రూ.లక్ష చెల్లించి టీడీపీ శాశ్వత సభ్యత్వం తీసుకున్న గూడూరు ఎమ్మెల్యే
ABN, Publish Date - Oct 27 , 2024 | 01:38 AM
తెలుగుదేశం పార్టీ అధినేత పిలుపు మేరకు జిల్లావ్యాప్తంగా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం శనివారం ఉత్సాహపూరిత వాతావరణంలో ప్రారంభమైంది. తిరుపతిలోని పార్టీ పార్లమెంటు కమిటీ కార్యాలయంలో అధ్యక్షుడు నరసింహ యాదవ్ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభించారు
తిరుపతి, అక్టోబరు 26 (ఆంధ్రజ్యోతి): తెలుగుదేశం పార్టీ అధినేత పిలుపు మేరకు జిల్లావ్యాప్తంగా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం శనివారం ఉత్సాహపూరిత వాతావరణంలో ప్రారంభమైంది. తిరుపతిలోని పార్టీ పార్లమెంటు కమిటీ కార్యాలయంలో అధ్యక్షుడు నరసింహ యాదవ్ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన తన సభ్యత్వాన్ని రెన్యువల్ చేసుకున్నారు. తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి జీవకోన ప్రాంతంలోని రాజీవ్‌గాంధీ కాలనీ గంగమ్మ ఆలయం వద్ద సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని జిల్లా అధ్యక్షుడు నరసింహ యాదవ్‌తో కలసి మాజీ ఎమ్మెల్యే, ఇన్‌ఛార్జి సుగుణమ్మ ప్రారంభించారు. గూడూరులో తన క్యాంపు కార్యాలయంలో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యే పాశం సునీల్‌కుమార్ రూ.లక్ష చెల్లించి శాశ్వత సభ్యత్వం తీసుకున్నారు. వెంకటగిరిలో ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ పార్టీ కార్యాలయంలో సభ్యత్వ నమోదును లాంఛనంగా మొదలుపెట్టారు. సూళ్లూరుపేట నియోజకవర్గానికి సంబంధించి నాయుడుపేటలోని టీడీపీ ఎమ్మెల్యే విజయశ్రీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఆరంభించగా మాజీ ఎమ్మెల్యే నెలవల సుబ్రమణ్యంతో పాటు పలువురు ముఖ్యనేతలు పాల్గొన్నారు. చంద్రగిరి నియోజకవర్గానికి సంబంధించి ఎర్రావారిపాలెం మండలం పసుపులేటివారిపల్లిలో ఎమ్మెల్యే పులివర్తి నానీ సభ్యత్వ నమోదుకు శ్రీకారం చుట్టగా ఆయన సతీమణి పులివర్తి సుధారెడ్డి పాకాలలో సభ్యత్వ నమోదును ప్రారంభించారు. శ్రీకాళహస్తి నియోజకవర్గం విషయానికొస్తే శ్రీకాళహస్తి మండలం కమ్మకొత్తూరు, అక్కుర్తి గ్రామాలతో పాటు రేణిగుంటలోనూ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్‌రెడ్డి పాల్గొని సభ్యత్వ నమోదు ప్రక్రియను మొదలుపెట్టారు.
నగరి, సత్యవేడుల్లో ప్రారంభించిన స్థానిక నేతలు
నగరి ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ మంత్రి నారా లోకేశ్‌తో కలసి విదేశీ పర్యటనకు వెళ్లిన నేపథ్యంలో ఆ నియోజకవర్గంలో అన్ని మండలాల్లోనూ మండల స్థాయి నేతలు ఉత్సాహంగా సభ్యత్వ నమోదును ప్రారంభించారు. పుత్తూరు పట్టణంలో పార్టీ సీనియర్ నేత మునివరత్నం నాయుడు, రూరల్ మండలంలో మరో సీనియర్ నేత గంజి మాధవయ్య సభ్యత్వ నమోదుకు శ్రీకారం చుట్టారు. ఇక సత్యవేడు విషయాకొస్తే పార్టీ అధిష్ఠానం సస్పెన్షన్ విధించిన నేపథ్యంలో ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొనలేదు. నియోజకవర్గ సమన్వయకర్త శ్రీపతిబాబు సత్యవేడులో మెంబర్‌షిప్ ఎన్‌రోల్‌మెంట్‌ను ప్రారంభించారు. అలాగే సత్యవేడు మండలం వీఆర్ కండ్రిగ, మదనంబేడు గ్రామాల్లో కూడా పాల్గొన్నారు. కాగా జిల్లావ్యాప్తంగా నియోజకవర్గ కేంద్రాలతో పాటు మండలాల్లో కూడా తొలిరోజు సభ్యత్వ నమోదు కార్యక్రమాలు జోరుగా మొదలయ్యాయి. స్థానిక నేతలు, కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొన్నారు. మొదటి రోజు కొత్త సభ్యత్వాలు తక్కువగా నమోదు కాగా ఇప్పటికే సభ్యులుగా ఉన్న వారు తమ సభ్యత్వాలను రెన్యువల్ చేసుకోవడం ఎక్కువగా కనిపించింది.
నకిలీ సభ్యత్వాలను రద్దు చేయాలి
శ్రీకాళహస్తి, అక్టోబరు 26(ఆంధ్రజ్యోతి): ఆన్‌లైన్ విధానాన్ని దుర్వినియోగం చేస్తూ కొందరు సృషిస్తున్న నకిలీ టీడీపీ సభ్యత్వాలను రద్దు చేయాలని ఆ పార్టీ పట్టణాధ్యక్షుడు విజయకుమార్ విజ్ఞప్తి చేశారు. పట్టణంలోని పార్టీ కార్యాలయంలో కొందరు వైసీపీ నాయకులు, కార్యకర్తలు గుట్టుచప్పుడు కాకుండా టీడీపీ సభ్యత్వాలు స్వీకరించడంపై ఆయన శనివారం మీడియాతో మాట్లాడారు. గత ఎన్నికల్లో టీడీపీని ఓడించడమే ధ్యేయంగా పనిచేసిన కొందరు ప్రస్తుతం ఆన్‌లైన్‌లో టీడీపీ సభ్యత్వాలను పొందుతున్నారన్నారు. క్షేత్రస్థాయిలో పక్కదారిపడుతున్న టీడీపీ సభ్యత్వాలపై పార్టీ అధిష్టానం దృష్టిసారించి నకిలీవి గుర్తించి రద్దు చేయాలని కోరారు.
Updated Date - Oct 27 , 2024 | 01:39 AM