విషాదయాత్ర!!
ABN, Publish Date - Sep 23 , 2024 | 01:34 AM
వాళ్లు వైద్యవిద్యార్థులు.. భవిష్యత్తుపై ఎన్నో ఆశలు.. ఆశయాలతో ఉన్నతవిద్య చదవాలనే సంకల్పతో ఉన్నవారు.. ఏలూరు ఆశ్రమ్ వైద్యకళాశాలలో ద్వితీయ సంవత్సరం చదువుతూ.. ఎవరికి వారు మంచిపేరు తెచ్చుకుంటున్నవారే.. స్నేహితులంతా సరదాగా గడిపేందుకు తూర్పు ఏజెన్సీలోని అటవీప్రాంతానికి వచ్చారు.. మారేడుమిల్లి జలతరంగిణి జలపాతంవద్ద ఆగారు. అప్పటివరకూ ఎంతో కేరింతలు కొట్టి ఉత్సాహంగా గడిపారు. తమ స్నేహానికి జీవితంలో గుర్తుండేలా ప్రకృతి అందాలతో కలిసి ఫొటోలను దిగారు. అకస్మాత్తుగా ప్రకృతి కన్నెర్ర చేసింది.
అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి జలతరంగిణి వద్ద కొట్టుకుపోయిన ఐదుగురు వైద్యవిద్యార్థులు
ఇద్దరిని కాపాడిన స్నేహితులు, అగ్నిమాపక సిబ్బంది
ముగ్గురు మెడికల్ విద్యార్థులు ఆచూకీ గల్లంతు
గాలింపు చర్యలు చేపట్టిన అధికారులు
14మంది విద్యార్థులు రాక.. ముగ్గురి గల్లంతు.. ముగ్గురికి గాయాలు
విషాదంగా మారిన విహారయాత్ర
రెండురోజులుగా వర్షాలు..
అనుమతిలేకున్నా లోపలికి పంపిన అటవీశాఖ సిబ్బంది
నిర్లక్ష్యంపై సర్వత్రా విమర్శలు
వాళ్లు వైద్యవిద్యార్థులు.. భవిష్యత్తుపై ఎన్నో ఆశలు.. ఆశయాలతో ఉన్నతవిద్య చదవాలనే సంకల్పతో ఉన్నవారు.. ఏలూరు ఆశ్రమ్ వైద్యకళాశాలలో ద్వితీయ సంవత్సరం చదువుతూ.. ఎవరికి వారు మంచిపేరు తెచ్చుకుంటున్నవారే.. స్నేహితులంతా సరదాగా గడిపేందుకు తూర్పు ఏజెన్సీలోని అటవీప్రాంతానికి వచ్చారు.. మారేడుమిల్లి జలతరంగిణి జలపాతంవద్ద ఆగారు. అప్పటివరకూ ఎంతో కేరింతలు కొట్టి ఉత్సాహంగా గడిపారు. తమ స్నేహానికి జీవితంలో గుర్తుండేలా ప్రకృతి అందాలతో కలిసి ఫొటోలను దిగారు. అకస్మాత్తుగా ప్రకృతి కన్నెర్ర చేసింది. వర్షపునీరు వరదలా మారి జలపాతంలోకి రావడంతో వీరు గమనించలేకపోయారు. క్షణాల్లోనే ఇదంతా జరగడంతో తప్పించుకోవడానికి వీలులేకుండా పోయింది. ఈ వరదలో మొత్తం 14మందికిగాను ఐదుగురు కొట్టుకుపోగా.. ఇద్దరిని మిగతా స్నేహితులు, అగ్నిమాపక సిబ్బంది కలిసి అతికష్టం మీద కాపాడారు. మరో ముగ్గురు గల్లంతు కావడంతో వీరి విహార యాత్ర కాస్తా విషాదంగా మారింది. ఈ వ్యవహారంలో అటవీశాఖ నిర్లక్ష్యం కనిపిస్తోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇటీవల వర్షాల నేపథ్యంలో పర్యాటక ప్రాంతాలకు అనుమతులు రద్దు చేశారు. అయినా జలంతరంగిణి వద్ద అటవీశాఖ సిబ్బంది వీరిని అనుమతించడంపై విమర్శలు వినిపిస్తున్నాయి.
