టీడీపీని నమ్ముకున్న వారికి సాయం
ABN, Publish Date - Oct 27 , 2024 | 03:52 AM
ఎన్టీ రామారావు పార్టీ స్థాపించినప్పటి నుంచి పార్టీని నమ్ముకున్నవారికి, కష్టకాలంలో అండగా ఉన్నవారికి టీడీపీ చేతనైన సాయం చేస్తూ అండగా ఉంటోందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసయాదవ్ అన్నారు.
వాట్సాప్, టెలిగ్రామ్ ద్వారా కూడా సభ్యత్వం: పల్లా
అమరావతి, అక్టోబరు 26 (ఆంధ్రజ్యోతి): ఎన్టీ రామారావు పార్టీ స్థాపించినప్పటి నుంచి పార్టీని నమ్ముకున్నవారికి, కష్టకాలంలో అండగా ఉన్నవారికి టీడీపీ చేతనైన సాయం చేస్తూ అండగా ఉంటోందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసయాదవ్ అన్నారు. శనివారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో సభ్యత్వ నమోదును పార్టీ అధినేత చంద్రబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో శ్రీనివాసయాదవ్ మాట్లాడుతూ.. పార్టీ కార్యకర్తలను దృష్టిలో పెట్టుకుని, వారి సంక్షేమం కోసం సభ్యత్వ నమోదు చేపట్టామన్నారు. వాట్సాప్, టెలిగ్రామ్ ద్వారా కూడా సభ్యత్వం నమోదు చేసుకోవచ్చని తెలిపారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా ముందుకు తీసుకెళ్లాలని కోరారు. ‘‘ఎన్టీఆర్ తెలుగు జాతికి గుర్తింపు తెచ్చారు. చంద్రబాబు రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడుపుతున్నారు. ప్రజల జీవితాలు మార్చడానికి, రాష్ట్రం అభివృద్ధి చేయడానికి రాజకీయ పార్టీలు నడపాలి. పేదవాడి కళ్లలో సంతోషం చూసే వాడే రాజకీయ నాయకుడు. తండ్రి అధికారాన్ని అడ్డు పెట్టుకుని జగన్ రూ.43 వేల కోట్లు దోచుకున్నారు. వైసీపీని అవినీతి మూలాలపై స్థాపించారు. అలాంటి పార్టీలు కచ్చితంగా కూలిపోతాయి. ప్రజల్ని ఒక్కసారే మోసం చేయగలరు. అన్నివేళలా మోసం చేయలేరనడానికి 2024 ఎన్నికలే నిదర్శనం’’ అని అన్నారు.
Updated Date - Oct 27 , 2024 | 03:54 AM