ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మాగుంట పార్వతమ్మ కన్నుమూత

ABN, Publish Date - Sep 26 , 2024 | 03:36 AM

మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యే మాగుంట పార్వతమ్మ (77) బుధవారం తెల్లవారుజామున కనుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె బుధవారం చెన్నైలో తుది శ్వాస విడిచారు. మాగుంట కుటుంబంలో పెద్ద దిక్కుగా ఉన్న పార్వతమ్మ మృతి ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది.

సీఎం చంద్రబాబు, వెంకయ్య నాయుడు సహా పలువురు ప్రముఖుల సంతాపం

ప్రభుత్వ లాంఛనాలతో నెల్లూరులో నేడు అంత్యక్రియలు

చెన్నై, నెల్లూరు, అమరావతి, సెప్టెంబరు 25(ఆంధ్రజ్యోతి): మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యే మాగుంట పార్వతమ్మ (77) బుధవారం తెల్లవారుజామున కనుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె బుధవారం చెన్నైలో తుది శ్వాస విడిచారు. మాగుంట కుటుంబంలో పెద్ద దిక్కుగా ఉన్న పార్వతమ్మ మృతి ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. 1947 జూలై 27న నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలో బెజవాడ రామిరెడ్డి, భూదేవమ్మ దంపతులకు ఆమె జన్మించారు. 1967 ఫిబ్రవరి 19న మాగుంట సుబ్బరామిరెడ్డితో వివాహం జరిగింది. ఆయన మరణానంతరం రాజకీయాల్లోకి ప్రవేశించిన ఆమె... 1996లో ఒంగోలు ఎంపీగా, 2004లోగా కావలి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2012లో ఒంగోలు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసి ఓటమి పాలయ్యారు. భర్త ఆశయాలకు అనుగుణంగా, రాజకీయాల పరంగా ఒంగోలు, కావలి ప్రాంతాల్లో పార్వతమ్మ తనదైన ముద్ర వేసుకున్నారు. పార్వతమ్మ భౌతికకాయాన్ని బుధవారం మధ్యాహ్నం చెన్నై నుంచి నెల్లూరుకు తీసుకొచ్చారు. పార్వతమ్మ దంపతులకు ఇద్దరు సంతానం. కుమారుడు విజయ్‌బాబు అనారోగ్యంతో గత ఏప్రిల్‌లో మృతి చెందడంతో మనోవేదనకు గురయ్యారు. పార్వతమ్మ పార్థివ దేహాన్ని నగరంలోని సరస్వతినగర్‌లో ఉన్న నివాసంలో అభిమానుల సందర్శనార్థం ఉంచారు. గురువారం మధ్యాహ్నం పార్వతమ్మ అంతిమయాత్ర ప్రారంభమవుతుంది. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియ లు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

పార్వతమ్మ మృతి బాధాకరం: సీఎం

పార్వతమ్మ మృతిపట్ల పలువురు ప్రముఖులు దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. మాగుంట పార్వతమ్మ అనారోగ్యంతో మృతి చెందడం బాధాకరమని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, మంత్రు లు నారాయణ, ఆనం, స్వామి, శ్రీనివా్‌స వేర్వేరు ప్రకటనల్లో సంతాపం వ్యక్తం చేశారు. ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి, జడ్పీ చైర్‌పర్సన్‌ ఆనం అరుణ... పార్వతమ్మ భౌతికకాయానికి నివాళులర్పించారు. ఎమ్మెల్యేలు సోమిరెడ్డి, కోటంరెడ్డితోపాటు మాజీ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి, చెన్నైలోని పలువురు తెలుగు ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు, రాజకీయ నేతలు సంతాపం ప్రకటించారు.

Updated Date - Sep 26 , 2024 | 03:37 AM