ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

వర.. ప్రసాదం!

ABN, Publish Date - Nov 03 , 2024 | 02:12 AM

ఏదైనా ఆలయానికి దేవుడి దర్శనానికి వెళతాం. దర్శనం పూర్తయ్యాక కచ్చితంగా వెళ్లేది ప్రసాదం కోసమే. దేవుడి వర ప్రసాదంగా భావిస్తాం కాబట్టి అది అత్యంత పవిత్రమైందిగా కళ్లకు అద్దుకుని మరీ స్వీకరిస్తాం. ఆలయానికి వచ్చే భక్తుల కోసం ప్రముఖ ఆలయాలన్నీ ప్రసాదాన్ని ఎంతో పవిత్రంగా, నియమనిష్టలతో తయారుచేస్తాయి. అందులో వాడే దినుసులు, నెయ్యి చాలా నాణ్యమైనవి వాడతారు. తయారీ విధానం కూడా అర్చక స్వాముల ఆధ్వర్యంలోనే కొనసాగుతుంది.

  • ఆలయాల్లో ప్రసాదాలంటే ఇష్టపడని వారుంటారా..

  • అన్నవరం ప్రసాదానికి అంతర్జాతీయ ఖ్యాతి

  • వాడపల్లి సహా ఇతర అన్ని ప్రసిద్ధ ఆలయాల్లోనూ నియమనిష్టలతో తయారీ

  • ప్రసాదాల్లో రవ్వ లడ్డూలు, బూందీ లడ్డూలు, పులిహోర.. దేని ప్రత్యేకత దానిదే

ఏదైనా ఆలయానికి దేవుడి దర్శనానికి వెళతాం. దర్శనం పూర్తయ్యాక కచ్చితంగా వెళ్లేది ప్రసాదం కోసమే. దేవుడి వర ప్రసాదంగా భావిస్తాం కాబట్టి అది అత్యంత పవిత్రమైందిగా కళ్లకు అద్దుకుని మరీ స్వీకరిస్తాం. ఆలయానికి వచ్చే భక్తుల కోసం ప్రముఖ ఆలయాలన్నీ ప్రసాదాన్ని ఎంతో పవిత్రంగా, నియమనిష్టలతో తయారుచేస్తాయి. అందులో వాడే దినుసులు, నెయ్యి చాలా నాణ్యమైనవి వాడతారు. తయారీ విధానం కూడా అర్చక స్వాముల ఆధ్వర్యంలోనే కొనసాగుతుంది. కాకినాడ, తూర్పుగోదావరి, కోనసీమ జిల్లాల్లో మనకు ఎన్నో విశిష్టమైన ఆలయాలు ఉన్నాయి. ఆయా ఆలయాల్లో ప్రసాదాలకూ ఎంతో ప్రత్యేకత ఉంది. ప్రధానంగా అన్నవరం ప్రసాదం అంటే అందరికీ చాలా ఇష్టం. ఇతర ఆలయాల్లోనూ లడ్డూలు, పులిహోర ప్రసాదాలు ఎంతో రుచిగా రూపొందిస్తారు. మన ఆలయాల్లో ప్రసాదాల ప్రత్యేకతలపై కథనం..

అమృతతుల్యం.. అన్నవరం ప్రసాదం

అన్నవరం అనగానే గుర్తొచ్చేది సత్యదేవుడి గోధుమరవ్వ ప్రసాదం. ఇది ఎంతో అమృతతుల్యంగా ఉం డడం, విస్తరాకులో అందించడంతో అన్నవరం సామి ప్రసాదం ఆకుతో నాకేయాలి అంటూ చలోక్తులు విసురుతుంటారు. అన్నవరంలో గోధుమరవ్వ ప్రసాదం ఎందు కు తయారుచేస్తారో పురాణ కథ ప్రచారంలో ఉంది. స్కాంద పురాణంలో శూతమహాముని శౌనికాది మును లకు దీని గురించి వివరిస్తారట. గోధుమరవ్వ, పాలు, ఆవునెయ్యి, పంచదార, సుగంధ ద్రవ్యాలతో తయారుచేసి సత్యదేవుడికి నైవేద్యం సమర్పించి ప్రసాదంగా తీసుకోవాలని చెబుతారు. 1891లో సత్యదేవుడి ఆలయం ఆవిర్భా వం జరిగింది. అప్పటినుంచి స్వామివారి ఆలయంలో గోధుమరవ్వ ప్రసాదం భక్తులకు అందిస్తున్నారు. ఏటా రెండు కోట్ల ప్యాకెట్లను భక్తులకు విక్రయిస్తుంటారు. ఏ ఆలయంలో అయినా పులిహోర, లడ్డూ ప్రసాదంగా ఉం డగా దేశవ్యాప్తంగా అన్నవరం ఆలయంలోనే గోధుమరవ్వ ప్రసాదంగా అందిస్తారు. స్వచ్ఛమైన వేడినీటిలో గోఽ దుమరవ్వను ఉడికించి, ఆవునెయ్యి, పంచదార, సుగంద ద్రవ్యాల తో వీటిని వం టస్వాములు తయారుచేస్తారు. ఈ ప్రసాదానికి ఎఫ్‌ఎస్‌ ఎస్‌ఏఐ గుర్తింపు లభించింది.

