జిల్లా అభివృద్ధికి సమష్టిగా పనిచేద్దాం
ABN, Publish Date - Oct 08 , 2024 | 12:53 AM
ముఖ్యమంత్రి ఆలోచనలకు అనుగుణంగా కలిసికట్టుగా జిల్లాను అభివృద్ధి చేసుకుందామని మంత్రి కొల్లురవీంద్ర అన్నారు. స్వర్ణాంధ్రప్రదేశ్-2047 విజన్ డాక్యుమెంట్ రూపకల్పనలో భాగంగా సోమవారం కలెక్టరేట్‌లో వర్క్‌షాప్ నిర్వహించారు.
మచిలీపట్నం, అక్టోబరు 7 : ముఖ్యమంత్రి ఆలోచనలకు అనుగుణంగా కలిసికట్టుగా జిల్లాను అభివృద్ధి చేసుకుందామని మంత్రి కొల్లురవీంద్ర అన్నారు. స్వర్ణాంధ్రప్రదేశ్-2047 విజన్ డాక్యుమెంట్ రూపకల్పనలో భాగంగా సోమవారం కలెక్టరేట్‌లో వర్క్‌షాప్ నిర్వహించారు. సమావేశంలో మంత్రి, పలువురు ఎమ్మెల్యేలు పాల్గొని జిల్లా అభివృద్ధికి విజన్ డాక్యుమెంట్ రూపకల్పనకు సలహాలు, సూచనలు చేశారు. తొలుత కలెక్టర్ డీకే బాలాజీ మాట్లాడుతూ, స్వర్ణాంధ్ర-2047 విజన్ డాక్యుమెంట్ రూపకల్పనకు రాబోయే ఐదేళ్లలో జిల్లా స్థూల ఉత్పత్తి 15శాతం పెంచే లక్ష్యంతో ప్రజాప్రతినిధుల సూచనలు సలహాలు తీసుకునేందుకు సమావేశం ఏర్పాటు చేశామన్నారు. మంత్రి రవీంద్ర మాట్లాడుతూ, స్వర్ణాంధ్ర 2047 విజన్ డాక్యుమెంట్‌ను నవంబరు 1న ముఖ్యమంత్రి విడుదల చేయనున్నట్టు తెలిపారు.
త్వరలో పూర్తికానున్న మచిలీపట్నం పోర్టు, గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టులకు ఏపీ నాంది కాబోతోందని, తద్వారా ప్రపంచస్థాయి జిల్లాగా నిలబెట్టవచ్చన్నారు. విద్యా, ఉపాధి రంగాల్లో అభివృద్ధి సాధించాలన్నారు. సాంఘిక సంక్షేమ రంగంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలను పైకి తేవాలన్నారు. హేచరీస్, ప్రాసెసింగ్ ప్లాంట్లు అభివృద్ధి చేయాలన్నారు. హంసలదీవి, ఘంటసాల, కూచిపూడి, మంగినపూడి బీచ్ వంటి ప్రాంతాల్లో పర్యాటక రంగ అభివృద్ధికి చర్యలు తీసుకోవాలన్నారు.
పెనమలూరు ఎమ్మెల్యే బోడె ప్రసాద్ మాట్లాడుతూ, గ్రీన్ ఎనర్జీ సోలార్ సిస్టం రెసిడెన్షియల్‌గా ప్రోత్సహించాలని, వ్యవసాయ మోటార్లకు సోలార్ సిస్టం అనుసరించాలన్నారు. ఇన్నర్ రింగ్, బైపాస్, ఓఆర్‌ఆర్ ఐదేళ్లలో పూర్తిచేయాలని ముఖ్యమంత్రి లక్ష్యంతో ఉన్నారని తెలిపారు.
గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు మాట్లాడుతూ, నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు నిధులు కేటాయించాలన్నారు. విద్యాసంస్థలు రావాల్సిన అవసరం ఉందన్నారు. అంతర్జాతీయ విమానాశ్రయం విస్తరణ వేగంగా జరిగితే రాబోయే రోజుల్లో బెస్ట్ సెజ్‌గా రూపొందుతుందన్నారు.
పామర్రు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా మాట్లాడుతూ, తోట్లవల్లూరు మండలం లంక గ్రామాల్లో వాణిజ్య పంటలు బాగా పండుతాయని, రైతులను ప్రోత్సహించాలని, పాముల్లంక వంతెన నిర్మించాలన్నారు. నియోజకవర్గంలో మెరైన్ ఫుడ్ ఎక్స్‌పోర్ట్ పరిశ్రమలకు మరిన్ని సౌకర్యాలు కల్పించాలన్నారు.
పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ మాట్లాడుతూ, వ్యవసాయం, ఆక్వారంగాల ఆధారిత నియోజకవర్గంలో సాగునీరు కాల్వలు తవ్వించి గట్లను పటిష్టం చేయాలని, డ్రెయిన్ల పూడికతీత, ఆక్వా రంగానికి కరెంటు సబ్సిడీ అందించాలన్నారు. సమావేశంలో డీఆర్‌వో కె.చంద్రశేఖరరావు, బందరు ఆర్డీవో కె.స్వాతి, డ్వామా పీడీ ఎ.శివప్రసాద్, సీపీవో గణేష్ కృష్ణ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
Updated Date - Oct 08 , 2024 | 12:53 AM