యురేనియం తవ్వకాలను ఆపాలి
ABN, Publish Date - Nov 06 , 2024 | 11:52 PM
కప్పట్రాళ్ల రిజర్వు ఫారెస్టులో యురేనియం తవ్వకాలు ఆపే శక్తి ఏపీ సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌లకే ఉందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు.
కప్పట్రాళ్ల ప్రజలు నక్సలైట్లా? పోలీసులు బెదిరించేందుకు..
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ
దేవనకొండ, నవంబరు 6 (ఆంధ్రజ్యోతి) : కప్పట్రాళ్ల రిజర్వు ఫారెస్టులో యురేనియం తవ్వకాలు ఆపే శక్తి ఏపీ సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌లకే ఉందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. కప్పట్రాళ్ల గ్రామంలో సీపీఐ, సీపీఎం, సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ నాయకులు కప్పట్రాళ్ల గ్రామస్తులతో బుధవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగే యురేనియం తవ్వకాలు స్థానిక నాయకులకు ఎలాంటి సంబంధం లేదని, సీఎం చంద్రబాబు, జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ మాత్రమే దీన్ని ఆపగలరని అన్నారు. యురేనియం తవ్వకాలతో ప్రజలు అనారోగ్యాల బారినపడతారని, భూముల సారం కోల్పోయి పంటలు పండవని అన్నారు. హంద్రీ నీవా కాలువ నీటితో బంగారం పండే పొలాలు నాశనమవుతాయని రైతులు ఉద్యమం బాట పడ్డారని అన్నారు. ఆందోళనల్లో ఉన్న కప్పట్రాళ్ల ప్రజల ఇళ్లకు పోలీసులు అర్ధరాత్రి వెళ్లి బెదిరిస్తున్నారని, ఇది సరైంది కాదని, ఈ గ్రామాల ప్రజలు నక్సలైట్లు కాదని ఆయన అన్నారు. ఫ్యాక్షన్ వీడి ప్రశాంత వాతావరణంలో జీవిస్తున్న కప్పట్రాళ్ల ప్రజలను పోలీసులు ఎందుకు భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ప్రశ్నించారు. కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు పి. రామచంద్రమ్య, సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు గఫూర్, సీపీఐ జిల్లా కార్యదర్శి గిడ్డయ్య, సీపీఎం జిల్లా కార్యదర్శి గౌస్‌దేశాయ్, సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ నాయకులు నరసింహులు తదితరులు పాల్గొన్నారు.
పోలీసులు బెదిరిస్తున్నారు
మీడియా ప్రతినిధులను పత్తికొండ డీఎస్పీ ఆసాంఘిక శక్తులుగా వర్ణించడం తగదు. ప్రభుత్వానికి, ప్రజలకు వారధిగా నిలిచేది మీడియా. అర్ధరాత్రి కప్పట్రాళ్ల గ్రామంలో ప్రజల ఇళ్లకు పోలీసులు వెళ్లి యువకులను, రైతులను బెదిరించడం సరైనది కాదు.
- గఫూర్, సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు
తవ్వకాలను అడ్డుకుంటాం
పచ్చని పల్లెలు యురేనియం తవ్వకాలతో నాశనం అవుతాయి. రిజర్వు ఫారెస్టు పరిధిలోని గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ప్రజలకు అండగా ఉండి ఈ తవ్వకాలను అడ్డుకుంటాం.
-పి రామచంద్రయ్య, సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు
పోలీసుల బెదిరింపు సరికాదు
యురేనియం తవ్వకాలతో ఉనికే ప్రశ్నార్థకంగా మారిన ప్రజలను పోలీసులు బెదిరించడం సరి కాదు. తవ్వకాలపై ప్రభుత్వం ముందుకు వెళ్తే ఉద్యమాలను ఉధృతం చేస్తాం. తవ్వకాలు జరపకుండా కేంద్ర ప్రభుత్వం అనుమతులు రద్దు చేయాలి.
-గిడ్డయ్య సీపీఐ జిల్లా కార్యదర్శి
తవ్వకాలతో జీవితాలు నాశనం
మండలంలో యురేనియం తవ్వకాలు జరిపితే ప్రజల జీవితాలు నాశనం అవుతాయి. గతంలో ముఠా కక్షలు వదిలి అభివృద్ధి దిశగా వెళ్తున్న గ్రామాల వద్ద యురేనియం తవ్వకాలు చేపట్టడం అన్యాయం. దీనితో ప్రజలు భయపడుతున్నారు.
-పి రామకృష్ణరెడ్డి, సీపీఐ నాయకుడు
Updated Date - Nov 06 , 2024 | 11:52 PM