బంగీప్రసాదం: సత్యదేవుడి ఆలయంలో గోధుమరవ్వ ప్రసాదంతోపాటు బంగీప్రసాదం విక్రయిస్తారు. కరాచీరవ్వతో తయారుచేసే ప్రసాదంలో జీడిపప్పు, కిస్‌మిస్‌ కూడా వేస్తారు. వారం వరకు నిల్వ ఉండడంతో దూరప్రాంతాలు ప్రయాణించే భక్తులు వీటిని తీసుకెళతారు. ఏటా సుమారు 20 లక్షల బంగీప్రసాదం ప్యాకెట్లను విక్రయిస్తారు. ఇక ప్రసాద విక్రయాల ద్వారా రూ.40 కోట్లు గోధుమరవ్వ ద్వా రానూ, బంగీ ప్రసాదం ద్వారా రూ.10 కోట్లు లభిస్తోంది. - ఆంధ్రజ్యోతి/అన్నవరం

అమోఘం.. అయినవిల్లి రవ్వలడ్డూ

అయినవిల్లి, నవంబరు 2(ఆంధ్రజ్యోతి): అయినవిల్లి శ్రీసిద్ధి వినాయక ఆలయంలో 2003 నుంచి ప్రసాదాల తయారీ ప్రారంభించారు. అత్యంత రుచికరమైన ప్రసాదంగా పేరొందిం ది. స్వామివారి ప్రసాదాలుగా లడ్డూ, పులిహోర విక్రయిస్తున్నారు. అర్చకస్వాములే ప్రసాదం తయారుచేస్తున్నారు. రోజుకు 50 కిలోల రవ్వ, 10 కిలోల హెరిటేజ్‌ నెయ్యితో రవ్వ తయారీ చేస్తున్నారు. సాధారణ రోజుల్లో 900 నుంచి వెయ్యి లడ్డూలు, పర్వదినాల్లో 3 వేల నుంచి 4 వేల వరకు విక్రయిస్తున్నారు. పులిహోర రోజుకు 40 కిలోలు, పర్వదినాల్లో 800 పులిహోర ప్యాకెట్లు, ప్యాకెట్‌ ఒకటి రూ.10 వంతున విక్రయిస్తున్నారు.

ప్రీతికరం.. అంతర్వేది స్వామివారి లడ్డూ

అంతర్వేది నవంబరు 2: దక్షిణకాశీగా పేరొందిన అంతర్వేది పుణ్యక్షేత్రంలో శ్రీలక్ష్మీనరసింహస్వామివారు ప్రతి ఇంట ఇలవేల్పుగా భావిస్తూ పశ్చిమ ముఖంగా దర్శనమిస్తారు. కొన్నిసంవత్సరాలుగా ఎంతో ప్రీతికరమైన స్వామివారి లడ్డూను భక్తులు ఎంతో ఇష్టంగా కొనుగోలు చేస్తారు. ఒక లడ్డూ ధర రూ.15. ఆలయంలోనే సిబ్బందితో ఈ లడ్డూ తయారుచేస్తారు. ఒక పాకానికి సుమారు 500 లడ్డూలు దాటి తయారవుతాయి. దసరా, కార్తీకమాసం, సంక్రాంతి పర్వదినాలతోపాటు విశేషమైన రోజుల్లో భక్తులు ఎక్కువగా లడ్డూను కొనుగోలు చేస్తారు. లడ్డూ తయారీకి శనగపప్పును ఆలయంలోనే మిల్లింగ్‌ చేసి పిండి ఆడతారు. విశాఖ డెయిరీ నెయ్యిని, టెండరు ప్రక్రియ ద్వారా కిరాణా సరుకులు లడ్డూ తయారీలో వినియోగిస్తారు.

మురమళ్లలో కల్యాణం లడ్డూలు ఉచితంగా..

