అబద్ధాల్లో జగన్‌కు ఆస్కార్!
ABN, Publish Date - Nov 02 , 2024 | 04:10 AM
అబద్ధాలు చెప్పడంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డికి ఆస్కార్ అవార్డు ఇవ్వొచ్చని జల వనరుల మంత్రి నిమ్మల రామానాయుడు ఎద్దేవాచేశారు.
రివర్స్ పేరుతో 15 నెలలు జాప్యం వల్లే డయాఫ్రం వాల్ ధ్వంసం: నిమ్మల
అమరావతి, నవంబరు 1 (ఆంధ్రజ్యోతి): అబద్ధాలు చెప్పడంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డికి ఆస్కార్ అవార్డు ఇవ్వొచ్చని జల వనరుల మంత్రి నిమ్మల రామానాయుడు ఎద్దేవాచేశారు. పోలవరం ప్రాజెక్టు ఎత్తుపై ప్రభుత్వం వాస్తవాలు చెబుతుంటే.. ఆయన మాత్రం పదే పదే అసత్యాలనే వల్లె వేస్తున్నారని ‘ఎక్స్’లో మండిపడ్డారు. ‘కన్నతల్లిని, తోడబుట్టిన చెల్లిని మోసం చేసిన జగన్ వారి ఛీత్కారానికి గురయ్యారు. ప్రజా జీవనంలో ఉండేందుకు తనకు అర్హతలేదని ఆయనకు అర్థమైపోయింది. అందుకే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. పోలవరం ఎత్తుపై తన రోత మీడియాలో అబద్ధాలు అచ్చువేసి గడచిన రెండు రోజులుగా దుష్ప్రచారం చేస్తున్నారు’ అని విమర్శించారు. ‘రివర్స్ టెండరింగ్ పేరుతో పనులు 15 నెలలు ఆలస్యం చేసి డయాఫ్రం వాల్ విధ్వంసానికి జగన్ కారకుడయ్యారు. పోలవరానికి కేంద్రం ఇచ్చిన రూ.3,800 కోట్ల నిధులను దారి మళ్లించారు. ప్రాజెక్టు ఎత్తు తగ్గించడానికి ఆయన రెండు దశలంటూ విభజించలేదా? 41.15 మీటర్ల ఎత్తుకు తగ్గించాలని కేంద్రానికి లేఖ రాయలేదా? మా ప్రభుత్వం ఈ ప్రాజెక్టును 45.72 మీటర్ల ఎత్తులో నిర్మించి గరిష్ఠ స్థాయిలో 196.40 టీఎంసీల నీటిని నిల్వ చేసి.. రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేస్తుంది’ అని హామీ ఇచ్చారు.
Updated Date - Nov 02 , 2024 | 04:10 AM