బన్ని ఉత్సవాలకు గట్టి భద్రత
ABN, Publish Date - Oct 09 , 2024 | 11:27 PM
దసరా పండుగ సందర్భంగా 12వ తేదీ శనివారం దేవరగట్టు మాలమల్లేశ్వరస్వామి బన్ని ఉత్సవానికి గట్టి బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని ఎస్పీ జి. బిందు మాధవ్ తెలిపారు.
ఎస్పీ బిందుమాధవ్
కర్నూలు, అక్టోబరు 9: దసరా పండుగ సందర్భంగా 12వ తేదీ శనివారం దేవరగట్టు మాలమల్లేశ్వరస్వామి బన్ని ఉత్సవానికి గట్టి బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని ఎస్పీ జి. బిందు మాధవ్ తెలిపారు. బన్ని ఉత్సవం భద్రతా ఏర్పాట్లపై జిల్లా పోలీసు కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బన్ని ఉత్సవంలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 800 మంది పోలీసులతో భారీ భద్రతా ఏర్పాట్లు చేశామన్నారు. ఇందులో ఏడుగురు డీఎస్పీలు, 42 మంది సీఐలు, 54 మంది ఎస్‌ఐలు, 112 మంది ఏఎస్‌ఐలు, హెడ్ కానిస్టేబుళ్లు, 362 మంది కానిస్టేబుళ్లు, 50 మంది స్పెషల్‌పార్టీ పోలీసులు, 3 ప్ల్లటూన్ల ఏఆర్ పోలీసులు, 95 మంది హోంగార్డులు బన్ని ఉత్సవం బందోబస్తు విధుల్లో పాల్గొంటారని తెలిపారు. 100 నైట్ విజన్ సీసీ కెమెరాలు, 700 ఎల్‌ఈడీ లైట్లు, 5 డ్రోన్ కెమెరాలతో నిఘా ఉంచామన్నారు. అలాగే దేవరగట్టు పరిసర గ్రామాల్లో కార్డెన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించి 148 మందిపై బైండోవర్ కేసులు నమోదు చేశామన్నారు. 4 చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి అక్రమ మద్యం, నాటుసారా కట్టడికి గట్టి చర్యలు తీసుకుంటున్నామన్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించి నిబంధనలు ఉల్లంఘించి, అల్లర్లు, నిప్పులు విసరడం వంటివి చేస్తే కేసులు నమోదు చేస్తామన్నారు. దేవరగట్టు చుట్టుపక్కల నెరణికి, కొత్తపేట, అరికేర, ఎల్లార్తి గ్రామాల్లో పోలీసు, రెవెన్యూ శాఖల సమన్వయంతో అవగాహన సదస్సులు నిర్వహించామన్నారు. దేవరగట్టు పరిసర గ్రామాల్లో ప్రధాన రహదారుల్లోనే గాకుండా చిన్న చిన్న దారుల్లోనూ బందోబస్తులు, చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు చేస్తున్నామన్నారు. ఉత్సవంలో ఫైర్ సిబ్బంది, వైద్యసిబ్బంది, అంబులెన్సు సర్వీసులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నామన్నారు.
Updated Date - Oct 09 , 2024 | 11:27 PM