స్వర్ణాంధ్ర.. 2047 విజన్
ABN, Publish Date - Sep 20 , 2024 | 12:31 AM
స్వర్ణాంధ్ర. 2047 లక్ష్య సాధనలో భాగంగా జిల్లా, మండల స్థాయి ప్రణాళికలను రూపొందించాలని కలెక్టర్ పి. రంజిత్ బాషా అధికారులను ఆదేశించారు.
ప్రణాళికలతో ప్రతి శాఖనివేదిక రూపొందించాలి
15 శాతం వృద్ధి రేటు సాధించాలి
కలెక్టర్ పి. రంజిత్ బాషా
కర్నూలు(కలెక్టరేట్), సెప్టెంబరు 19: స్వర్ణాంధ్ర. 2047 లక్ష్య సాధనలో భాగంగా జిల్లా, మండల స్థాయి ప్రణాళికలను రూపొందించాలని కలెక్టర్ పి. రంజిత్ బాషా అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో స్వర్ణాంధ్ర..2047 ప్రణాళికల రూపకల్పనపై జిల్లా అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 15 శాతం వృద్ధిరేటు సాధించేలా ప్రణాళికలు ఉండాలని అధికారులకు సూచించారు. వ్యవసాయ అనుబంధ రంగాల్లో పరిశ్రమలు, మానవ వనరులు, వైద్య విధానం, సంక్షేమం మరింత అభివృద్ధి సాధించేలా ప్రణాళికలు ఉండాలన్నారు. టమోటా, ఉల్లి, ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటు, మార్కెటింగ్ అవకాశాలు పెంచడం, విద్యారంగంలో జీరో డ్రాపౌట్స్ రక్తహీనత తగ్గింపు, అక్షరాస్యత పెంపు తదితర అంశాలతో అభివృద్ధి ఎలా సాధించవచ్చు అని ఆలోచించి ప్రణాళికలను రూపొందించాలన్నారు. వంద రోజులు, వార్షిక, పంచవర్ష ప్రణాళికలను ప్రతి శాఖ రూపొందించాలని అన్నారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ డా.బి. నవ్య, డీఆర్వో చిరంజీవి, సీపీవో హిమప్రభాకర్ రాజు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
Updated Date - Sep 20 , 2024 | 12:31 AM