నాసిన్ అకాడమీలో అగ్నిప్రమాదం
ABN, Publish Date - Jan 29 , 2024 | 02:13 AM
శ్రీసత్యసాయి జిల్లా గోరంట్ల మండలం పాలసముద్రం గ్రామ సమీపాన ఉన్న నాసిన్ (నేషనల్ అకాడమీ ఆఫ్ సెంట్రల్ ఎక్సైజ్, పరోక్ష పన్నులు, నార్కోటిక్స్) నూతన భవనంలో ఆదివారం మంటలు చెలరేగాయి.
లైబ్రరీ భవనంలో పెద్దఎత్తున మంటలు
వెల్డింగ్ పనులు చేస్తుండగా సిలిండర్ పేలడం వల్లే ప్రమాదం?
గోరంట్ల, జనవరి 28: శ్రీసత్యసాయి జిల్లా గోరంట్ల మండలం పాలసముద్రం గ్రామ సమీపాన ఉన్న నాసిన్ (నేషనల్ అకాడమీ ఆఫ్ సెంట్రల్ ఎక్సైజ్, పరోక్ష పన్నులు, నార్కోటిక్స్) నూతన భవనంలో ఆదివారం మంటలు చెలరేగాయి. 503 ఎకరాల్లో రూ.541.63 కోట్లతో నిర్మించిన నాసిన్‌ను ఈ నెల 16న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన విషయం తెలిసిందే. అకాడమీలో భవన నిర్మాణ పనులు పూర్తికాకపోయినా, ప్రారంభోత్సవం నిర్వహించారన్న విమర్శలు వినిపించాయి. ఆకాడమీ పరిపాలన భవనంలోని లైబ్రరీ భవనంలో ఉదయం 11.30 గంటల సమయంలో పెద్దఎత్తున మంటలతో దట్టమైన పొగలు కమ్మేశాయి. సమీప గ్రామాల ప్రజలు గుర్తించి, ఫొటోలు తీయడంతో విషయం వెలుగుచూసింది. ఆకాడమీలో అసంపూర్తిగా ఉన్న పనులు పూర్తి చేసే క్రమంలో వెల్డింగ్ పనులు చేస్తుండగా సిలిండర్ పేలి మంటలు వ్యాపించినట్టు తెలిసింది. షార్ట్ సర్క్యూట్ కారణమనే వాదనలూ వినిపిస్తున్నాయి. మంటలు చెలరేగిన వెంటనే పెనుకొండ నుంచి వచ్చిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. నూతన భవనం అద్దాలు, ఏసీ మిషన్లు తదితర సామగ్రి పూర్తిగా కాలిపోయి పెద్దఎత్తున ఆస్తి నష్టం వాటిల్లినట్లు తెలిసింది. ఆకాడమీలోకి ఎవ్వరినీ అనుమతించకపోవడంతో అగ్ని ప్రమాదానికి కారణాలు, ఆస్తినష్టం వివరాలు తెలియరాలేదు.
Updated Date - Jan 29 , 2024 | 02:13 AM