ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఎమ్మెల్సీ రఘురాజుకు ఊరట

ABN, Publish Date - Nov 07 , 2024 | 05:10 AM

ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజుకు హైకోర్టులో ఊరట లభించింది. ఎమ్మెల్సీగా ఆయన సభ్యత్వాన్ని పునరుద్ధరిస్తూ బుధవారం ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది.

ఎమ్మెల్సీగా సభ్యత్వం పునరుద్ధరించిన హైకోర్టు

వాదన వినకుండా సభ్యత్వం రద్దు సరికాదు

అది సహజ న్యాయసూత్రాలకు విరుద్ధం

వాదన విని నిర్ణయం వెలువరించండి

అప్పటిదాకా సభ్యత్వం పునరుద్ధరిస్తున్నాం: హైకోర్టు

మండలి చైర్మన్‌ ఇచ్చిన ఉత్తర్వులు రద్దు

అమరావతి, నవంబరు 6 (ఆంధ్రజ్యోతి): ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజుకు హైకోర్టులో ఊరట లభించింది. ఎమ్మెల్సీగా ఆయన సభ్యత్వాన్ని పునరుద్ధరిస్తూ బుధవారం ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. వాదన వినిపించేందుకు అవకాశం ఇవ్వకుండా రఘురాజుపై అనర్హత వేటు వేస్తూ శాసనమండలి చైర్మన్‌ తీసుకున్న నిర్ణయాన్ని తప్పుపట్టింది. చైర్మన్‌ చర్య సహజ న్యాయసూత్రాలు, చట్ట నిబంధనలకు విరుద్ధమని పేర్కొంది. ఎమ్మెల్సీగా గెలిచిన పార్టీకి వ్యతిరేకంగా కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలతో అనర్హత వేటు వేస్తూ శాసనమండలి చైర్మన్‌ ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు రద్దు చేసింది. ఈ వ్యవహారాన్ని తిరిగి శాసనమండలి చైర్మన్‌ వద్దకు పంపింది. పిటిషనర్‌ వాదన విని తగిన నిర్ణయం వెల్లడించాలని స్పష్టం చేసింది. అప్పటివరకు రఘురాజు సభ్యత్వాన్ని పునరుద్ధరిస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ జీ నరేందర్‌, జస్టిస్‌ టీ చంద్ర ధనశేఖర్‌తో కూడిన ధర్మాసనం బుధవారం తీర్పు ఇచ్చింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకుపాల్పడుతున్నారని శాసనమండలి వైసీపీ పక్ష విప్‌ పాలవలస విక్రాంత్‌ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా తనపై అనర్హత వేటు వేస్తూ శాసనమండలి చైర్మన్‌ కొయ్యే మోషేన్‌ రాజు ఈ ఏడాది జూన్‌ 3న ఇచ్చిన ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ ఇందుకూరి రఘురాజు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. మండలి చైర్మన్‌ ఉత్తర్వుల అమలును నిలుపుదల చేయాలని కోరారు.

ఈ వ్యాజ్యం బుధవారం మరోసారి విచారణకు వచ్చింది. పిటిషనర్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది జంధ్యాల రవిశంకర్‌ వాదనలు వినిపించారు. పిటిషనర్‌కు 2027 నవంబరు 27వరకు ఎమ్మెల్సీగా కొనసాగేందుకు అర్హత ఉందన్నారు. రఘురాజు సతీమణి తెలుగుదేశం పార్టీలో చేరారనే కారణంగా ఆయనపై అనర్హత వేటు వేయాలని వైసీపీ ఫిర్యాదు చేసిందన్నారు. సతీమణి చర్యలకు పిటిషనర్‌ను బాధ్యుడిని చేయడం సరికాదని తెలిపారు. వైసీపీ గురించి పిటిషనర్‌ వ్యతిరేక ప్రకటనలు చేయలేదన్నారు. పత్రికలు, మీడియాలో వచ్చిన కథనాలు ఆధారంగా పిటిషనర్‌ పై అనర్హత వేటు వేశారని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వకేట్‌ జనరల్‌ వాదనలు వినిపిస్తూ... పిటిషనర్‌ విషయంలో శాసనమండలి చైర్మన్‌ సహజ న్యాయసూత్రాలను అనుసరించలేదన్న వాదనతో ఏకీభవిస్తున్నామన్నారు. ఇరువైపుల వాదనలు పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం...‘పత్రికలు, మీడియాలో వచ్చిన కథనాల ఆధారంగా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని పిటిషనర్‌ పై ఫిర్యాదు చేసినట్లు కనపడుతోంది. ఆ కథనాల్లో వాస్తవికత ఎంతో చైర్మన్‌ తేల్చలేదు. తన భార్యతో పాటు అనుచరులను పార్టీ మారాలంటూ పిటిషనర్‌ ప్రోత్సహించినట్లు ఆధారాలు లేవు. శస్త్ర చికిత్స నిమిత్తం ఆస్పత్రిలో చేరానని, విచారణను వాయిదావేయాలని పిటిషనర్‌....మండలి చైర్మన్‌ను అభ్యర్థించారు.

అయితే సంబంధిత డాక్టర్‌ నుంచి ధ్రువీకరణ పత్రం సమర్పించలేదని, ఆస్పత్రి పరిపాలనాధికారి ఇచ్చిన సర్టిఫికెట్‌ చెల్లుబాటు కాదంటూ చైర్మన్‌ విచారణను కొనసాగించడాన్ని తప్పుపట్టింది. సంబంధిత సర్టిఫికెట్‌ నకిలీదని చైర్మన్‌ నిర్ధారించని విషయాన్ని ప్రస్తావించింది. ‘‘ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాలను విమర్శించడం, వ్యక్తుల నిర్ణయాలకు వ్యతిరేకంగా భావాలను వ్యక్తీకరించడం పార్టీ వ్యతిరేక కార్యకలాపాలుగా గుర్తించలేం. భార్య చర్యలను ఖండించలేదనే కారణంతో అనర్హత వేటు వేయడం సరికాదు. పిటిషనర్‌ పై అనర్హత వేటు వేసేందుకు చైర్మన్‌ ఇచ్చిన ఉత్తర్వులలో ఒక్కటి కూడా సరైన కారణం లేదు. వాదనలు చెప్పుకొనేందుకు అవకాశం కల్పించకుండా అనర్హత వేటు వేయడం సహజ న్యాయసూత్రాలకు విరుద్ధమని సుప్రీంకోర్టు, వివిధ హైకోర్టులు పలు తీర్పులు ఇచ్చాయి. అందువల్ల, అనర్హత వేటు వేస్తూ శాసనమండలి చైర్మన్‌ ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేస్తున్నాం. పిటిషనర్‌ వాదన విని తగిన నిర్ణయం వెల్లడించేందుకు వీలుగా వ్యవహారాన్ని తిరిగి ట్రైబ్యునల్‌ (మండలి చైర్మన్‌) వద్దకు పంపిస్తున్నాం. అప్పటివరకు వరకు రఘురాజు సభ్యత్వాన్ని పునరుద్ధరిస్తున్నాం’’ అని ధర్మాసనం తన ఉత్తర్వుల్లో పేర్కొంది.

Updated Date - Nov 07 , 2024 | 05:10 AM