బదిలీల జాతర
ABN, Publish Date - Sep 24 , 2024 | 01:04 AM
జిల్లావ్యాప్తంగా బదిలీల ప్రక్రియ ప్రారంభమైంది. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం కొన్ని శాఖల్లో బదిలీలు జరగ్గా.. మరికొన్ని శాఖలకు కొత్తవారిని తీసుకొచ్చారు. ఒకటి, రెండు శాఖల్లో అయితే ఎక్కడ ఉండేవారు అక్కడే కొనసాగటం గమనార్హం. సోమవారం దాదాపు అన్ని శాఖల్లో పూర్తిస్థాయిలో బదిలీలు జరుగుతాయనుకుంటే, కొన్ని శాఖల పరిధిలోనే జరిగాయి. రిజిస్ర్టేషన్లు, పంచాయతీరాజ్, ఆర్టీసీ, ఆర్‌డబ్ల్యూఎస్ పరిధిలో ఉన్నతస్థాయిలో మాత్రమే బదిలీలు జరగ్గా, రెవెన్యూలో అసలు జరగనేలేదు. ఆర్‌డీవోలు, ఆర్‌ఐలు, డిప్యూటీ తహసీల్దార్లు, వీఆర్వోల బదిలీలకు సంబంధించి జాబితాలు రాలేదు. మంగళవారం పూర్తిస్థాయిలో జాబితాలు అందే అవకాశముంది. - విజయవాడ, ఆంధ్రజ్యోతి
రిజిస్ర్టేషన్లు, ఆర్‌డబ్ల్యూఎస్, పంచాయతీరాజ్, ఆర్టీసీ, సివిల్ సప్లయిస్‌లోనే..
రెవెన్యూలో మాత్రం జరగలేదు..!
నేడు భారీస్థాయిలో జాబితాలు అందే అవకాశం
రిజిస్ర్టేషన్ శాఖ పరిధిలో..
పటమట సబ్ రిజిస్ర్టార్‌గా రావులపాలెం నుంచి రేవంత్‌ను నియమించారు. గుణదల జాయింట్-1 సబ్ రిజిస్ర్టార్‌గా కృష్ణప్రసాద్ కొనసాగుతున్నారు. కృష్ణప్రసాద్ యూనియన్‌లో ఆఫీస్ బేరర్‌గా ఉండటం వల్ల ఆయన బదిలీ కాలేదు. గుణదల జాయింట్-2 సబ్ రిజిస్ర్టార్‌గా మండవల్లి నుంచి నందీశ్వరరావును నియమించారు. గాంధీనగర్ జాయింట్-2 సబ్ రిజిస్ర్టార్‌గా పనిచేస్తున్న చైతన్యను గుడివాడ సబ్ రిజిస్ర్టార్‌గా బదిలీ చేశారు. ఆయన స్థానంలో ఇంతకుముందు పటమట సబ్ రిజిస్ర్టార్‌గా నియమించిన ఆరిఫ్‌ను నియమించారు. గాంధీనగర్‌లో జాయింట్-1 సబ్ రిజిస్ర్టార్‌గా పనిచేసే ప్రసాద్‌ను గన్నవరం సబ్ రిజిస్ర్టార్‌గా బదిలీ చేశారు. గన్నవరం సబ్ రిజిస్ర్టార్‌గా పనిచేస్తున్న వెంకటేశ్వరరావును గాంధీనగర్ జాయింట్-1 సబ్ రిజిస్ర్టార్‌గా నియమించారు.
ఆర్‌డబ్ల్యూఎస్‌లో..
గ్రామీణ నీటి సరఫరా విభాగం (ఆర్‌డబ్ల్యూఎస్) సూపరింటెండెంట్ ఇంజనీర్ (ఎస్‌ఈ) రమణను నెల్లూరు జిల్లాకు బదిలీ చేశారు. ఆయన స్థానంలో గతంలో ఇక్కడ పనిచేసిన సత్యనారాయణను ఇన్‌చార్జిగా నియమించటం విమర్శలకు దారి తీస్తోంది. రెగ్యులర్ ఎస్‌ఈని కాదని ఇన్‌చార్జి ఎస్‌ఈని నియమిం చటంపై విమర్శలు వస్తున్నాయి. విజయవాడ ఇన్‌చార్జి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఈఈ)గా పనిచేస్తున్న ధవళేశ్వరపు రామలింగేశ్వర ప్రసాద్‌ను తిరిగి జగ్గయ్యపేట డీఈఈగా బదిలీ చేశారు. విజయవాడ సర్కిల్ ఈఈగా పనిచేస్తున్న ఏ.రంగప్రసాద్‌ను శ్రీకాకుళం జిల్లాకు బదిలీ చేశారు.
ఆర్టీసీలో..
ఆర్టీసీలో బదిలీలు ఎక్కడివారు అక్కడే అన్నట్టుగా సాగాయి. ముఖ్యంగా ఎన్టీఆర్ జిల్లాకు చెందిన డిపో మేనేజర్లను మరో ప్రాంతానికి కదిలించకపోవటం గమనార్హం. వివాదాస్పద వ్యక్తులు, బస్సు ప్రమాద ఘటనల్లో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న వారిని కూడా కదిలించలేదు. విజయవాడ డిప్యూటీ సీటీఎం కె.శ్రీలక్ష్మిని అనంతపురం జిల్లా డిప్యూటీ సీటీఎంగా బదిలీ చేశారు. విజయవాడ జోన్ డి ప్యూటీ సీఏవోగా పనిచేస్తున్న కె.రామచంద్రరావును హెడ్డాఫీసుకు బదిలీ చేశారు. హెడ్ క్వార్టర్స్‌లో పనిచేసే ఎం.రత్నావళిని విజయవాడ జోన్ డిప్యూటీ సీఏవోగా నియమించారు.
పంచాయతీరాజ్‌లో..
జిల్లా డీపీవోగా సెర్ప్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న పసుపుల లావణ్య కుమారికి పోస్టింగ్ ఇచ్చారు. డీఎల్‌డీవోలు, పంచాయతీ కార్యదర్శులకు సంబంధించిన బదిలీలు మంగళవారం వెలువడే అవకాశాలున్నాయి. పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగానికి సంబంధించి జిల్లా ఎస్‌ఈ రమణారావును బదిలీ చేశారు. ఆయన స్థానంలో కొత్తవారిని నియమించాల్సి ఉంది.
పౌరసరఫరాల శాఖలో..
జిల్లాలో డీటీగా పనిచేస్తున్న ఎం.రంగప్రసాద్‌ను తూర్పుగోదావరి జిల్లా బదిలీ చేశారు. విజయవాడలో జెడ్‌ఎంగా పనిచేసే పి.సుశీలను పల్నాడు జిల్లాకు బదిలీ చేశారు. ఎన్టీఆర్ జిల్లాలో ఏఎంగా పనిచేసే ఆర్.నాగమల్లేశ్వరిని బాపట్ల బదిలీ చేశారు.
Updated Date - Sep 24 , 2024 | 01:04 AM