ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

భక్తులతో ఆటలు

ABN, Publish Date - Sep 21 , 2024 | 03:36 AM

టీటీడీ అధికార యంత్రాంగం గత ఐదేళ్లలో అనుసరించిన రివర్స్‌ టెండరింగ్‌ విధానమే శ్రీవారి లడ్డూ ప్రసాదాల నాణ్యత విషయంలో కొంపముంచింది.

కొంపముంచిన రివర్స్‌ టెండరింగ్‌

కూటమి ప్రభుత్వం వచ్చాక ఆగస్టులో నందినితో ఒప్పందం

(తిరుపతి/తిరుమల-ఆంధ్రజ్యోతి)

టీటీడీ అధికార యంత్రాంగం గత ఐదేళ్లలో అనుసరించిన రివర్స్‌ టెండరింగ్‌ విధానమే శ్రీవారి లడ్డూ ప్రసాదాల నాణ్యత విషయంలో కొంపముంచింది. నాణ్యతా పరీక్షలకు టీటీడీ యంత్రాంగం తిలోదకాలిచ్చింది. ముడి సరుకులు, ఆహార పదార్థాల నాణ్యతను పరీక్షించే ల్యాబ్‌ సామర్థ్యాన్ని పెంచే విషయంపైనా దృష్టి సారించలేదు. రివర్స్‌ టెండరింగ్‌ ద్వారా గత ప్రభుత్వం కంటే జగన్‌ ప్రభుత్వంలో టీటీడీ నిధుల వ్యయం తగ్గించామని గొప్పలు చెప్పుకోవడం కోసం చేసిన ప్రయోగం వికటించింది. కాంట్రాక్టర్లు తక్కువ ధర కోట్‌ చేసి నాసిరకం ముడిసరుకులు సరఫరా చేశారు. దానివల్లే శ్రీవారి ప్రసాదాల రుచి, సువాసన, నాణ్యత ఘోరంగా దెబ్బతిన్నాయన్న ఆరోపణలున్నాయి.

నాడు నామమాత్రంగా పరీక్షలు

తిరుమలలో రోజువారీ సగటున 3 లక్షల లడ్డూలు తయారు చేస్తారు. వాటి తయారీకి రోజుకు సగటున 11 వేల కిలోల నెయ్యి వినియోగించాల్సి ఉంటుంది. దీనికోసం టీటీడీ భారీ పరిమాణంలో టెండర్ల ద్వారా నెయ్యిని సేకరిస్తుంది. తిరుపతిలో మార్కెటింగ్‌ విభాగం గోదాముల్లో నెయ్యి నిల్వ చేస్తారు. తిరుమలలో 77 వేల కిలోల నెయ్యి మాత్రమే నిల్వ చేసే సదుపాయం ఉంది. ఐదు ట్యాంకర్లలో ఈ నెయ్యిని స్టోర్‌ చేస్తారు. ఈ నెయ్యి వారం రోజుల పాటు మాత్రమే సరిపోతుంది. ఆ తర్వాత తిరుపతి నుంచి ఎప్పటికప్పుడు తెప్పించుకుంటారు. నెయ్యి సరఫరాకు టెండరు ఖరారు కాగానే గతంలో టీటీడీ నిపుణులైన అధికారుల బృందాన్ని తొలుత సరఫరాదారుకు చెందిన డెయిరీ ఉత్పత్తుల తయారీ పరిశ్రమకు పంపేవారు. వారికి అంత పరిమాణంలో నెయ్యి తయారు చేసి, సరఫరా చేసే సామర్థ్యం ఉందా లేదా పరిశీలించేవారు. సరఫరాదారు నాణ్యత విషయంలో అఫిడవిట్‌ తరహాలో సర్టిఫికెట్‌ ఇవ్వడంతో పాటు గుజరాత్‌లోని ఎన్‌డీబీఎల్‌ నుంచీ సర్టిఫికెట్‌ తెచ్చి టీటీడీకి సమర్పించేవారు. తర్వాత నెయ్యి తిరుపతి చేరగానే మార్కెటింగ్‌ విభాగం గోదాముల వద్ద ఉన్న ల్యాబ్‌లో శాంపిల్స్‌ టెస్టు చేసేవారు. అక్కడ స్టోర్‌ చేసిన నెయ్యిని కొండపైకి పంపాక పైన కూడా ల్యాబ్‌లో శాంపిల్స్‌ టెస్టు చేసేవారు. ప్రాథమికంగా సంతృప్తి చెందాక లడ్డూల తయారీకి వినియోగించేవారు. అయితే గత ఐదేళ్లలో ఇవేవీ సక్రమంగా నడవలేదన్న ఆరోపణలున్నాయి. నెయ్యి సరఫరా చేసే సంస్థ వద్దకు నిపుణుల బృందం వెళ్లి పరిశీలించడం వంటివన్నీ నిలిపివేసినట్టు సమాచారం. తిరుపతి, తిరుమలలోని ల్యాబ్‌లలో హెల్త్‌ ఇన్‌స్పెక్టరు స్థాయి అధికారుల పర్యవేక్షణలో ఐదుగురు చొప్పున సిబ్బంది కనీస స్థాయి పరీక్షలు మాత్రమే నిర్వహిస్తున్నారు. వాస్తవానికి ఈ పరీక్షలతో నెయ్యి నాణ్యత నిర్ధారించే అవకాశం లేదంటున్నారు. పూర్తిస్థాయిలో నెయ్యి నాణ్యతను నిర్ధారించడానికి గ్యాస్‌ క్రొమొటోగ్రఫీ, హై పెర్ఫార్మెన్స్‌ లిక్విడ్‌ క్రొమొటోగ్రఫీ యంత్రాలు అవసరమవుతాయి.

