పెరుగుతున్న భూకంపాల తీవ్రత
ABN, Publish Date - Dec 05 , 2024 | 03:35 AM
భూకంపం అంటే చాలు వెన్నులో వణుకు పుడుతుంది..! తెలంగాణలోని ములుగు జిల్లా మేడారం అడవుల్లో బుధవారం సంభవించిన భూకంపం కూడా తెలుగు రాష్ట్రాలను వణికించింది.
తెలుగు రాష్ట్రాలు సేఫ్ జోన్‌లోనే.. అయినా అప్రమత్తత అవసరం
గోదావరి పరీవాహక ప్రాంతాల్లో ఫాల్ట్ జోన్లు
భారీ కట్టడాలు నిర్మించే ముందు అధ్యయనం అవసరం
విశాఖ సురక్షితమే... భూ భౌతిక శాస్త్ర నిపుణులు
(విశాఖపట్నం - ఆంధ్రజ్యోతి)
భూకంపం అంటే చాలు వెన్నులో వణుకు పుడుతుంది..! తెలంగాణలోని ములుగు జిల్లా మేడారం అడవుల్లో బుధవారం సంభవించిన భూకంపం కూడా తెలుగు రాష్ట్రాలను వణికించింది. దీని ప్రభావంతో పలుచోట్ల ప్రకంపనలు సంభవించాయి. భూకంప తీవ్రత రిక్డర్ స్కేలుపై 5.3గా నమోదైంది. అయితే భూమికి 40 కి.మీ. లోపల ప్రకంపనలు రావడంతో భారీ ముప్పు తప్పింది. గతంలో మహారాష్ట్రలోని లాతూరులో పది కిలోమీటర్ల లోపల భూకంపం రావడంతో ఆ ప్రాంతం భారీ నష్టాన్ని చవిచూసింది. భూకంపం రిక్టర్ స్కేలుపై 6 వరకూ నమోదైతే ఇబ్బంది (భూమి లోపల దూరాన్ని బట్టి కూడా పరిగణనలోకి తీసుకోవాలి) ఉండదు.. కానీ, అంతకు మించితే తీవ్ర ప్రాణ, ఆస్తి నష్టం సంభవిస్తుంది. దక్షిణాది రాష్ట్రాల్లో చాలావరకూ భూకంపాల తీవ్రత తక్కువగానే ఉంటుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో గోదావరి పరీవాహక ప్రాంతంతోపాటు ప్రకాశం జిల్లాలో గుండ్లకమ్మ నది, విజయనగరం జిల్లాలో చంపావతి పరీవాహక ప్రాంతాల్లో కొన్నిచోట్ల తప్ప మిగిలిన ప్రాంతం సురక్షితమేనని భూభౌతికశాస్త్ర నిపుణులు విశ్లేషిస్తున్నారు. విశాఖ నగరం కూడా సురక్షితమేనని చెబుతున్నారు.
గోదావరి నది పుట్టిన ప్రాంతం అంటే నాసిక్ నుంచి సముద్రంలో కలిసే అంతర్వేది వరకూ కొన్నిచోట్ల ఫాల్ట్ జోన్లు ఉన్నాయి. ఎప్పుడో 55 ఏళ్ల క్రితం అంటే.. 1969లో భద్రాచలంలో సంభవించిన భూకంపం రిక్టర్ స్కేలుపై 5.7గా నమోదైంది. ఆ తర్వాత మళ్లీ ఇన్నేళ్లకు బుధవారం ములుగు ప్రాంతంలో వచ్చిన భూకంపం రిక్టర్ స్కేలుపై 5.3గా నమోదైంది. సాధారణంగా భూకంపాలు ప్రభావితం చేసే ప్రాంతాలను సెస్మిక్ జోన్లుగా విభజించారు. దక్షిణాది రాష్ట్రాలు (సౌత్ ఇండియా షీల్డ్) జోన్ 1, 2లో ఉన్నాయి. జోన్-4, 5లో ఉంటే తీవ్రత ఎక్కువ. అయితే ప్రపంచవ్యాప్తంగా మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో జోన్-1ను పూర్తిగా తొలగించారు. అంటే ఇప్పుడు మనం జోన్-2లో ఉన్నాం. ఇది సురక్షితమే అయినప్పటికీ.. నిర్లక్ష్యం పనికిరాదని భూభౌతిక శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. గోదావరి పరీవాహక ప్రాంతంలో గతంతో పోల్చితే గనులు, బొగ్గు తవ్వకాలు, డ్యామ్‌లు, రిజర్వాయర్లు, భారీ భవంతులు, వంతెనలు భారీగా పెరిగాయని, అందువల్ల ఈ ప్రాంతాల్లో భారీ కట్టడాలు, రిజర్వాయర్లు నిర్మించే ముందు అధ్యయనం చేయాల్సి ఉందని నిపుణులు పేర్కొంటున్నారు.
ఫాల్ట్ జోన్‌లో గోదావరి పరీవాహక ప్రాంతం: కేఎస్‌ఆర్ మూర్తి
గోదావరి పరీవాహకంలో పలు ప్రాంతాలు ఫాల్ట్ జోన్‌లో ఉన్నాయని జాతీయ సముద్ర విజ్ఞాన అధ్యయన సంస్థ విశ్రాంత శాస్త్రవేత్త డాక్టర్ కేఎస్‌ఆర్ మూర్తి చెప్పారు. ‘ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు జోన్-2లో ఉన్నప్పటికీ గోదావరీ పరీవాహక ప్రాంతంతోపాటు భారీ నిర్మాణాలు జరిగే ప్రాంతాలపై అధ్యయనం అవసరం. హిమాలయాల ఒత్తిడి వల్ల దక్షిణ భారతంలో కొన్ని ప్రాంతాలు బలహీనంగానే ఉన్నాయి’ అని మూర్తి వెల్లడించారు.
జోన్-2లో విశాఖపట్నం: త్రినాథరావు
విశాఖపట్నం సెస్మిక్ జోన్-2లో ఉందని ఆంధ్రా యూనివర్సిటీ భూభౌతికశాస్త్ర విభాగం అనుబంధ ప్రొఫెసర్ ఆచార్య పెంటకోట త్రినాథ రావు చెప్పారు. ‘బుధవారం భూకంపం వచ్చిన ములుగు ప్రాంతం విశాఖపట్నానికి 250 కి.మీ. దూరంలో ఉంది. విశాఖ ప్రాంతంలో ప్రకంపనాలు స్వల్పంగా ఉన్నాయి. విశాఖ జోన్-2లో ఉన్నందున ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు’ అని త్రినాథరావు పేర్కొన్నారు.
Updated Date - Dec 05 , 2024 | 03:43 AM