ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

SAAP Chairman శాప్‌ ఛైర్మన్‌గా రవినాయుడు

ABN, Publish Date - Sep 25 , 2024 | 01:15 AM

రాష్ట్ర ప్రభుత్వం తొలివిడతగా మంగళవారం ప్రకటించిన నామినేటెడ్‌ పదవుల జాబితాలో తిరుపతి జిల్లా నుంచీ ఆరుగురు టీడీపీ నేతలకు చోటు దక్కింది. తిరుపతికి చెందిన తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనిమిని రవినాయుడు శాప్‌ (ఏపీ స్పోర్ట్స్‌ అథారిటీ) ఛైర్మన్‌గా ఛాన్సు కొట్టేశారు. మిగిలిన ఐదుగురూ వివిధ కార్పొరేషన్లలో మెంబర్లుగా పదవులు దక్కించుకున్నారు.

అనిమిని రవినాయుడు

తిరుపతి, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం తొలివిడతగా మంగళవారం ప్రకటించిన నామినేటెడ్‌ పదవుల జాబితాలో తిరుపతి జిల్లా నుంచీ ఆరుగురు టీడీపీ నేతలకు చోటు దక్కింది. తిరుపతికి చెందిన తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనిమిని రవినాయుడు శాప్‌ (ఏపీ స్పోర్ట్స్‌ అథారిటీ) ఛైర్మన్‌గా ఛాన్సు కొట్టేశారు. మిగిలిన ఐదుగురూ వివిధ కార్పొరేషన్లలో మెంబర్లుగా పదవులు దక్కించుకున్నారు. ఏపీ అర్బన్‌ ఫైనాన్స్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌లో తిరుపతి టీడీపీ నేత ఊకా విజయ్‌కుమార్‌, సత్యవేడు టీడీపీ నేత డాక్టర్‌ పి.చందన స్రవంతి మెంబరు పదవులను పొందారు. సూళ్ళూరుపేట నియోజకవర్గానికి చెందిన టీడీపీ నేత, మాజీ మంత్రి పరసా రత్నం మార్క్‌ఫెడ్‌ మెంబరు పదవి పొందగా నగరి నియోజకవర్గానికి చెందిన టీడీపీ నేత గంజి మాధవయ్య, వెంకటగిరి నియోజకవర్గానికి చెందిన టీడీపీ నేత గంగాధర శ్రీరామదాసు ఏపీ పద్మశాలి వెల్ఫేర్‌ కార్పొరేషన్‌ మెంబర్లుగా పదవులు దక్కించుకున్నారు.


తొలి విడతలో టీడీపీ నేతలకే ఛాన్సు

తొలి విడత నామినేటెడ్‌ పదవుల్లో తిరుపతి జిల్లా నుంచీ కేవలం టీడీపీ నేతలకే అవకాశం దక్కింది. జిల్లాలో ఆరు నియోజకవర్గాలుండగా మొదటి దఫా చేపట్టిన పదవుల భర్తీలో తిరుపతి, వెంకటగిరి, సూళ్ళూరుపేట, సత్యవేడు నియోజకవర్గాలతో పాటు నగరి పాక్షిక నియోజకవర్గ నేతలకు అధిష్ఠానం గుర్తింపు కల్పించింది. ఈ దఫా శ్రీకాళహస్తి, గూడూరు, చంద్రగిరి నియోజకవర్గాల నేతలెవరికీ అవకాశం రాలేదు. కాగా ప్రభుత్వం ప్రకటించిన తాజా పదవుల జాబితాలో జిల్లా నుంచీ టీడీపీ మినహా కూటమిలోని ఇతర మిత్రపక్షాలైన జనసేన, బీజేపీ నేతలకు అవకాశం రాలేదు. తొలి జాబితాలో ప్రకటించింది కేవలం 20 కార్పొరేషన్లు మాత్రమే కావడం, ఇంకా భర్తీ చేయాల్సిన పదవులు బోలెడు వుండడంతో మలి విడతలో ఆ పార్టీల నేతలకు అవకాశం దక్కుతుందని భావిస్తున్నారు.


