చిత్తూరు టీడీపీలో ఐక్యతారాగం
ABN, Publish Date - Jan 18 , 2024 | 12:45 AM
ఎవరికి టికెట్ వచ్చినా కలిసి పనిచేసేలా ప్రణాళికలు ఆశావహులతో సమావేశమైన మాజీ ఎమ్మెల్సీ దొరబాబు 21 నుంచి కలిసికట్టుగా ఇంటింటికి టీడీపీ
చిత్తూరు, జనవరి 17 (ఆంధ్రజ్యోతి): జిల్లా కేంద్రమైన చిత్తూరు అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రత్యేక వ్యూహంతో ముందడుగు వేయాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించుకుంది. వైసీపీ నుంచి విజయానందరెడ్డిని ప్రకటించిన నేపథ్యంలో టీడీపీ అభ్యర్థి ఎంపిక నిర్ణయం పూర్తిగా అధినేతకే వదిలేయాలని అనుకుంటున్నారు. సంక్రాంతి పండుగకు నారావారిపల్లెకు వచ్చిన చంద్రబాబును కలిసిన నియోజకవర్గ సమన్వయకర్త దొరబాబు ఇక్కడి పరిస్థితులను వివరించారు. అభ్యర్థి ఎంపిక విషయంలో తొందరపడరాదని, ఇంకొంత సమయం తీసుకుంటామని, ఈలోగా అందరూ కలిసి పనిచేసి టీడీపీ బలం ఏమిటో చూపించాలని ఆయన దిశానిర్దేశం చేసినట్లు తెలిసింది. ఇందులో భాగంగానే బుధవారం చిత్తూరు టికెట్ ఆశిస్తున్న ఆరుగురిలో నలుగురితో దొరబాబు సమావేశం అయ్యారు. టికెట్ ఎవరికి ప్రకటించినా అందరూ ఐక్యంగానే ఉండి పార్టీ విజయానికి పనిచేయాలని నిర్ణయించుకున్నారు.
ఆరుగురు ఆశావహులు వీళ్లే
చిత్తూరు టీడీపీ టికెట్ ఆశిస్తున్న ఆరుగురు ఆశావహుల్లోని నలుగురితో బుధవారం దొరబాబు పార్టీ కార్యాలయంలో సమావేశమయ్యారు. డీఏ శ్రీనివాస్ తరఫున ఆయన చిన్నాన్న డీకే బద్రినారాయణ హాజరయ్యారు. బుధవారం నాటి మీటింగ్‌కు రాలేకపోయిన చంద్రప్రకా్‌షతో దొరబాబు ఫోనులో మాట్లాడారు. మాజీ మేయర్ హేమలత, జీజేఎం ట్రస్టు ఛైర్మన్ గురజాల జగన్మోహన్, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి, తిరుచానూరు మాజీ సర్పంచి సీఆర్ రాజన్, జిల్లా ఉపాధ్యక్షుడు కాజూరు బాలాజీ ఈ సమావేశానికి హాజరయ్యారు.
విడివిడిగా వద్దు
ప్రస్తుతం చిత్తూరు ఆశావహులు కార్యక్రమాలు విడివిడిగా నిర్వహిస్తున్నారు. ఇక నుంచి పార్టీకి సంబంఽధించిన ఏ కార్యక్రమంలోనైనా అందరూ కలిసిపాల్గొనాలని తీర్మానించారు. ఆరుగురిలో ఎవరికి టికెట్ వచ్చినా మిగిలినవారు అలగకుండా ఆ ఒక్కరి విజయం కోసం పనిచేయాలని నిర్ణయించారు. ఇక నుంచి ఎవరూ విడిగా కార్యక్రమాలు నిర్వహించకూడదని, విడిగా జిందాబాద్‌లు కొట్టించుకోవద్దని, విడిగా బ్యానర్లను ఏర్పాటు చేసుకోవద్దని నిర్ణయం తీసుకున్నారు. గురువారం జరగబోయే దివంగత ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమాల నుంచే ఐక్యత చాటాలని తీర్మానించారు. ఈ మేరకు ఆరుగురు ఆశావహులు కలిసి ఈ నెల 21 నుంచి ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. చిత్తూరు నగరంలోని 50 డివిజన్లు, గుడిపాల, చిత్తూరు మండలాల్లోని 44 పంచాయతీల్లో 45 రోజుల్లో ఇంటింటికి టీడీపీ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని నిర్ణయించారు.
మిగిలినవారికి సముచిత స్థానం
ఆరుగురు ఆశావహుల్లో టికెట్ వచ్చిన ఒకరి విజయానికి కృషి చేసిన మిగిలిన ఐదుగురికి టీడీపీ అధికారంలోకి వచ్చాక కచ్చితంగా మంచి పదవులు ఇప్పిస్తామని దొరబాబు సూచించారు. చిత్తూరులో జడ్పీ, చుడా, మార్కెట్ కమిటీ, సెంట్రల్ బ్యాంకు ఛైర్మన్, మేయర్ వంటి పదవులు మిగిలినవారికి దక్కుతాయని వారికి హామీ ఇచ్చారు.
2004లోనూ ఇదే సూత్రం
2004లో జరిగిన సాధారణ ఎన్నికలకు ముందు ఇలాగే ఆశావహులు ఎక్కువైపోయారని, ఆశావహులందర్నీ ఏకతాటిపైకి తెచ్చి సత్ఫలితం సాధించామని చిత్తూరు సమన్వయకర్త దొరబాబు అన్నారు. అప్పట్లో ఏఎస్ మనోహర్, కటారి మోహన్, చంద్రప్రకాష్, రావూరి ఈశ్వరరావు తదితర తొమ్మిది మందితో బృందం ఏర్పడి ప్రజల్లోకి వెళ్లారని, ఈసారి ఆరుగురు వెళ్తున్నామని ఆయన చెప్పుకొచ్చారు. 2004లో ఏఎస్ మనోహర్ గెలిచినట్లు ఈసారి కూడా టీడీపీ అభ్యర్థి గెలుస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
Updated Date - Jan 18 , 2024 | 12:45 AM