మ్యుటేషన్ ఆమోదం కోసం లంచం డిమాండ్ ఫ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టివేత
ABN, Publish Date - Mar 30 , 2024 | 11:34 PM
కేవీపల్లె మండలంలో ఓ రైతుకు సంబంధించిన మ్యుటేషన్ వ్యవహారంలో లంచం తీసుకుంటున్న వీఆర్వోను ఏసీబీ అధికారులు శనివారం రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
ఏసీబీ వలలో వీఆర్వో
పీలేరు, మార్చి 30: కేవీపల్లె మండలంలో ఓ రైతుకు సంబంధించిన మ్యుటేషన్ వ్యవహారంలో లంచం తీసుకుంటున్న వీఆర్వోను ఏసీబీ అధికారులు శనివారం రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఏసీబీ కడప డీఎస్పీ గిరిధర్ కథనం మేరకు... కేవీపల్లె మండలం గోరంట్లపల్లె పంచాయతీ బసిరెడ్డిగారిపల్లె వడ్డిపల్లెకు చెందిన రైతు మల్లయ్య భూమికి సంబంధించిన రికార్డుల్లో తప్పులు దొర్లాయి. వాటిని సరిదిద్దేందుకు గత నెలలో మ్యుటేషన్‌కు దరఖాస్తు చేసుకున్నాడు. ఆయన భూమి అదే గ్రామానికి చెందిన మూడు సర్వే నెంబర్లలో ఉండడం, వాటిలో రెండు సర్వే నెంబర్లలో ఆయన భూమి దరఖాస్తు పట్టాగా నమోదు కావడంతో దానిని మార్చేందుకు మ్యుటేషన్‌కు దరఖాస్తు చేసుకున్నాడు. మ్యుటేషన్‌ను ఆమోదించేందుకు సొరకాయలపేట గ్రామ సచివాలయ వీఆర్వో యల్లయ్య రూ.9 వేలు లంచం డిమాండ్ చేశాడు. అంత ఇచ్చుకోలేనని రైతు పలుమార్లు ప్రాధేయపడగా రూ.5 వేలకు ఒప్పుకున్నాడు. వీఆర్వో వ్యవహారంతో విసిగిపోయిన మల్లయ్య ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. వారి సూచన మేరకు ఆ డబ్బు చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నానని వీఆర్వోకు తెలుపగా శనివారం సచివాలయం వద్దకు రమ్మన్నాడు. సచివాలయంలో అతను లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు దాడి చేసి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. వీఆర్వో యల్లయ్యను నెల్లూరు ఏసీబీ కోర్టుకు తరలించినట్లు ఆయన తెలిపారు. దాడిలో ఏసీబీ సీఐలు మహమ్మద్ అలీ, శ్రీనివాసులు రెడ్డి పాల్గొన్నారు.
Updated Date - Mar 30 , 2024 | 11:34 PM