పార్వతీదేవిగా బోయకొండ గంగమ్మ
ABN, Publish Date - Oct 08 , 2024 | 01:17 AM
బోయకొండలో గంగమ్మ దసరా మహోత్సవం
చౌడేపల్లె, ఆక్టోబరు 7: ప్రముఖ పుణ్యక్షేత్రమైన బోయకొండ గంగమ్మ దసరా మహోత్సవంలో భాగంగా నాల్గవ రోజున అమ్మవారు పార్వతీదేవిగా భక్తులకు దర్శనం ఇచ్చారు. సోమవారం అర్చకులు ఆలయాన్ని శుద్ధి చేసి, మూలవిరాట్‌కు పంచామృతాభిషేకాలు నిర్వహించారు. రెండు చేతుల్లో కమలాలు, మరో చేతిలో శివలింగం, ఇంకో చేయి అభయ హస్తంగా అమ్మవారిని చతుర్భుజాలతో అలంకరించారు. యాగశాలలో ఉత్సవమూర్తిని అలంకరించి, కలశ స్థాపన చేశాక పార్వతీదేవి విశిష్టతను వివరించారు. మహా గణపతి, ఆదిత్యాది నవగ్రహ, దుర్గ చండీ, మృత్యుంజయేశ్వర, రుద్ర, మహాలక్ష్మీ హోమాలు ఉభయదారులతో నిర్వహింపచేశారు. అనంతరం వారికి అమ్మవారి శేషవస్త్రాలు, తీర్థప్రసాదాలను ఈవో ఏకాంబరం అందజేశారు. ఉభయదారులుగా బెంగళూరుకు చెందిన గుణనేత్ర, గురుప్రసాద్, పలమనేరు సునీత, మునిరాజ, బోయకొండకు చెందిన సుభద్రమ్మ, వెంకటరెడ్డి, జీఆర్‌ఎస్ రమణ కుటుంబీకులు, సోమల సుజాత, రెడ్డెప్ప, పుంగనూరుకు చెందిన ఇండియన్ బ్యాంకు మేనేజర్ దేవేంద్ర, కుసుమకుమారి, పెద్దజంజాణికి చెందిన నాగలక్ష్మి, వెంకటరమణ, మాదంపల్లెకు చెందిన రత్నమ్మ, వెంకటరమణ, తిరుపతికి చెందిన రాధిక, అంజప్ప వ్యవహరించారు.
Updated Date - Oct 08 , 2024 | 01:17 AM