్యార్థులపై ట్రాకింగ్ విధానం అమల్లో ఉంది. విద్యార్థులకు తరచూ పరీక్షలు నిర్వహించడం, వారు ఏ స్థాయిల్లో ఉన్నారో గుర్తించి దానికి అనుగుణంగా రెమిడియల్ తరగతులు నిర్వహించడం లాంటి బోధనా విధానం ఉంది. అలాంటి విధానాన్నే ప్రభుత్వ కాలేజీల్లోనూ ప్రవేశపెట్టనున్నారు. ప్రతి విద్యార్థి సామర్థ్యాలను అంచనా వేయడం దీని ప్రధాన ఉద్దేశం. ప్రస్తుత విధానంలో విద్యార్థులు కొన్ని సబ్జెక్టుల్లో వెనకబడినా వారిని మెరుగుపరిచే విధానం లేదు. ఇకపై విద్యార్థులను ట్రాకింగ్ చేస్తూ నిత్యం వారి అభ్యసన సామర్థ్యాలు పెంచాలని నిర్ణయించారు. దీనిలో భాగంగా అంతర్గత పరీక్షల విధానాన్ని సెంట్రలైజ్ చేశారు. గతంలో యూనిట్ పరీక్షలు, క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ పరీక్షలకు కాలేజీల్లోనే ప్రశ్నపత్రాలు తయారు చేసేవారు. వారికి వీలున్నప్పుడు పరీక్షలు నిర్వహించేవారు. ఈ క్రమంలో కొందరు విద్యార్థులు అంతర్గత పరీక్షలు రాయట్లేదని తేలింది. దీంతో అన్ని పరీక్షలను నిర్దేశిత తేదీల్లోనే నిర్వహించాలని, వాటికి ప్రశ్న పత్రాలు ఇంటర్ బోర్డు నుంచి పంపాలని నిర్ణయించారు. అలాగే విద్యార్థుల మార్కులు ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేసి తరచూ సమీక్షించనున్నారు. ప్రైవేటు కాలేజీల తరహాలో రెమిడియల్ తరగతుల విధానాన్ని ప్రభుత్వ కాలేజీల్లో ఇటీవల ప్రారంభించారు. గతంలో జనవరి నుంచి ఈ విధానం అమలు చేసేవారు. ఇకపై దీనిని నిరంతరం అమలుచేయాలని భావిస్తున్నారు. సాయంత్రం కాలేజీ ముగిసిన తర్వాత గంటసేపు ఈ తరగతులు నిర్వహిస్తున్నారు.
మార్గదర్శనం, పర్యవేక్షణ సెల్స్
విద్యార్థుల అభ్యసన స్థితిని పర్యవేక్షిస్తూ కాలేజీలకు మార్గదర్శనం చేసేందుకు అకడమిక్ గైడెన్స్, మానిటరింగ్ సెల్(కేంద్రం)ను జిల్లా స్థాయిలో ఏర్పాటు చేశారు. ఆర్జేడీ స్థాయిలోనూ ఈ సెల్స్ ఏర్పాటు చేస్తున్నారు. లైబ్రరీల్లోని జూనియర్ లెక్చరర్లు, వ్యాయామ విద్య బోధించే జూనియర్ లెక్చరర్లు ఈ సెల్స్‌లో పనిచేయనున్నారు. ఎప్పటికప్పుడు కాలేజీల డేటాను పర్యవేక్షిస్తూ, వారికి అవసరమైన గైడెన్స్ ఇస్తారు. అలాగే వచ్చే ఏడాది నుంచి మారనున్న సిలబ్‌సకు అనుగుణంగా జూనియర్ లెక్చరర్లకు శిక్షణ ఇవ్వనున్నారు. మారిన సిలబస్, కొత్త బోధనా విధానంపై వీరికి శిక్షణ ఇస్తారు.
Updated Date - Sep 21 , 2024 | 03:43 AM