ఉచితం మాటున అనుచితం
ABN, Publish Date - Oct 26 , 2024 | 01:23 AM
ఉచిత ఇసుక గాడి తప్పుతోంది. సామాన్యులకు మేలు చేసేందుకు ప్రభుత్వం ఉచిత ఇసుక పాలసీని తీసుకు రాగా, కొందరు అధికార పార్టీ నాయకుల కారణంగా ఆ ఉద్దేశం నెరవేరడం లేదు. నందిగామ నియోజకవర్గంలో షాడో ఎమ్మెల్యేగా పేరొందిన ఓ నాయకుడి కనుసన్నల్లో మునేరు వాగుపై ఉన్న రీచ్‌ల్లో యథేచ్ఛగా యంత్రాలతో ఇసుక తవ్వుకుపోతున్నారు. లోడింగ్ కాంట్రాక్టర్లకు అధికారికంగా అప్పగించకముందే ఇసుక అనధికారికంగా తరలిస్తున్నారు.
నందిగామ నియోజకవర్గంలో ఇసుక దందా
అనుమతులిచ్చింది ట్రాక్టర్లకు..తరలిస్తున్నది లారీల్లో..
రాత్రివేళ జోరుగా అక్రమ తవ్వకాలు
30 టన్నుల లారీ రూ.12 వేలు
అధికార పార్టీ షాడో ఎమ్మెల్యేనే సూత్రధారి
గతంలో స్టాక్‌పాయింట్లలో ఇసుక స్వాహా
అమ్ముకున్న ఇసుక విలువ రూ.9 కోట్లు
ఉచిత ఇసుక గాడి తప్పుతోంది. సామాన్యులకు మేలు చేసేందుకు ప్రభుత్వం ఉచిత ఇసుక పాలసీని తీసుకు రాగా, కొందరు అధికార పార్టీ నాయకుల కారణంగా ఆ ఉద్దేశం నెరవేరడం లేదు. నందిగామ నియోజకవర్గంలో షాడో ఎమ్మెల్యేగా పేరొందిన ఓ నాయకుడి కనుసన్నల్లో మునేరు వాగుపై ఉన్న రీచ్‌ల్లో యథేచ్ఛగా యంత్రాలతో ఇసుక తవ్వుకుపోతున్నారు. లోడింగ్ కాంట్రాక్టర్లకు అధికారికంగా అప్పగించకముందే ఇసుక అనధికారికంగా తరలిస్తున్నారు.
(విజయవాడ-ఆంధ్రజ్యోతి) : సామాన్యుడిపై ఇసుక భారాన్ని తొలగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇసుకపై సీనరేజితో పాటు డీఎంఎఫ్ (డిస్ట్రిక్ మినరల్ ఫండ్) వంటి వాటన్నింటినీ రద్దు చేసింది. ఇవన్నీ వసూలు చేస్తే టన్నుకు రూ.88 చొప్పున ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతుంది. కానీ, ప్రజలపై ఎలాంటి భారం మోపకూడదన్న ఉద్దేశంతో ప్రభుత్వం వీటిని రద్దు చేసింది. ట్రాక్టర్ల ద్వారా సొంత అవసరాలకు ఇసుకను ఉచితంగా తరలించుకోవచ్చని పేర్కొంది. లారీల ద్వారా ఇసుక తరలింపు మాత్రం ప్రభుత్వ అనుమతి మేరకే జరగాల్సి ఉంటుంది. కానీ, నందిగామ నియోజకవర్గంలో లారీల ద్వారా ఇసుకను తరలించేస్తున్నారు. రీచ్‌ల్లో లోడింగ్ కాంట్రాక్టర్‌కు ఇంకా అధికారికంగా అనుమతి ఇవ్వకముందే రీచ్‌ల్లో లారీలు ప్రత్యక్షమైపోతున్నాయి. నందిగామ నియోజకవర్గంలో ఇసుక లారీల్లో తరలిపోతోంది. కొందరు అధికార పార్టీ నాయకులు అక్రమంగా సొమ్ము చేసుకుంటున్నారు. మునేరు వాగు వెంట ఉన్న రీచ్‌ల్లో రాత్రివేళ జోరుగా తవ్వకాలు జరుపుతున్నారు. లారీల్లో తరలిస్తున్నారు. రీచ్ వద్ద 30 టన్నుల లారీ రూ.12 వేలకు విక్రయిస్తున్నారు. వారం రోజులుగా నిత్యం 100 లారీల ఇసుక తరలిపోతోంది.
నిబంధనలకు విరుద్ధంగా..
లోడింగ్ కాంట్రాక్టర్లు అయినా రీచ్‌ల్లో మాన్యువల్‌గా ఇసుక తవ్వి దానిని ట్రాక్టర్ల ద్వారా స్టాక్ పాయింట్లకు చేర్చాల్సి ఉంటుంది. వారికి కూడా లారీలను రీచ్‌ల్లోకి తీసుకెళ్లేందుకు అనుమతి లేదు. కానీ, నిబంధనలకు విరుద్ధంగా రీచ్‌ల్లో ఎక్స్‌కవేటర్లను పెట్టి లారీల ద్వారా తరలిస్తున్నా అటు మైనింగ్ అధికారులు కానీ, ఇటు రెవెన్యూ, పోలీసు యంత్రాంగం కానీ పట్టించుకోవట్లేదు. కంచికచర్ల మండలం పెండ్యాల, పెనుగంచిప్రోలు మండలం అనిగండ్లపాడు ఇసుక రీచ్‌ల్లో జోరుగా తవ్వకాలు జరుగుతున్నాయి. ఇసుక లారీల్లో అధికశాతం విజయవాడ, గుంటూరు వస్తుండగా కొన్నింటిని సరిహద్దులు దాటించి తెలంగాణకు పంపుతున్నారు.
