తహసీల్దార్లకు స్థానచలనం
ABN, Publish Date - Jan 18 , 2024 | 12:42 AM
ఉమ్మడి జిల్లా తహసీల్దార్ల బదిలీలకు రంగం సిద్ధమవుతోంది. ఈ జాబితాలను రాష్ట్ర భూ పరిపాలనా శాఖ (సీసీఎల్‌ఏ) ఇప్పటికే సిద్ధం చేయగా, ఈ నెల 22 నుంచి బదిలీలు జరిగే అవకాశముంది. జోన్ 1, 2, 3, 4గా జాబితాలు సిద్ధమయ్యాయి.
ఓటర్ల తుది జాబితా వెలువడిన వెంటనే కేటాయింపులు
(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : ఉమ్మడి జిల్లా తహసీల్దార్ల బదిలీలకు రంగం సిద్ధమవుతోంది. ఈ జాబితాలను రాష్ట్ర భూ పరిపాలనా శాఖ (సీసీఎల్‌ఏ) ఇప్పటికే సిద్ధం చేయగా, ఈ నెల 22 నుంచి బదిలీలు జరిగే అవకాశముంది. జోన్ 1, 2, 3, 4గా జాబితాలు సిద్ధమయ్యాయి. జోన్ 2 పరిధిలో ఎన్టీఆర్, కృష్ణాజిల్లాలు ఉన్నాయి. ఈ నెల 22వ తేదీన తుది ఎన్నికల జాబితా వెలువడనుంది. ఆ తర్వాత బదిలీల ప్రక్రియ ప్రారంభించేందుకు సీసీఎల్‌ఏ సిద్ధంగా ఉంది. ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని చేపట్టిన బదిలీలు కావటంతో సీసీఎల్‌ఏనే తహసీల్దార్లను జిల్లాలకు కేటాయించనుంది. దీని ప్రకారమే కలెక్టర్ ఉత్తర్వులు ఇస్తారు.
మూడేళ్లు పూర్తిచేసుకున్నవారు
మూడేళ్లు పూర్తి చేసుకున్న వారందరినీ బదిలీ చేయాల్సిందిగా ఇప్పటికే ఎన్నికల సంఘం ఆదేశాలు ఇచ్చింది. ఆ తర్వాత స్థానిక జిల్లాకు చెందిన వారిని కూడా బదిలీ చేయాలని పేర్కొంది. నిబంధనల ప్రకారం మూడేళ్లు అని చెబుతున్నప్పటికీ దాదాపు తహసీల్దార్లు అందరినీ బదిలీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే, ఉద్యోగ సంఘాల్లో ఆఫీసు బేరర్లు కూడా బదిలీ కాక తప్పదు. కిందటి ఎన్నికల సందర్భంలో ఉమ్మడి కృష్ణాజిల్లా పరిధిలోని తహసీల్దార్లను ఉభయ గోదావరి జిల్లాలకు బదిలీ చేశారు. ఆయా జిల్లాలకు చెందిన తహసీల్దార్లను ఉమ్మడి కృష్ణాజిల్లాకు బదిలీ చేశారు.
ఈ నెలలోనే..
కాగా, ఈనెల 2వ తేదీన ఎన్నికల తుది జాబితా వెలువరిస్తామని చెప్పారు. ఆ తర్వాత 17వ తేదీన ప్రచురిస్తామన్నారు. ఇప్పుడేమో 22వ తేదీ అంటున్నారు. ఈ తేదీన కూడా ఓటర్ల తుది జాబితా విడుదల చేసేది అనుమానంగానే ఉంది. ఎందుకంటే.. 25వ తేదీన జాతీయ ఓటర్ల దినోత్సవం కాబట్టి, ఆ రోజున ప్రకటించే అవకాశం ఉందని కూడా ప్రచారం జరుగుతోంది. ఇదే జరిగితే 26 రిపబ్లిక్ డే సెలవు కాబట్టి, 27వ తేదీన కలె క్టర్ల నుంచి ప్రతిపాదన వెళ్లాల్సి ఉంటుంది. 28న జిల్లాలకు అలాట్‌మెంట్ ఇస్తుంది. 29వ తేదీన బదిలీల ఆర్డర్లు జారీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. 30, 31 తేదీల్లో తహసీల్దార్లు బదిలీ అయిన స్థానాలకు వెళ్లాలి.
సెక్షనల్ ఆఫీసర్లుగా పనిచేసే తహసీల్దార్ల బదిలీలు
రెవెన్యూ శాఖలో పనిచేస్తూ ఎన్నికల విధులతో సంబంధం లేని సెక్షనల్ ఆఫీసర్లను బుధవారం సీసీఎల్‌ఏ అధికారులు నాలుగు జోన్ల పరిధిలో బదిలీలు చేశారు. కలెక్టరేట్, జాయింట్ కలెక్టరేట్, సబ్ కలెక్టరేట్లలో సెక్షనల్ ఆఫీసర్లుగా పనిచేసే తహసీల్దార్లను బదిలీ చేశారు. అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ (ఎమ్మార్వో) స్థానాలు ఏ జిల్లాల్లో అయితే ఖాళీగా ఉన్నాయో ఆయా జిల్లాలకు సెక్షనల్ ఆఫీసర్లను బదిలీ చేయటం జరిగింది. దీంతో ఏఆర్వోల కొరతను తీర్చారు. ఈ బదిలీల్లో ఉమ్మడి కృష్ణాజిల్లాకు సంబంధించిన వారెవరూ లేరు. ఈ జిల్లాల్లో ఏఆర్వోల కొరత లేకపోవటంతో ఆయా స్థానాలకు బదిలీలు నిర్వహించలేదు.
Updated Date - Jan 18 , 2024 | 12:42 AM