ఐ.పోలవరం, నవంబరు 2(ఆంధ్రజ్యోతి): ఐ.పోలవరం మండలం మురమళ్లలో వీరేశ్వరస్వామి నిత్యకల్యాణోత్సవా లు జరుగుతాయని తెలిసిందే. ఇక్కడ కల్యాణం సందర్భం గా ఉచితంగా లడ్డూలు ఇస్తారు. సుదీర్ఘకాలం అనుభవం ఉన్న వంటస్వామి విశ్వనాథ సత్యనారాయణ ప్రసా దం తయారు చేస్తారు. 1982 నుంచి 2012 వరకు విజయవాడ కనకదుర్గ ఆలయంలో ఆయన పనిచేశారు. లడ్డూ తయారీ శనగపిండి, పంచదార, నెయ్యి, జీడిపప్పు, కిస్మిస్‌, యాలకులు, కర్పూరం, జాజికాయ వినియోగిస్తారు. కళ్యాణం భక్తులకు 180గ్రా.ల లడ్డూ ఉచితంగా ఇస్తారు. సాధారణ భక్తులకు 80గ్రా.ల లడ్డూ పది రూపాయలకు అందజేస్తారు. పులిహోర ఇక్కడ ప్రత్యేక రుచితో ఉండడం విశేషం.

వెంకన్న లడ్డూ.. భలే రుచి

ఆత్రేయపురం, నవంబరు 2(ఆంధ్రజ్యోతి): కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీ వేంకటేశ్వరస్వామి ఆల యానికి వివిధ రాష్ట్రాల నుంచి వేలాదిగా భక్తులు తరలివస్తున్నారు. ఏడు శనివారాల నోము ఆచరిస్తున్న భక్తులు వేలాదిగా వచ్చి స్వామిని దర్శించుకుంటున్నారు. ఈ క్షేత్రంలో స్వామివారి లడ్డూ ఎంతో ప్రాచుర్యం పొందింది. 2007 నుంచి ఆలయంలోనే స్వామివారి లడ్డూను తయారుచేస్తున్నారు. ఆలయ ప్రాకార మండపంలో ప్రసాదశాలను నిర్మించారు. కొయంబత్తూరు నుంచి లడ్డూ తయారీకి ప్రత్యేక మిషనరీ తీసుకువచ్చి గ్యాస్‌ ద్వారా స్వామివారి ప్రసాదం నియమనిబంధనలతో తయా రుచేస్తున్నారు. తిరుపతి తరహాలో స్వామివారి లడ్డూను తయారు చేయ డం గమనార్హం. ప్రతిరోజూ 31 మంది సిబ్బంది స్వామివారి లడ్డూ తయారీలో నిమగ్నమవుతున్నారు. నెలకు 2.51 లక్షల లడ్డూను తయారు చేస్తూ ఒక్కొ క్క లడ్డూ రూ.15కు విక్రయిస్తున్నారు. పచ్చకర్పూరం, జాజికాయ, యాలికలు, కిస్మిస్‌, జీడిపప్పు, హెరిటేజ్‌ నెయ్యి, శెనగపిండి, పంచదారతో స్వామివారి లడ్డూ ప్రసాదాన్ని అందిస్తున్నారు.

భీమేశ్వరుని ప్రసాదం.. అద్భుతం

ద్రాక్షారామ, నవంబరు 2(ఆంధ్రజ్యోతి): ప్రాచీన శైవక్షేత్రం.. పంచారామం ద్రాక్షారామ భీమేశ్వరాలయంలో ప్రసాదం తయారీ విక్రయాలు 33 ఏళ్ల కిందట ప్రారంభించారు. పులిహోర, రవ్వలడ్డూ, బూంది లడ్డూ ప్రసాదాలు భక్తులకు అందుబాటులో ఉంటాయి. తొలుత బయట వంట బ్రాహ్మణులకు తయారీ అవకాశం ఇచ్చేవారు. తర్వాత ఆలయబేడా మండపంలో పాకశాలలో తయారుచేసేవారు. ప్రస్తుతం అన్నప్రసాద భవనం అందుబాటులోకి రావడంతో ప్రసాదాల తయారీ అక్కడే చేస్తున్నారు. బూంది లడ్డూ తయారీకి శనగపిండి, పంచదార, జీడిపప్పు, కిస్‌మిస్‌లు, యాలకులు, ఆవునెయ్యి, పచ్చకర్పూరం, సన్‌ప్లవర్‌ ఆయిల్‌ వాడుతారు. రవ్వలడ్డూ తయారీకి పంచదార, ఆవునెయ్యి, యాలకులు, కరాచీరవ్వ, జీడిపప్పు, కిస్‌మిస్‌ వాడుతారు. పులిహోర తయారీ కూడా ప్రత్యేకం. నాణ్యమైన దినుసులే వాడతారు. ప్రసాదాల ను ఆలయంలో ప్రత్యేక కౌంటర్లు ద్వారా విక్రయాలు జరుపుతారు. 2023-2024 ఏడాదిలో ప్రసాదాలు విక్రయం ద్వారా రూ.44,39,365 సమకూరింది. ప్రసాదాలు తయారీకి రూ.31,00,391 ఖర్చుచేశారు.

