Dharmana Prasada Rao : అన్నీ ముందుగానే ఊహిస్తే ఎలా..?
ABN, Publish Date - Jan 10 , 2024 | 04:41 AM
టైటిల్ చట్టం అమల్లోకి రాలేదని మంత్రి ధర్మాన ప్రకటించారు. ఇంకా నిబంధనలే ప్రకటించలేదన్నారు.
టైటిల్ చట్టంపై వివరణ పేరిట
అసత్యాలు, అర్ధసత్యాలతో దాటవేత
చట్టం అమల్లో లేనప్పుడు శాశ్వత భూ హక్కు ఎలా కల్పిస్తున్నారు?
కొత్త పాస్‌పుస్తకాలు చిత్తు కాగితాలుగా మారినట్టేనా?
టైటిల్ చట్టం మహాద్భుతమే అయితే రాష్ట్రంలో న్యాయవాదుల పోరాటం దేనికి?
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
ఏపీ భూ యజమాన్య హక్కు చట్టం(టైటిల్)-2023 అవసరం చాలా ఉందంటూనే వ్యవస్థలపై అనధికారికంగా మంత్రి ధర్మాన ప్రసాదరావు అభాండాలు మోపారు. చట్టం ఎంత ముఖ్యమైందో చెబుతూనే, దానిపై వస్తున్న అనేకానేక విమర్శలు, ఆందోళనలకు ఆయన సూటిగా బదులివ్వకుండా అసత్యాలు, అర్థసత్యాలతో దాటవేత ధోరణిని ప్రదర్శించారు. కీలకమైన అంశాలను అసలు ప్రస్తావించనేలేదు. దీంతో ఆయన మాటలు విన్నవారికి ‘ఇది ధర్మమేనా? మంత్రివర్యా’ ఈ సందేహం రాకమానదు.
టైటిల్ చట్టం అమల్లోకి రాలేదని మంత్రి ధర్మాన ప్రకటించారు. ఇంకా నిబంధనలే ప్రకటించలేదన్నారు. అయితే, వాస్తవానికి ఈ చట్టం గత ఏడాది అక్టోబరు 31 నుంచే అమల్లోకి వచ్చినట్లుగా నవంబరు ఒకటో తేదీన జగన్ ప్రభుత్వం రహస్యంగా ఇచ్చిన జీఓ 512నే సజీవ సాక్ష్యం. ఆ జీఓ గురించి ధర్మానకు తెలియదా? లేక తెలిసే చెప్పకుండా దాటవేశారని అనుకోవాలా? టైటిల్ చట్టాన్ని వ్యతిరేకిస్తూ, దాన్ని వెనక్కి తీసుకోవాలని కోరుతూ న్యాయవాద సంఘాలు, రైతు సంఘాల ప్రతినిధులు ఆందోళనలు చేస్తున్నారు. ఉద్యమం తారస్థాయికి చేరిన తర్వాతే టైటిల్ చట్టంలో కీలకమైన ఆంధ్రప్రదేశ్ భూమి సాధికారిక సంస్థ(ల్యాండ్ అథారిటీ)ని ఏర్పాటుచేస్తూ సర్కారు జీఓ 630 ఇటీవల ఇచ్చింది. మంత్రి ధర్మాన చెప్పినట్లు చట్టమే అమల్లోకి రాకపోతే ఈ జీఓ ఎందుకు జారీ చేసినట్లు? ఈ జీఓతో టైటిల్‌చట్టం గత ఏడాది ఆక్టోబరు 31నుంచే అమల్లో ఉన్నట్లు లెక్క. దీంతో భూ వివాదాలను జిల్లా కోర్టులు విచారణకు తీసుకోవడానికి వీల్లేకుండా పోయుంది.
నిబంధనలు ఇవ్వకపోతే..
టైటిల్ చట్టం అమలుకు ఇంకా రూల్స్‌నే ఇవ్వలేదు కాబట్టి అది అమల్లో లేనట్లే అని మంత్రి పదేపదే చెప్పారు. పోనీ.. ఇదే నిజమనుకుంటే, శాశ్వత భూ హక్కు పేరిట కొత్తగా పాస్‌పుస్తకాలు ఎందుకు ఇస్తున్నట్లు? శాశ్వత హక్కు అంటే టైటిల్ ద్వారా వచ్చేదే అని మంత్రి సెలవిచ్చారు. అలాంటప్పుడు? చట్టం అమల్లో లేకుండా ఏ ప్రాతిపదికన జగన్ బొమ్మలేసి శాశ్వత భూహక్కు పత్రం ఇస్తున్నారు? తాజాగా మంత్రి చెప్పిన ప్రకారం, టైటిల్ చట్టం అమల్లో లేదు కాబట్టి జగన్ బొమ్మలున్న శాశ్వత భూమి హక్కు పత్రాలు చెల్లవనుకోవాలా? లేక పట్టాలను కేవలం కాగితాలుగా పరిగణించాలా? సివిల్ కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న కేసుల్లో 66 శాతం భూ వివాదాలతో ముడిపడినవే అని మంత్రి చెప్పారు. అందులో 93 శాతం రూ.లక్ష ఆదాయం ఉన్న పేదల భూముల కేసులే అని వివరించారు. సివిల్ కోర్టుల్లో కేసులు పెండింగ్‌లో ఉంటే, వాటిని కోర్టు పరిధి నుంచి తప్పించి రెవెన్యూ అధికారులకు ఇస్తారా? తహసీల్దార్, ఈనాం డిప్యూటీ తహసీల్దార్, ఆర్‌డీఓ, జాయింట్ కలెక్టర్, సెటిల్‌మెంట్ కమిషనర్, సర్వేకమిషనర్, సీసీఎల్‌ఏ, చివరకు రెవె న్యూ మంత్రి వద్ద కూడా క్వాజీ జ్యుడీషియరీ కోర్టులు నడుస్తున్నాయి. భూ వివాదాలపై విచారణలు చేస్తున్నారు. ఈ కోర్టుల పరిధిలో కూడా వేలాది కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. మరి రెండింటికీ తేడా ఏమిటి? అయితే, వీటికి సమాధానం ఇవ్వకుండా.. అన్నీ ముందుగానే ఊహిస్తే ఎలా అంటూ మంత్రి దాటవేశారు.
