Nara Lokesh : గల్ఫ్ బాధితులకు లోకేశ్ అండ
ABN, Publish Date - Nov 11 , 2024 | 04:41 AM
పొట్ట కూటి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లిన ఎందరో తెలుగువాళ్లు మోసపోతున్నారు. అక్కడ కష్టాల్లో కూరుకుపోతున్నారు.
కష్టాల్లో ఉన్నవారికి ఆపన్నహస్తం
ఏజెంట్ల చేతిలో మోసపోయిన 20 మంది తెలుగువారికి విముక్తి
స్వస్థలాలకు వచ్చేందుకు సాయం
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
పొట్ట కూటి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లిన ఎందరో తెలుగువాళ్లు మోసపోతున్నారు. అక్కడ కష్టాల్లో కూరుకుపోతున్నారు. ఇలాంటి బాధితులను ఆదుకునేందుకు మంత్రి నారా లోకేశ్ ఆపన్న హస్త అందిస్తున్నారు. వారి చీకటి జీవితాల్లో వెలుగులు నింపేందుకు సాయం చేస్తున్నారు. తన దృష్టికి వస్తున్న సమస్యలపై వెంటనే స్పందిస్తున్నారు. వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తున్నారు. ఏజెంట్ల ద్వారా మోసపోయి గల్ఫ్‌లో చిక్కుకున్న దాదాపు 20 మందిని స్వస్థలాలకు రప్పించారు. తాము ఇబ్బందుల్లో ఉన్నామని వాట్సాప్, ఎక్స్, ఫేస్‌బుక్ వంటి సామాజిక మాధ్యమాల ద్వారా మెసేజ్‌లు పంపిన వారికి అండగా నిలిచారు. ప్రభుత్వ పరంగానే కాక టీడీపీకి అనుబంధంగా పని చేసే ఎన్నారై టీడీపీ బృందాలను రంగంలోకి దించి కష్టాల నుంచి గట్టెక్కించారు. ఇలా లోకేశ్ నుంచి సాయం పొందిన బాధితులు.. ముగిసి పోయిందనుకున్న తమ జీవితాల్లో ఆయన వెలుగులు నింపారని అంటున్నారు.
జీవితాంతం గుర్తు పెట్టుకుంటా
హౌస్ మెయిడ్ పని కోసం ఏజెంట్ ద్వారా ఒమన్‌కు వెళ్లాక రాత్రింబవుళ్లు పని చేయించేవారు. ముక్కు, నోటి నుంచి రక్తం వచ్చినా ఎవరూ పట్టించుకోలేదు. ఏజెంట్లు నన్ను మోసం చేసిన విషయాన్ని నా మామ, మరిదికి ఫోన్‌లో తెలియజేశాను. మా కుటుంబసభ్యులు రాజానగరంలో టీడీపీ నేతల ద్వారా ఈ విషయాన్ని మంత్రి లోకేశ్‌కు తెలియజేశారు. ఆయన ఎన్నారై టీడీపీ నాయకులు చెప్పడంతో వారు నేనున్న ప్రాంతాన్ని గుర్తించారు. తనకు లక్ష ఇస్తే కానీ నన్ను వెనక్కి పంపనంటూ అక్కడి ఏజెంట్ చెప్పారు. దీంతో ఆ దేశంలోని ఎంబసీతో మాట్లాడి నన్ను స్వస్థలానికి పంపారు. మంత్రి లోకేశ్ చేసిన సాయం జీవితాంతం గుర్తు పెట్టుకుంటా.
- కొత్తపల్లి ప్రియాంక,
రఘునాథపురం, తూర్పుగోదావరి జిల్లా లోకేశ్ చొరవతో స్వస్థలానికి
ఇంట్లో పని చేయడానికి అని చెప్పి సౌదీ అరేబియాకు తీసుకెళ్లి ఎడారిలో గొర్రెలు, ఒంటెలకు కాపలా పెట్టారు. సరైన భోజనం పెట్టేవారు కాదు. నోటి వెంట రక్తం వచ్చినా పట్టించుకోలేదు. నా పరిస్తితిని తెలియజేస్తూ సెల్‌లో వీడియో తీసి మిత్రులకు పంపాను. వారు ఎక్స్ ద్వారా మంత్రి లోకేశ్‌కు తెలిపారు. ఆయన వెంటనే స్పందించి ఎన్నారై టీడీపీ వారిని నా వద్దకు పంపారు. ఎంబసీతో మాట్లాడి నేను మళ్లీ స్వస్థలం రావడానికి సాయం చేశారు. లోకేశ్ మేలు జీవితంలో మర్చిపోలేను.
- సరెళ్ల వీరేంద్రకుమార్, ఇసుకపూడి,
తూర్పుగోదావరి జిల్లా
కువైట్‌కు వెళ్లి మోసపోయా
నెలకు రూ.52 వేలు జీతం ఇస్తారని, వంట పని చేయాలని చెబితే ఏజెంట్ ద్వారా కువైట్ వెళ్లాను. తీరా అక్కడకు వెళ్లాక హౌస్ మెయిడ్ పని అప్పగించడంతో నేను మోసపోయానని తెలిసింది. రోజుకు 20 గంటలకుపైగా పని చేయించేవారు. అంతేగాక జీతం రూ.22 వేలే ఇచ్చారు. విరామం లేకుండా పని చేయించడంతో నా ఎడమ చేయి నరం దెబ్బతింది. నా కష్టాలను నా భర్తకు చెప్పాను. ఆయన ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి ద్వారా మంత్రి లోకేశ్ దృష్టికి తీసుకెళ్లారు. ఆయన ఏపీ ఎన్నార్టీ, ఎన్నారై టీడీపీ వారిని అప్రమత్తం చేశారు. ఎన్నారై టీడీపీ వారు ఎంబసీ, ఏజెంట్లతో మాట్లాడి నన్ను స్వస్థలానికి పంపే ఏర్పాట్లు చేశారు. అక్కడ తీవ్ర అనార్యోగం పాలైన నేను హైదరాబాద్‌లో వైద్యం చేయించుకున్నాను. మంత్రి లోకేశ్‌కు మా కుటుంబం రుణపడి ఉంటుంది.
- నమిడి ప్రమీల, అనపర్తి, తూర్పుగోదావరి జిల్లా
Updated Date - Nov 11 , 2024 | 04:42 AM