మారేడుమిల్లి/ఏలూరు క్రైం, సెప్టెంబరు 22: ఏలూరు ఆశ్రమ్ వైద్యకళాశాల నుంచి మొత్తం 14మంది విద్యార్థులు టెంపో ట్రావెల్‌ను మాట్లాడుకుని శనివారం రాత్రి బయలుదేరారు. అలా వివిధ ప్రాంతాలు చూసుకుంటూ అల్లూరి సీతారామరాజు ఆదివారం మారేడుమిల్లికి వచ్చారు. రోజంతా ఆహ్లాదకర వాతావరణంలో గడిపారు. వారంతా మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో జలతరంగిణి జలపాతం వద్ద స్నానాలు చేస్తున్నారు. కొంతమంది ఫొటోలు తీసుకుంటున్నారు. అప్పటికే వర్షం ప్రారంభమైంది. ఎగువప్రాంతాల్లో కూడా వర్షం పడుతోంది. ఈ సమయంలో ఒక్కసారిగా ఎర్రరంగు నీరు రావడంతో స్నానం చేసేవారికి అర్థం కాలేదు. ఫొటోలు తీసేవారు బురద నీరు వస్తోందని కేకలు వేస్తున్నారు. అయినా జలపాతం శబ్ధంలో స్నానాలు చేసే వారు గమనించలేకపోయారు. క్షణాల్లోనే నీరు పెరిగిపోతుండగా వెంటనే కొంతమంది తప్పించుకోగా అక్కడ ఐదుగురు చిక్కుబడిపోయారు. అప్పటికే ఇటీవలి వర్షాలకు ఆ ప్రాంతమంతా నాచుపట్టేసి ఉండడంతో ఆ ఐదుగురు కిందకు జారిపోయి కొట్టుకుపోయారు.
ఇద్దరిని రక్షించిన స్నేహితులు, అగ్నిమాపక సిబ్బంది
జలతరంగిణి వద్ద జారిపోయిన ఐదుగురు విద్యార్థులు గాయత్రి పుష్ప, చింతా హరిణి ప్రియ, కె.సౌమ్య, బి.అమృత, సీహెచ్ హరదీప్ కాలువలోకి కొట్టుకుపోయారు. వీరిలో ఒకరిని స్నేహితులు అతికష్టం మీద కాపాడగలిగారు. ఈలోపు పోలీసులకు సమాచారం అందింది. వారు వెంటనే రంపచోడవరం అగ్నిమాపక సిబ్బందిని రప్పించారు. కొండలపై నుంచి వర్షపునీరు ఉధృతంగా రావడంతో మిగిలిన వారి జాడ తెలియలేదు. కాసేపటికి జలపాతం దిగువన కల్వర్టు వద్ద సిమెంట్ తూరల్లో ఒకరు ఉన్నట్టు గుర్తించి అగ్నిమాపక సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్ చేపట్టి కాపాడారు. అలా వీరిలో గాయత్రి ప్రియ, చింతా హర్షిణిలను రక్షించారు. మిగిలిన ముగ్గురు విద్యార్థులు ప్రకాశం జిల్లా మార్కాపురానికి చెందిన చింతకుంట హరదీప్(20), విజయనగరం జిల్లాకు చెందిన కొసిరెడ్డి సౌమ్య(21), విజయనగరం జిల్లాకు బాలి అమృత (22) కాలువలోకి కొట్టుకుపోయారు.
గాలింపు చర్యలకు ఆటంకం..
మొత్తం 14మందిలో ముగ్గురు గల్లంతు కాగా ముగ్గురు గాయపడ్డారు. వీరిని 108 ఆంబులెన్స్‌లో రంపచోడవరం ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఒకరిని మెరుగైన వైద్యంకోసం రాజమహేంద్రవరం జిల్లా ఆస్పత్రికి తరలించగా ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరినట్లు సమాచారం. గల్లంతైన వారికోసం గాలింపు చర్యలు ముమ్మరం చేయగా వర్షం అధికంగా కురుస్తుండడం.. చీకటి పడిపోవడంతో గాలింపు చర్యలకు ఆటంకంగా మారాయి. రంపచోడవరం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి కట్టా సింహాచలం సంఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలను పర్యవేక్షించారు. ఈ సంఘటనపై మారేడుమిల్లి సీఐ సీహెచ్ గోపాలకృష్ణ ఆధ్వర్యంలో ఎస్‌ఐ రాము కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వైద్యవిద్యార్థుల కోసం తమ కళాశాల తరపున ప్రత్యేక బృందాన్ని పంపించామని, వారికి అవసరమైన సహాయ సహకారాలు అందించడం, గాయపడ్డవారికి మెరుగైన వైద్యం అందించడానికి తాము అన్ని చర్యలు తీసుకుంటామని ఏలూరు ఆశ్రమ్ కళాశాల యాజమాన్యం వెల్లడించింది.