ఉచితం అంటే ఇదేనా..?
రీచ్ వద్ద 30 టన్నుల లారీకి రూ.12 వేలు వసూలు చేస్తున్నారు. అంటే.. టన్ను రూ.400 పడుతుంది. దీనికి లారీ యజమానులు రవాణా చార్జీలు, డిమాండ్‌ను బట్టి అదనంగా మరో రూ.400 నుంచి రూ.600 వేసుకుని విక్రయించుకుంటున్నారు. అంటే.. 30 టన్నుల లారీ రూ.24 వేల నుంచి రూ.30 వేలు పడుతుంది. ఈ లెక్కన టన్ను రూ.800 నుంచి వెయ్యి రూపాయలు అవుతుంది. నందిగామ నియోజకవర్గంలో షాడో ఎమ్మెల్యేగా పేరొందిన వ్యక్తి ఇతరులెవరినీ రీచ్‌ల్లోకి ప్రవేశించనీయకుండా అడ్డుకుంటూ తమ సిండికేట్‌లో భాగమైన లారీల వారికే ఇసుక లోడ్ చేస్తున్నారు. సొంత అవసరాల కోసం ఎవరైనా ట్రాక్టర్‌తో ఇసుక తీసుకెళ్లే ప్రయత్నం చేసినా.. వారినీ అడ్డుకోవడమో లేక లోడింగ్ చేసినందుకు రూ.500 ఇవ్వాలని పట్టుబట్టడమో చేస్తున్నారు. తమ మాట వినని వారిపై పోలీసులతో అక్రమంగా ఇసుక నిల్వ చేసి విక్రయించు కుంటున్నారని కేసులు పెట్టిస్తున్నారు.
రూ.9 కోట్ల ఇసుకను మాయం చేశారు
కంచికచర్ల మండలం కీసర స్టాక్‌యార్డులో 2,24,555 మెట్రిక్ టన్నుల ఇసుక ఉన్నట్లు ఈ ఏడాది జూలై 6న అధికారులు ప్రకటించారు. అయితే, ఈ స్టాక్ పాయింట్ నుంచి రికార్డుల ప్రకారం కేవలం లక్ష మెట్రిక్ టన్నుల ఇసుకే విక్రయించారు. మిగిలిన 1.24 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుకను షాడో ఎమ్మెల్యే మాయం చేసి విక్రయించేసుకున్నారు. ప్రభుత్వం అప్పట్లో టన్ను రూ.290 చొప్పున విక్రయించింది. అంటే.. ప్రభుత్వ లెక్కల ప్రకారమే దీని విలువ రూ.3.50 కోట్లు. ఎన్టీఆర్ జిల్లాలో మొత్తం 8 స్టాక్ పాయింట్లలో 5.54 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుక నిల్వలు విక్రయించాల్సి ఉండగా, కేవలం 3 లక్షలే అధికారికంగా విక్రయించగా, మిగిలిన 2.54 లక్షల టన్నులు షాడో ఎమ్మెల్యే మాయం చేశారు. మొత్తం మీద దీని విలువ సుమారు రూ.9 కోట్లు. ఇంత జరిగినా ఇంతవరకు బాధ్యులపై అధికారులు చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు.
లోడింగ్ కాంట్రాక్టర్ల పేరుతో పాగా
జిల్లాలో 15 ఇసుక రీచ్‌లు ఉన్నాయి. వీటిలో లోడింగ్, అన్‌లోడింగ్ కాంట్రాక్టును దక్కించుకుని పాగా వేసేందుకు ఇసుక మాఫియా అన్ని ప్రయత్నాలు చేసి విజయం సాధించింది. ప్రభుత్వం టన్నుకు రూ.110 ఇస్తామని ఆఫర్ చేసినా.. ఈ మాఫియా కేవలం రూ.72కే తాము లోడింగ్, అన్‌లోడింగ్ చేస్తామంటూ ముందుకొచ్చి కాంట్రాక్టును దక్కించుకుంది. గత వైసీపీ ప్రభుత్వంలో సగంపైగా రీచ్‌ల్లో చక్రంతిప్పిన నందిగామ నియోజకవర్గానికే చెందిన వ్యక్తి కైవసం చేసుకున్నారు. ఈయన ఉమ్మడి కృష్ణాజిల్లా నుంచి మంత్రిగా ఉన్న వ్యక్తికి అత్యంత సన్నిహితుడు. రెండు రీచ్‌ల్లో కాంట్రాక్టును షాడో ఎమ్మెల్యే కైవసం చేసుకున్నారు. లోడింగ్ కాంట్రాక్టు పేరుతో రీచ్‌ల్లో పాగా వేసి, ఇష్టారాజ్యంగా ఇసుక తరలించుకోవచ్చన్న వ్యూహంతో వీరు ప్రభుత్వం ఆఫర్ చేసిన ధర కన్నా తక్కువకే కాంట్రాక్టును దక్కించుకోవడం గమనార్హం.
Updated Date - Oct 26 , 2024 | 07:16 AM