గతంలో ఉత్తుత్తి హడావుడి

గత వైసీపీ ప్రభుత్వంలో వైవీ సుబ్బారెడ్డి టీటీడీ బోర్డు ఛైర్మన్‌గా ఉన్నపుడు ప్రసాదాల నాణ్యతపై విమర్శలు రావడంతో ల్యాబ్‌కు ఆధునిక యంత్రాలు కొనుగోలు చేయాలని హడావిడిగా ప్రతిపాదనలు సిద్ధం చేశారు. నెయ్యి నాణ్యత పరీక్షించేందుకు రూ.2 కోట్లతో.. ఆహార పదార్థాల తనిఖీకి రూ.కోటితో పరికరాల కొనుగోలుకు ప్రతిపాదించగా బోర్డు ఆమోదించిందని సమాచారం. ఆ తర్వాత పరికరాల కొనుగోలు మాత్రం జరగలేదు. విమర్శలు, ఆరోపణలు కొనసాగుతున్న నేపథ్యంలో టీటీడీ అప్పటి ఈవో ధర్మారెడ్డి ఈ ఏడాది జనవరిలో మైసూరులోని సెంట్రల్‌ ఫుడ్‌ టెక్నాలజీ రీసెర్చి ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన రిటైర్డు సైంటిస్టును కాంట్రాక్టు ప్రాతిపదికన నియమించారు.


విజిలెన్స్‌ నివేదికలో ప్రస్తావన

టీటీడీలో గత ఐదేళ్లలో జరిగిన అవకతవకలపై విచారణ జరిపిన విజిలెన్స్‌ అధికారులు ముడి సరుకుల నాణ్యత విషయాన్ని కూడా నివేదికలో ప్రస్తావించినట్టు సమాచారం. తిరుపతి, తిరుమలలో ముడి సరుకుల నాణ్యతను పరీక్షించేందుకు ఏర్పాటు చేసిన ల్యాబ్‌లకు బోర్డులు మినహా లోపల అవసరమైన నిపుణులు లేరని, అలాగే పరీక్షలకు అవసరమైన పరికరాలు కూడా లేవని పేర్కొన్నట్టు తెలిసింది. పరీక్షలు లేనందునే ముడిసరుకుల నాణ్యతను పట్టించుకోవడం లేదని, నాసిరకం వస్తువుల వినియోగంతో శ్రీవారి ప్రసాదాల రుచి తగ్గిందన్న అభిప్రాయం వ్యక్తం చేసినట్టు తెలిసింది.

