High Court: కాలేజీలకు ఒకే తరహా ఫీజు సరికాదు
ABN, Publish Date - Dec 15 , 2024 | 05:15 AM
ప్రైవేటు మెడికల్ కళాశాలల్లో పీజీ వైద్య విద్యా కోర్సులకు సంబంధించి(2020-21 నుంచి 2022-23 వరకు) అప్పటి ప్రభుత్వం ఒకే తరహా ఫీజును ఖరారు చేయడాన్ని హైకోర్టు తప్పుబట్టింది.
యాజమాన్యాలు పంపిన ఫీజు ప్రతిపాదన వివరాలు కాలేజీల వారీగా పరిశీలించండి
2 నెలల్లో 2020-23 మధ్య ఫీజు నిర్ణయించండి
ఏపీ ఉన్నత విద్య కమిషన్‌కు హైకోర్టు ఆదేశం
2020 నాటి జీవో 56ను రద్దు చేసిన కోర్టు
అమరావతి, డిసెంబరు 14(ఆంధ్రజ్యోతి): ప్రైవేటు మెడికల్ కళాశాలల్లో పీజీ వైద్య విద్యా కోర్సులకు సంబంధించి(2020-21 నుంచి 2022-23 వరకు) అప్పటి ప్రభుత్వం ఒకే తరహా ఫీజును ఖరారు చేయడాన్ని హైకోర్టు తప్పుబట్టింది. ఫీజును ఖరారు చేస్తూ 2020, మే 29న జారీ చేసిన జీవో 56ను రద్దు చేసింది. కళాశాలలు పంపించిన ఫీజు ప్రతిపాదనలను విడివిడిగా పరిశీలించి రెండు నెలల్లో ఆయా కళాశాలలకు ఫీజు నిర్ణయించాలని ఏపీ ఉన్నత విద్య, నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్‌ను ఆదేశించింది. కళాశాలలు ప్రతిపాదించిన ఫీజును కమిషన్ అంగీకరించకపోతే, తుది ఉత్తర్వులు జారీ చేసే ముందు సంబంధిత కాలేజీల యాజమాన్యం నుంచి అభిప్రాయం సేకరించాలని కమిషన్‌కు స్పష్టం చేసింది. కమిషన్ ఫీజు పెంచుతూ నిర్ణయం తీసుకొంటే.. పీజీ వైద్య విద్యార్థుల నుంచి ఆ సొమ్మును రాబట్టుకునేందుకు యాజమాన్యాలకు వెసులుబాటు కల్పించింది. పెరిగిన ఫీజులను చెల్లించాలని విద్యార్థులకు స్పష్టం చేసింది.
ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్, జస్టిస్ ఆర్. రఘునందనరావుతో కూడిన ధర్మాసనం ఇటీవల తీర్పు ఇచ్చింది. ప్రైవేటు మెడికల్ కళాశాలల్లో పీజీ వైద్య విద్యా కోర్సుల ఫీజులకు సంబంధించి వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన జీవో 56ను సవాల్ చేస్తూ ప్రైవేటు మెడికల్ కళాశాలల యాజమాన్యాలు అదే ఏడాది హైకోర్టును ఆశ్రయించారు. యాజమాన్యాల తరఫు న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ.. కళాశాలల్లో కల్పించిన మౌలిక వసతులు, ఖర్చులకు సంబంధించి యాజమాన్యాలు పంపిన వివరాలు పరిగణనలోకి తీసుకోకుండానే కమిషన్ ఫీజులు నిర్ణయించిందని తెలిపారు. అన్ని కళాశాలలకు ఒకే తరహా ఫీజులు నిర్ణయిచడం సరికాదన్నారు. 2017-18 నుంచి 2019-20 సంవత్సరానికి కన్వీనర్ కోటా క్లినికల్ డిగ్రీ ఫీజు రూ.6.90 లక్షలుగా ఉంటే 2020-21 నుంచి 2022-23 సంవత్సరాలకు రూ.4.32 లక్షలుగా నిర్ణయించారని పేర్కొన్నారు. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకుని జీవోను రద్దు చేయాలని కోరారు.
Updated Date - Dec 15 , 2024 | 05:15 AM