హిందుత్వ ఫాసిజానికి వ్యతిరేక పోరాటం
ABN, Publish Date - Jan 29 , 2024 | 03:04 AM
దేశంలో ప్రస్తుతం హిందుత్వ ఫాసిజం ఆవహించి ఉందని, ఈ పరిస్థితికి వ్యతిరేకంగా పోరాటం చేయాలని ప్రొఫెసర్ హరగోపాల్ పిలుపునిచ్చారు. విరసం రాష్ట్ర మహాసభలు విజయవాడలోని
విరసం రాష్ట్ర మహాసభల్లో ప్రొఫెసర్ హరగోపాల్ పిలుపు
విజయవాడ, జనవరి 28(ఆంధ్రజ్యోతి): దేశంలో ప్రస్తుతం హిందుత్వ ఫాసిజం ఆవహించి ఉందని, ఈ పరిస్థితికి వ్యతిరేకంగా పోరాటం చేయాలని ప్రొఫెసర్ హరగోపాల్ పిలుపునిచ్చారు. విరసం రాష్ట్ర మహాసభలు విజయవాడలోని సిద్ధార్థ ఆడిటోరియంలో ఆదివారం ముగిశాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. హిందుత్వ ఫాసిజం ప్రజల మధ్య ద్వేషాలను పెంచుతూ మానవీయతను కోల్పోయేలా చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. దీన్ని నివారించడానికి వర్గ పోరాట రాజకీయాలు, ప్రజల మధ్య విస్తృతంగా పనిచేస్తూ చైతన్యం కలిగించాలని, ఈ పనిని విరసం సక్రమంగా నిర్వహించాలని సూచించారు. విరసం సీనియర్ సభ్యుడు కల్యాణరావు మాట్లాడుతూ బ్రాహ్మణీయ హిందుత్వ శక్తులు నేడు దేశంలో పోరాడుతున్న ప్రజలను, మేధావులను అణిచివేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వాటిని ప్రశ్నిస్తున్న వారిని అర్బన్ నక్సల్స్ పేరుతో అక్రమంగా అరెస్టు చేసి జైళ్లకు పంపుతున్నారని పేర్కొన్నారు. నేడు ప్రపంచ వ్యాప్తంగా ద్రవ్య పెట్టుబడి సంక్షోభంలో కూరుకుపోయిందని, దీనినుంచి బయటపడటానికి కార్పొరేట్ వర్గాలు ఫాసిస్టు ప్రభుత్వాలను అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా పనిచేస్తున్నాయని ఆరోపించారు. వాటిలో భాగంగానే ఆదానీ, అంబానీ వంటి కార్పొరేట్ శక్తులు మోదీని మూడోసారి ప్రధాని చేయడానికి తమ శక్తులను వినియోగిస్తున్నారన్నారు. రాబోయే ఎన్నికలు దేశ ప్రజల లౌకికవాద, ప్రాథమిక హక్కుల రక్షణకు సంబంధించిన అంశంగా చూడాలని, మోదీ అధికారంలోకి రాకుండా ప్రజలను సమీకృతం చేయాలని కల్యాణరావు పిలుపునిచ్చారు. అనంతరం నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. విరసం అధ్యక్షుడిగా అరసవల్లి కృష్ణ, కార్యదర్శిగా రివేరా, కార్యవర్గ సభ్యులు ఎన్నికయ్యారు.
Updated Date - Jan 29 , 2024 | 03:04 AM