తిరుమలలోనే ల్యాబ్‌

కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక టీటీడీ ఈవోగా నియమితులైన శ్యామలరావు ముడిసరుకులు, ఆహార పదార్థాల నాణ్యతపై దృష్టి సారించారు. దీనికోసం తాత్కాలికంగా తిరుపతి జిల్లా ఫుడ్‌ సేఫ్టీ విభాగానికి చెందిన ఐదుగురు అధికారులను నియమించారు. తిరుమలలోనే నెయ్యి నాణ్యతను సూక్ష్మస్థాయిలో పరీక్షించేందుకు ప్రత్యేక అత్యాధునిక ల్యాబ్‌ను ఎఫ్‌ఎ్‌సఎ్‌సఐఏ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసేందుకు టీటీడీ చర్యలు తీసుకుంటోంది. ఇందుకు అవసరమయ్యే రూ.75 లక్షల విలువైన యంత్రాలను విరాళంగా ఇచ్చేందుకు ఎన్‌డీడీబీ ల్యాబ్‌ ముందుకువచ్చింది. డిసెంబరు నెలాఖరుకు ఈ ల్యాబ్‌ను అందుబాటులోకి తీసుకువచ్చి వంద శాతం నాణ్యతను పరీక్షించేలా ప్రణాళికలు రూపొందించుకున్నారు. పలు ప్రసాదాల్లో వినియోగిస్తున్న ముడిసరుకుల నాణ్యతను పరీక్షించేందుకు ల్యాబ్‌ను సిద్ధం చేయనున్నారు.

జూలై 22నుంచి బ్లాక్‌ లిస్టులో

ఈ ఏడాది మార్చి 13వ తేదీన నెయ్యి కొనుగోలుకు టెండర్లు పిలిచారు. మే 8వ తేదీన టెండర్లు ఖరారు చేశారు. నెయ్యి కేజీకి రూ.320 ఖరారు చేశారు. అదే నెల 15వ తేదీన ఏఆర్‌ డైరీ ఫుడ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థకు సరఫరాకు ఆర్డర్‌ ఇచ్చారు. అప్పటి నుంచి ఏఆర్‌ డైరీ ఫుడ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ నెయ్యిని సరఫరా చేస్తూ వచ్చింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత టీటీడీ ఈవోగా బాఽధ్యతలు తీసుకున్న శ్యామలరావుకు పలు సందర్భాల్లో భక్తులు లడ్డూ, అన్నప్రసాదాల మీద అసంతృప్తిని తెలిపారు. దీంతో పదార్థాల నాణ్యతపై దృష్టి పెట్టాలని ఆయన సూచించారు. ఈ సమయంలో ఏఆర్‌ డైరీ ఫుడ్స్‌ నుంచి వచ్చిన నాలుగు ట్యాంకర్లలోని నెయ్యిపై అనుమానం వ్యక్తమైంది. జూలై 6న రెండు ట్యాంకర్లు, 12వ తేదీన మరో రెండు ట్యాంకర్లలోని శాంపిల్స్‌ను ఎన్‌ఏబీఎల్‌ గుర్తింపు ఉన్న ఎన్‌డీడీబీ ల్యాబ్‌కు పంపారు. ప్రపంచస్థాయిలో గుర్తింపు ఉన్న ల్యాబ్‌ ఇది. జూలై 16వ తేదీన నెయ్యిలో కల్తీ జరిగినట్టు ల్యాబ్‌ రిపోర్టులువచ్చాయి. దీంతో నివ్వెరపోయిన టీటీడీ ఆ వెంటనే ఆ నాలుగు ట్యాంకర్ల నెయ్యిని వాడకుండా వెనక్కి పంపింది. జూలై 22వ తేదీన ఏఆర్‌ డైరీ ఫుడ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థను బ్లాక్‌లి్‌స్టలో పెట్టింది.


ప్రస్తుతం నాణ్యమైన నెయ్యితోనే..

ప్రస్తుతం వైష్ణవి డైరీ, పరాగ్‌ మిల్క్‌ ఫుడ్స్‌, కృపా రామ్‌ డైరీ, ప్రీమియర్‌ అగ్రి ఫుడ్స్‌ అనే సంస్థలు టీటీడీకి నెయ్యి సరఫరా చేస్తున్నాయి. మరోవైపు నాణ్యత కలిగిన నందిని నెయ్యిని తిరిగి కొనుగోలు చేయాలని టీటీడీ నిర్ణయించింది. 2024-25 ఏడాదికి గాను 350 మెట్రిక్‌ టన్నుల నెయ్యిని సరఫరా చేసేందుకు ఆగస్టు నెలాఖరులో టెండరు ఖరారు చేసింది. కేజీ రూ.478 చొప్పున కొనుగోలుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. గత నెల రోజులుగా అత్యంత నాణ్యమైన నెయ్యితోనే లడ్డూలు తయారు చేస్తుండంతో భక్తుల నుంచి ఫిర్యాదులు తగ్గాయి. నాణ్యత విషయంలో ఎలాంటి ఇబ్బందులు లేవని టీటీడీ నిర్థారించుకుని లడ్డూ తయారీలోనూ, అన్నప్రసాదాల తయారీలోనూ వినియోగిస్తోంది.

Updated Date - Sep 21 , 2024 | 03:36 AM