‘సాక్షి’లో 70% వాటా జగన్ కుటుంబానిదే
ABN, Publish Date - Jan 31 , 2024 | 03:36 AM
తనకు మీడియా మద్దతు లేదంటూ బహిరంగ సభల్లో సీఎం జగన్‌మోహన్‌రెడ్డి దీన పలుకులు పలుకుతున్నారని, కానీ..
లక్షతో ప్రారంభమైన కంపెనీ నేడు 4,475 కోట్లకు
సాక్షి వాటాల దగ్గరే జగన్, షర్మిల మధ్య యుద్ధం
టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనం
నెల్లూరు, జనవరి 30 (ఆంధ్రజ్యోతి): తనకు మీడియా మద్దతు లేదంటూ బహిరంగ సభల్లో సీఎం జగన్‌మోహన్‌రెడ్డి దీన పలుకులు పలుకుతున్నారని, కానీ.. సాక్షి పత్రిక, టీవీలో ఆయన కుటుంబానికి 70శాతం వాటా ఉందని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి అన్నారు. సాక్షి పత్రిక, టీవీ ముమ్మాటికీ ఆయనవేనని స్పష్టం చేశారు. సాక్షితో తనకు సంబంధం లేదని మాట్లాడుతున్న జగన్‌కు తన సతీమణి వైఎస్ భారతీరెడ్డి, కుమార్తెలు వైఎస్ హర్షిణి, వైఎస్ వర్ష, బావమరిది ఈసీ దినేశ్‌రెడ్డితో కూడా సంబంధం లేదా...? అని ప్రశ్నించారు. మంగళవారం నెల్లూరులోని ఎన్టీఆర్ భవన్‌లో ఆనం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘14-11-2006న ‘సాక్షి’ పేపర్‌ను స్థాపించారు. రూ.లక్ష పెట్టుబడితో ప్రారంభమైన సాక్షి పేపర్, సాక్షి టీవీలో మొదట ముగ్గురు డైరెక్టర్లు ఉన్నారు. వారిలో ఒకరైన విజయసాయిరెడ్డి 21-06-2007న వైదొలగగానే ఆయన స్థానంలో జగన్ డైరెక్టర్‌గా చేరారు. 01-02-2011 వరకు ఆయన కొనసాగగా ఆ తర్వాత ఆ స్థానంలో భారతీరెడ్డి చేరారు. అయినా సాక్షితో జగన్‌కు సంబంధం లేదట’ అని ఆనం మండిపడ్డారు. ‘2019 ఎన్నికల నాటికి సాక్షి ఆదాయం రూ.51.82లక్షలు. 2022 నాటికి అది రూ.90.05కోట్లకు పెరిగింది. వైసీపీ ప్రభుత్వంలో సాక్షికి అడ్వర్టయిజ్‌మెంట్ల ద్వారా దోచిపెట్టారు. జగతి పబ్లికేషన్స్‌లో 10.65 కోట్ల షేర్లను 2012లో రూ.350 ప్రీమియానికి అమ్మారు. నేడు ఒక షేర్ విలువ రూ.420కు చేరుకుంది. అంటే మొత్తం జగతి పబ్లికేషన్స్ విలువ రూ.4,475 కోట్లకు చేరుకుంది. రూ.లక్షతో ప్రారంభమైన కంపెనీ 17ఏళ్లలో రూ. 4,475 కోట్లకు పెరిగింది. టీడీపీ ప్రభుత్వం రాగానే ఈ కుంభకోణంపై సీఐడీ విచారణ జరిపిస్తాం. ఇదంతా అవినీతి సొమ్మే. దీనిలోనే షర్మిల కూడా వాటా అడుగుతోందంటే ఆ పాపిస్టి వాళ్లకు ఆమెకూ తేడా ఏమిటి..? ఇప్పుడు జగన్‌కు, షర్మిలకు మధ్య జరుగుతున్న యుద్ధానికి ‘సాక్షి’ వాటానే కారణం’ అని ఆనం వెల్లడించారు.
Updated Date - Jan 31 , 2024 | 10:58 AM