అటవీశాఖ నిర్లక్ష్యం..
రెండురోజులుగా మారేడుమిల్లి ప్రాంతంలో వర్షం కురుస్తోంది. జలపాతాలు, కొండవాగుల వద్దకు పర్యాటకులకు అనుమతులు లేనప్పటికీ వీటిని నిర్వహిస్తున్న అటవీశాఖాధికారులు మాత్రం టిక్కెట్లు విక్రయించి మరీ పర్యాటకులను జలపాతాల వద్దకు అనుమతించడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇక్కడి పరిస్థితుల పట్ల అవగాహన లేని పర్యాటకులు లోపలికి వెళ్లి ప్రాణాలమీదకు తెచ్చుకుంటున్నారని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
వాళ్లు బతికుండాలని ఆశతో తోటి స్నేహితులు
గల్లంతైన వారు ఎక్కడైనా చెట్లను పట్టుకుని బతికి ఉన్నారేమో అనే ఆశతో తోటి విద్యార్థులు ఎదురుచూస్తున్నారు. గల్లంతైనవారిలో చింతపల్లి హరదీప్‌కు బ్యాడ్మింటన్ క్రీడాకారుడిగా పేరుంది. అతడు గుండె ఆపరేషన్లు చేసే ప్రత్యేక వైద్యనిపుణుడిగా పేరు పొందాలని ఆశయంతోనే ఏలూరు ఆశ్రం కళాశాలలో ఎంబీబీఎస్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. బాలి అమృత తెలివైన విద్యార్థినిగా పేరుంది. డాక్టర్ చదివి పేదల వైద్యురాలిగా పేరు పొందాలనే ఆశయంతోనే చదువుతోంది. కొసిరెడ్డి సౌమ్య కూడా మంచి వైద్యురాలిగా ప్రజలకు సేవ చేయాలనే ఆశయంతోనే చదువును కొనసాగిస్తోంది. ఆనందంగా వెళ్లిన వీరిలో ముగ్గురు విద్యార్థులు జలపాతం వద్ద కొట్టుకుపోయారని సమాచారం అందడంతో ఆశ్రం కళాశాలలో విద్యార్థుల్లో తీరని విషాదం నెలకొంది. వారు ఎక్కడో చోట ఏ చెట్టునో.. రాయినో పట్టుకుని బతికి ఉండాలని వారు దేవుళ్లను మొక్కుకుంటున్నారు.
పర్యాటక ప్రాంతాల్లో పర్యాటకులకు నిషేధం: సబ్‌కలెక్టరు
రంపచోడవరం, సెప్టెంబరు 22: ఏజెన్సీలో రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీవర్షాలకు వాగులు పొంగి ప్రవహిసున్న నేపథ్యంలో పర్యాటక ప్రాంతాలకు పర్యాటకులను అనుమతిలేదని రంపచోడవరం సబ్‌కలెక్టరు కల్పశ్రీ తెలిపారు. మైదాన ప్రాంతాల నుంచి వచ్చే పర్యాటకులను తిరిగి వెనక్కి పంపించేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రజలు కొండ కాలువలు, వాగులు దాటే ప్రయత్నాలు చేయొద్దని సూచించారు.
జలపాతంలో వైద్యవిద్యార్థుల గల్లంతు బాధాకరం: మంత్రి దుర్గేష్
రాజమహేంద్రవరం సిటీ, సెప్టెంబరు 22: అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి సమీపంలోని జలతరంగణి జలపాతంవద్ద వాగులో ఐదుగురు వైద్యవిద్యార్థులు గల్లంతైన ఘటనపై రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి దుర్గేష్ తీవ్రదిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఘటనపట్ల విచారం వ్యక్తం చేశారు. గల్లంతైన విద్యార్థులకోసం గాలింపు చర్యలు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించినట్లు మంత్రి చెప్పారు.
Updated Date - Sep 23 , 2024 | 01:44 AM