పెనమలూరు తెరపైకి కొత్త పేర్లు
ABN, Publish Date - Mar 19 , 2024 | 01:07 AM
పెనమలూరు నియోజక వర్గం నుంచి బరిలోకి దిగే టీడీపీ అభ్యర్థి ఎవరన్న దానిపై ఉమ్మడి కృష్ణా జిల్లాలోనే కాదు రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది.
మైలవరంపై వీడిన సస్పెన్స్
వసంత కృష్ణ ప్రసాద్ పేరు ప్రకటన లాంఛనమే
(విజయవాడ - ఆంధ్రజ్యోతి) పెనమలూరు నియోజక వర్గం నుంచి బరిలోకి దిగే టీడీపీ అభ్యర్థి ఎవరన్న దానిపై ఉమ్మడి కృష్ణా జిల్లాలోనే కాదు రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది. తాజాగా అభ్యర్థి ప్రకటనపై జాప్యం జరుగుతుండటంతో ఆశావహుల సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. ప్రస్తుతం నియోజకవర్గ ఇన్‌చార్జిగా ఉన్న బోడె ప్రసాద్‌కు ఈసారి అవకాశం కల్పించలేకపోతున్నామని పార్టీ అధినేత స్వయంగా తెలపడంతో ఇక్కడి నుంచి ఎవరు బరిలో దిగుతారన్న అంశంపై సస్పెన్స్ నెలకొంది. తాజాగా పెనమలూరు తెరపైకి తెనాలి నియోజకవర్గ టీడీపీ నేత, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పేరు వచ్చింది. ఆయనతోపాటు తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేవినేని చందు పేరునూ పరిశీలిస్తున్నట్టు సమాచారం. యువ ఓటర్లకు సంబంధించి పార్టీ తరఫున కార్యక్రమాలు నిర్వహించడంలో చందు చురుగ్గా ఉన్నారు. టీడీపీ యువనేత నారా లోకేశ్‌తోనూ ఆయనకు మంచి అనుబంధమే ఉంది. దీంతో పెనమలూరు టికెట్ తనకు కేటాయించాలని చందు పార్టీ పెద్దలను కోరుతున్నారు. ఇప్పటికే ఈ స్థానం నుంచి పోటీ చేసేందుకు ప్రముఖ న్యాయవాది గొట్టిపాటి రామకృష్ణ ప్రసాద్ రేసులో ఉన్నారు. ఈ ముగ్గురిలో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ సీనియర్ నాయకుడు. తెనాలి నియోజకవర్గం నుంచి బరిలో దిగాల్సిన ఆయన పొత్తులో భాగంగా తన స్థానాన్ని జనసేనకు త్యాగం చేశారు. ఆ స్థానం నుంచి నాదెండ్ల మనోహర్ బరిలోకి దిగుతున్నారు. దీంతో ఆలపాటిని ఏదో ఒక స్థానం నుంచి బరిలో నిలపాలని పార్టీ అధిష్ఠానం భావిస్తోంది. ఈ నేపథ్యంలో పెనమలూరు సీటు ఈ ముగ్గురు నేతల్లో ఎవరిని వరిస్తుందో అన్న విషయం రెండుమూడు రోజుల్లో తేలిపోనుంది.
వసంతకు లైన్ క్లియర్
మైలవరం నుంచి వసంత కృష్ణప్రసాద్‌కు లైన్ క్లియర్ అయినట్టేనని సమాచారం. ఈ మేరకు పార్టీ పెద్దలకు ఆయనకు సమాచారం ఇచ్చారు. కృష్ణప్రసాద్ పేరు ప్రకటించడం లాంఛనమేనని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. వసంత ఇప్పటికే నియోజకవర్గంలో పర్యటిస్తూ టీడీపీ నాయకులను కలుస్తూ ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తున్నారు. అభ్యర్థిత్వాన్ని అధికారికంగా ప్రకటించిన తర్వాత దేవినేని ఉమాతో భేటీ అవ్వాలని వసంత భావిస్తున్నారు. ఈ ఇద్దరు నేతలు కలిస్తే మైలవరంలో టీడీపీ గెలుపు నల్లేరు మీద నడకేనని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి.
Updated Date - Mar 19 , 2024 | 01:07 AM