మీడియాకు సర్టిఫికెట్
భూముల సర్వే అద్భుతంగా జరుగుతోందని మంత్రి ధర్మాన అన్నారు. మీడియాకు సాంకేతికత గురించి తెలియదని సర్టిఫికెట్‌లు ఇచ్చారు. మంత్రి చెప్పాలనుకున్న టెక్నాలజీ మీడియాకు తెలియకపోవచ్చు. కానీ, భూముల సర్వేలో జరుగుతున్న వ్యవహారాలు మంత్రికంటే మీడియాకే ఎక్కువ తెలుసు. నిత్యం రైతుల బాధలను వెలుగులోకి తీసుకొస్తున్నది మీడియానే. కార్స్ టెక్నాలజీ, రోవర్లు, డ్రోన్‌ల కొనుగోలు దగ్గరి నుంచి ఆఫీసులో కూర్చొని రికార్డుల తయారీ వరకు అనేక విషయాలను సవివరంగా బయటపెట్టింది. ఇక, టైటిల్ చట్టం అద్భుతం, అందరితో చర్చించాకే ముందడుగు వేశామని ధర్మాన పలుమార్లు చెప్పారు. అదే నిజమైతే, చట్టం చేసే సమయంలో ధర్మాన ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన సోదరుడు కృష్ణదాస్ మంత్రిగా ఉన్నారు. మంత్రివర్గ విస్తరణ తర్వాతే ధర్మానకు రెవెన్యూ మంత్రి పదవి వచ్చింది. ఈ చట్టం తీసుకురావాలనుకున్నప్పుడు ఏ ఒక్కరితోనూ సంప్రదించలేదు. నీతి ఆయోగ్ ఇచ్చిన డ్రాప్ట్ ముసాయిదాను పట్టుకొని అదే సరైనదనుకున్నారు. ఆ నివేదికను కేంద్ర మంత్రివర్గం ఆమోదించనేలేదు. దాన్ని ఇక్కడకు తీసుకొచ్చి ఓ అధికారి తన కింద పనిచేసే ఇద్దరు సూపరింటెండెంట్‌లతో చట్టం ముసాయిదా బిల్లు తయారు చేయించారు. కనీసం న్యాయశాఖ ఆమోదం కూడా తీసుకోకుండానే బిల్లును తీసుకొచ్చారు. అనంతరం, దేశంలో ఏపీనే ఫస్ట్ అంటూ సభలో బిల్లు ఆమోదించి రాష్ట్రపతి ఆమోదం కోసం పంపించారు. అయితే, రాష్ట్రపతి రెండుసార్లు ఆ బిల్లును తిరస్కరించారు. అప్పటికీ నిపుణులతో సంప్రదింపులు జరపకుండా నల్సార్‌లోని ఓ ప్రొఫెసర్‌తో చర్చలు జరిపారు. తెరవెనుక ఇంత జరిగితే, అందరితో చర్చించామని చెప్పడం, అవసరం వచ్చినప్పుడుల్లా కేంద్రం, నీతి ఆయోగ్ ప్రస్తావన తీసుకురావడం దేనికి సంకేతం?
మంత్రిగారి కొత్త భాష్యం
చట్టం వండర్‌పుల్ అని న్యాయవాదులే అభినందిస్తున్నారని ధర్మాన కొత్త భాష్యం చెప్పారు. అదే నిజమైతే, ఏకంగా బార్ అసోసియేషన్‌లు ఎందుకు ఆందోళనలో ఉన్నట్లు? వారంతా చట్టం చదవకుండానే పోరాటంలోకి వచ్చారని మంత్రి చెప్పాలనుకున్నారా? ఈ ప్రశ్నకు సూటిగా సమాధానం చెప్పలేదు. చట్టాన్ని చదివిన వారు అభినందిస్తున్నారంటూ కొత్త భాష్యం చెప్పారు. సివిల్ కోర్టులు చట్టం అమలులో జోక్యం చేసుకోవద్దని చట్టంలో స్పష్టంగా ఉంది. అంటే, ఉద్దేశ పూర్వకంగానే సివిల్‌కోర్టుల ప్రమేయం వద్దని చెప్పడమే కదా అని నిపుణులు అంటున్నారు.
Updated Date - Jan 10 , 2024 | 08:27 AM