ఒంగోలులో ఫ్లెక్సీ రగడ
ABN, Publish Date - Sep 21 , 2024 | 11:37 PM
ప్రకాశం జిల్లా ఒంగోలులో ఫ్లెక్సీ రగడ చోటుచేసుకుంది. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేనలోకి రావడాన్ని స్వాగతిస్తూ ఆయన అభిమానులు శనివారం ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ వివాదానికి దారితీసింది. వైసీపీకి చెందిన బాలినేని శ్రీనివాసరెడ్డి ఇటీవల ఆపార్టీకి రాజీనామా చేశారు. జనసేనలో చేరేందుకు సిద్ధమయ్యారు. అందులో భాగంగా ఆపార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను కలిశారు. ఈనెల 26న ఆయన జనసేనలో చేరేందుకు దాదాపు ముహూర్తం కూడా ఖరారైంది.
ఆగ్రహం వ్యక్తంచేసిన తెలుగు తమ్ముళ్లు
కనిపించని జనసేన జిల్లా అధ్యక్షుడు రియాజ్ ఫొటో
ఒంగోలు (కార్పొరేషన్), సెప్టెంబరు 21 : ప్రకాశం జిల్లా ఒంగోలులో ఫ్లెక్సీ రగడ చోటుచేసుకుంది. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేనలోకి రావడాన్ని స్వాగతిస్తూ ఆయన అభిమానులు శనివారం ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ వివాదానికి దారితీసింది. వైసీపీకి చెందిన బాలినేని శ్రీనివాసరెడ్డి ఇటీవల ఆపార్టీకి రాజీనామా చేశారు. జనసేనలో చేరేందుకు సిద్ధమయ్యారు. అందులో భాగంగా ఆపార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను కలిశారు. ఈనెల 26న ఆయన జనసేనలో చేరేందుకు దాదాపు ముహూర్తం కూడా ఖరారైంది. ఈనేపథ్యంలో బాలినేని అభిమాని అయిన ఇందుర్తి ప్రసాద్ (వైసీపీ కార్యకర్త), ఆయన స్నేహితులు కలిసి ‘జిల్లా మెగాస్టార్ వాసన్నకు శుభాకాంక్షలు’ అంటూ ఒంగోలులోని చర్చి సెంటర్‌లో ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. అందులో బాలినేని ఫొటోతోపాటు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ఆయన సోదరుడు సినీ హీరో చిరంజీవి, టీడీపీకి చెందిన ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ఫొటోలను ఉంచారు. దీనిపై తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫ్లెక్సీని తొలగించేందుకు ప్రయత్నించారు. వెంటనే అప్రమత్తమైన కార్పొరేషన్ అధికారులు ఆ ఫ్లెక్సీని తొలగించి కార్పొరేషన్ కార్యాలయానికి తరలించారు.
ఎవరినడిగి ఫొటో పెట్టారు? : తెలుగు తమ్ముళ్లు
బాలినేని ఫ్లెక్సీలో ఎమ్మెల్యే దామచర్ల ఫొటో పెట్టడంపై తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తెలుగు యువత జిల్లా అధ్యక్షుడు ముత్తన శ్రీనివాసరావుతోపాటు యువత నగర అధ్యక్షుడు నలమోతు రమేష్, ఉపాధ్యక్షుడు ఉమర్ మాట్లాడుతూ.. గడిచిన ఐదేళ్లు వైసీపీ అధికారంలో ఉండటంతో టీడీపీ శ్రేణులపై అక్రమ కేసులు పెట్టించి అనేక రకాలుగా ఇబ్బందులకు గురిచేసిన బాలినేని ఫ్లెక్సీలో తమ నాయకుడు దామచర్ల ఫొటోను ఎవరిని అడిగి పెట్టారని ప్రశ్నించారు. ఫ్లెక్సీలో దామచర్ల ఫొటో పెట్టడం ఉద్దేశపూర్వకంగానే జరిగిందన్నారు. తమ మనోభావాలను దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తే ఉపేక్షించేంది లేదని హెచ్చరించారు. ఇదిలా ఉండా ఫ్లెక్సీలో జనసేన జిల్లా అధ్యక్షుడు షేక్ రియాజ్ ఫొటో లేకపోవడం విమర్శలకు తావిచ్చింది. దీనిపై ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం.
Updated Date - Sep 21 , 2024 | 11:37 PM