బాలబాలాజీ లడ్డూ.. ఆహా ఏమి రుచి

మామిడికుదురు, నవంబరు 2(ఆంధ్రజ్యోతి): వైనతేయ నదీ తీరంలో బాలతిరుపతిగా వర్థిల్లుతున్న అప్పనపల్లి బాలబాలాజీ దేవస్థానం లడ్డూ ప్రసాదాన్ని భక్తులు పవిత్రంగా భావిస్తారు. మొదట్లో ఆలయ నిర్మాత మోల్లేటి రామస్వామి బూరి, పులిహోర ప్రసాదంగా అందించేవారు. 1981 సంవత్సరంలో ఆలయాన్ని తమ ఆఽధీనంలోకి తీసుకుని లడ్డూ ప్రసాదాన్ని భక్తులకు అందుబాటులోకి తీసుకువచ్చారు. స్వచ్ఛమైన నెయ్యితో 80 గ్రాము ల బరువుగల లడ్డూను రూ.15కి విక్రయిస్తున్నారు. స్వచ్ఛమైన నెయ్యితో తయారు ఈ లడ్డూను భక్తులు ఇష్టంగా తింటారు.

పంచారామ.. ప్రసాదం

సామర్లకోట, నవంబరు 2(ఆంధ్ర జ్యోతి): పంచారామ పుణ్యక్షేత్రమైన సామర్లకోట కుమార రామ భీమేశ్వ రాలయంలో కరాచీ (తెల్లనూక) నూక లడ్డూను విక్రయిస్తున్నారు. ప్రతిరోజూ పులిహోర ప్రసాదంతోపాటు కరాచీ నూక లడ్డూలు కూడా ఆలయం వద్ద భక్తులకు విక్రయిస్తుంటారు. ప్రస్తుతం ఆలయంలోనే తయారుచేస్తున్నారు.

పాదగయ రవ్వలడ్డూ.. ఉత్తరాదికి ప్రీతి

పిఠాపురం,నవంబరు2(ఆంధ్రజ్యోతి): దక్షిణకాశీగా విరాజిల్లుతున్న పిఠాపురం పాదగయ క్షేత్రంలో రవ్వలడ్డూ ప్రసాదానికి విశిష్టత ఉంది. ఉత్తరాది రాష్ట్రాల భక్తులు ఎక్కువగా ప్రసాదాన్ని కొనుగోలు చేస్తూ ఉంటారు. పులిహోర ప్రసాదం కూడా ఇక్కడ అందు బాటులో ఉంటుంది. పాదగయలో స్వయంభువు కుక్కుటేశ్వరస్వామి, ఆదిశంకరాచార్య ప్రతిష్టించిన రాజరాజేశ్వరీదేవి, అష్టాదశశక్తి పీఠాల్లో దశమ శక్తి పీఠం అధిష్టాన దేవతైన పుర్హుతికాఅమ్మవారు, స్వ యంభువు దత్తాత్రేయస్వామి దర్శనాలకు ఉభయ తెలుగురాష్ట్రాలతోపాటు ఉత్తరాది రాష్ట్రాలు, ఒడిశా, కర్నాటక, గోవా, పశ్చిమ బెంగాల్‌నుంచి భక్తులు అధి కంగా వస్తుంటారు. ఇక్కడకు వచ్చిన భక్తులు దర్శనాల తర్వాత తప్పనిసరిగా ఇక్కడ లభించే రవ్వ లడ్డూ ప్రసాదాన్ని తీసుకుంటారు. మిగిలిన దేవస్థానాలకు భిన్నంగా ఈ రవ్వ లడ్డూ ఉంటుంది. కరాచి నూక, పంచదార, నెయ్యి, కిస్‌మిస్‌, యాలకులు వినియోగిస్తారు. పాలు వాడరు. ఒక్కో రవ్వలడ్డూ ప్రసాదాన్ని రూ.15కి విక్రయిస్తున్నారు. పులిహోర ప్రసా దం రూ.10కి విక్రయిస్తారు. మహాశివరాత్రి, శరన్నవరాత్రులు, కార్తీక, శ్రావణమాసాలు వంటి పర్వదినా ల్లో రవ్వలడ్డూ ప్రసాదాలకు అధిక డిమాండ్‌ ఉం టుందని ఈవో జగన్మోహన్‌ శ్రీనివాస్‌ తెలిపారు.

Updated Date - Nov 03 , 2024 | 02:12 AM