నమాజ్‌కని బయలుదేరి.. కానరాని లోకాలకు
ABN, Publish Date - Jan 20 , 2024 | 01:51 AM
నమాజ్‌కని బయలుదేరి.. కానరాని లోకాలకు
కారు ఢీకొని చికెన్ వ్యాపారి మృతి
కరప, జనవరి 19: ప్రతీరోజు మాదిరిగానే వ్యాపారం ముగించుకుని నమాజ్ చేసుకోవడానికి బయలుదేరిన ఒక వ్యక్తిని కారు ఢీకొనడంతో కానరాని లోకాలకు తరలిపోయాడు. కాకినాడ జిల్లా కరపలో శుక్రవారం మధ్యాహ్నం జరిగిన ఈ ఘటనకు సంబంధించి స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. బిక్కవోలు మండలం పందలపాక గ్రామానికి చెందిన షేక్ రామ్‌తుల్లా(50) కొన్నేళ్ల కిందట కరప వచ్చి కుటుంబంతో కలిసి జీవిస్తున్నాడు. స్థానిక స్వర్ణ ఽథియేటర్ వద్ద ఇద్దరు కుమారులతో కలిసి చికెన్ షాపును నిర్వహిస్తూ జీవనోపాధి పొందుతున్నాడు. వ్యాపారం ముగించుకుని పెనుగుదురు మసీదులో నమాజ్ చేసుకోవడానికి ద్విచక్ర వాహనంపై బయలుదేరగా కాకినాడ నుంచి రామచంద్రపురం వైపు వెళ్తున్న గుర్తుతెలియని కారు వేగంగా వచ్చి రామ్‌తుల్లాను బలంగా ఢీకొట్టి ఆగకుండా వెళ్లిపోయింది. తన చికెన్‌షాపు సమీపంలోనే జరిగిన ఈ ప్రమాదంలో రామ్‌తుల్లా తలకు బలమైన గాయమై తీవ్ర రక్తస్రావం జరిగింది. క్షతగాత్రుడిని కు టుంబ సభ్యులు కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. నవ్వుతూ, అందరితో కలుపుగోలుతనంగా ఉండే రామ్ తుల్లా కళ్ల ముందే రోడ్డు ప్రమాదంలో మృతిచెందడంతో సహచర వ్యాపారులు షాక్‌కు గురయ్యారు. కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కాకినాడ ప్రభుత్వాసుపత్రికి చేర్చినట్టు కరప ఎస్‌ఐ తుపాటి రామకృష్ణ తెలిపారు. ప్రమాదానికి కారణమైన కారును గుర్తించామని, నిందితుడిని అదుపులోకి తీసుకుని తదుపరి విచారణ చేపడతామని వివరించారు.
Updated Date - Jan 20 , 2024 | 10:04 AM