యువ నాయకుడి కష్టానికి గుర్తింపు

తిరుపతికి చెందిన రవినాయుడికి శాప్‌ ఛైర్మన్‌ దక్కడంతో యువ నాయకుడి కష్టాన్ని అధిష్ఠానం గుర్తించినట్టయింది. సామాన్య కార్యకర్తగా పార్టీతో ప్రయాణం మొదలుపెట్టి అంచెలంచెలుగా రాష్ట్రస్థాయికి ఎదగడంతోపాటు పార్టీ భావినేత నారా లోకేశ్‌ వెంట నిలవడం ఇతడికి ప్రత్యేక గుర్తింపునిచ్చింది. 2005లో ఓరియంటల్‌ కాలేజీ స్టూడెంట్స్‌ యూనియన్‌ ఛైర్మన్‌గా విద్యార్థి రాజకీయాల్లో అడుగుపెట్టిన రవినాయుడు తర్వాత టీఎన్‌ఎ్‌సఎ్‌ఫలో చేరి చంద్రగిరి నియోజకవర్గ అధ్యక్షుడిగా, ఎస్వీయూ ప్రధాన కార్యదర్శిగా, రెండుసార్లు అధ్యక్షుడిగా, ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షుడిగా, జాతీయ కమిటీ సమన్వయకర్తగా పనిచేశారు. 2020లో తిరుపతి తెలుగుయువత పార్లమెంటు అధ్యక్షుడిగా నియమితులైన ఆయన 2021లో రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగానూ, రాష్ట్ర కార్యక్రమాల సమన్వయకర్తగానూ నియమితులయ్యారు. యువనేత నారా లోకేశ్‌ చేపట్టిన యువగళం పాదయాత్ర మొదటి దశలో వలంటీర్ల కో ఆర్డినేటర్‌గానూ, రెండవ దశలో యాత్ర కో ఆర్డినేటర్‌గానూ పనిచేయడం రవినాయుడిని లోకేశ్‌ టీమ్‌ మెంబరును చేసింది. అధినేత చంద్రబాబు అక్రమ కేసులో అరెస్టయిన సందర్భంగా ఆయన సతీమణి నారా భువనేశ్వరి నిజం గెలవాలి పేరిట చేపట్టిన యాత్రకు కూడా రవినాయుడు కో ఆర్డినేటర్‌గా వ్యవహరించారు. ఈ కార్యక్రమాలతో అధినేత కుటుంబానికి చేరువయ్యారు. గత ఐదేళ్ళ వైసీపీ ప్రభుత్వంలో హత్యాయత్నం, ఎస్సీ అట్రాసిటీ తదితర కేసులతో సహా మొత్తం 57 కేసులు నమోదైనా, ఆ కేసుల్లో అర్ధరాత్రిళ్ళు అరెస్టయినా, ఎన్నో సార్లు గృహ నిర్బంధాలకు లోనైనా వెరవకుండా పార్టీ కోసం కష్టపడి పనిచేయడాన్ని పార్టీ అధిష్ఠానం గుర్తించింది. ఈ నేపధ్యంలో శాప్‌ ఛైర్మన్‌ వంటి రాష్ట్రస్థాయి పదవి దక్కడం పార్టీ శ్రేణులకు కూడా సానుకూల సంకేతాన్ని, సందేశాన్ని ఇచ్చినట్టయింది.


చిత్తూరు జిల్లాకు ఏదీ సముచిత స్థానం..?

ఒక్కరికీ దక్కని కార్పొరేషన్‌ ఛైర్మన్‌ పదవి

చిత్తూరు, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి): చిత్తూరు జిల్లాకు నామినేటెడ్‌ పదవుల్లోనూ తొలివిడతలో సముచిత స్థానం దక్కలేదు.20 కార్పొరేషన్లకు ఛైర్మన్‌ పదవుల్ని భర్తీ చేయగా.. జిల్లాకు ఒక్కటీ కేటాయించలేదు.ఆర్టీసీ వైస్‌ ఛైర్మన్‌గా కుప్పం నియోజకవర్గ టీడీపీ ఇన్‌ఛార్జి పీఎస్‌ మునిరత్నం,టూరిజం డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌ డైరెక్టర్‌గా చిత్తూరు మాజీ మేయర్‌ కటారి హేమలతకు మాత్రమే అవకాశం దక్కింది.నగరి నియోజకవర్గంలోని పుత్తూరు మాజీ ఎంపీపీ గంజి మాధవయ్యకు పద్మశాలి సంక్షేమ, అభివృద్ధి కార్పొరేషన్‌ డైరెక్టర్‌గా అవకాశం లభించింది. ఈయన ఎమ్మెల్యే భానుప్రకాష్‌ ప్రకాష్‌ వెన్నంటే ఉంటూ ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం కష్టపడ్డారు. దీంతో పార్టీ గుర్తించి పదవి ఇచ్చింది.


పీఎస్‌ మునిరత్నానికి గౌరవం

కుప్పం నియోజకవర్గ టీడీపీ ఇన్‌ఛార్జి పీఎస్‌ మునిరత్నం ఆవిర్భావం నుంచీ పార్టీలో ఉన్నారు. చంద్రబాబుతో కలిసి ఎస్వీయూలో చదువుకోవడంతో పాటు ఆయన కుప్పంలో పోటీ చేస్తున్నప్పటి నుంచి వెంటే నడుస్తున్నారు. గతంలో రెస్కో ఛైర్మన్‌గా పనిచేశారు. ఆయన సీనియారిటీని గుర్తించి ఆర్టీసీ వైస్‌ ఛైర్మన్‌గా అవకాశం కల్పించారు.అయితే కుప్పంలో సీనియర్‌ నాయకుల్ని గౌరవించడంతో పాటు కొత్తవారికి కూడా అవకాశం కల్పించాలని అక్కడి టీడీపీ శ్రేణులు కోరుతున్నాయి. కుప్పం మున్సిపల్‌ ఎన్నికల్లో టీడీపీ ఓటమి చెందినప్పుడు.. సమీక్ష నిర్వహించిన చంద్రబాబు ఇక కొత్తవారిని ప్రోత్సహిస్తానని హామీనిచ్చారు. దీంతో నామినేటెడ్‌ పదవులపై కొత్తతరం నాయకులు ఆశలు పెట్టుకున్నారు. వచ్చే జాబితాలో అయినా తమ పేర్లుంటాయని ఆశిస్తున్నారు.


డైరెక్టర్‌ పోస్టుకు హేమలత పరిమితం

చిత్తూరు మాజీ మేయర్‌ కటారి హేమలత అత్తామామలు కటారి అనురాఽధ, మోహన్‌ 2016లో హత్యకు గురయ్యారు. అత్త మేయర్‌ పోస్టులో ఆమె పనిచేశారు. తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. భర్త ప్రవీణ్‌ కరోనా సమయంలో మరణించి ఈమెను ఒంటరిగా మార్చారు. గత ఐదేళ్లలో వైసీపీ వేధింపుల్ని దీటుగా ఎదుర్కొని టీడీపీ కోసం శ్రమించారు. శ్రేణుల్ని కాపాడుకున్నారు. ఎమ్మెల్యే టికెట్‌ ఆశావహుల్లో ఈమె కూడా ఒకరిగా నిలిచారు.ఈమెకు ఏదైనా పెద్ద పదవే లభిస్తుందని అనుకుంటుండగా టూరిజం డైరెక్టర్‌ పోస్టుకు పరిమితం చేశారు.

Updated Date - Sep 25 , 2024 | 01:15 AM