‘ఉపాధి’ అవినీతిలో రికవరీ నిల్
ABN, Publish Date - Nov 25 , 2024 | 04:17 AM
ఉపాధి హామీ పథకంలో సోషల్ ఆడిట్ విభాగం తనిఖీల తర్వాత గుర్తించిన అవకతవకలపై విజిలెన్స్ విభాగం సరిగా స్పందించలేదని కాగ్ తప్పుపట్టింది. 2021-22లో ఉపాధి పథకంలో రూ.232 కోట్ల మేర తేడాలొచ్చినట్టు తేలింది.
2021-22లో అవకతవకలకు సంబంధించి ఒక్క పైసా కూడా వెనక్కి రాని వైనం
పట్టణాల్లో ఘన వ్యర్థాల నిర్వహణ నిర్వీర్యం
పేరుకుపోయిన 85 లక్షల టన్నుల చెత్త
స్థానిక సంస్థలకు సంబంధించి కాగ్ నివేదిక వెల్లడి
అమరావతి, నవంబరు 24 (ఆంధ్రజ్యోతి): ఉపాధి హామీ పథకంలో సోషల్ ఆడిట్ విభాగం తనిఖీల తర్వాత గుర్తించిన అవకతవకలపై విజిలెన్స్ విభాగం సరిగా స్పందించలేదని కాగ్ తప్పుపట్టింది. 2021-22లో ఉపాధి పథకంలో రూ.232 కోట్ల మేర తేడాలొచ్చినట్టు తేలింది. మండల సోషల్ ఆడిట్ పబ్లిక్ హియరింగ్‌లో కూడా రూ.89 కోట్లు అవినీతిపరుల జేబుల్లోకి వెళ్లాయని నిర్ధారణ అయింది. అయితే 2023 ఆగస్టు వరకు ఒక్క పైసా కూడా రికవరీ చేయలేదని అధికారులు పేర్కొన్నట్లు స్థానిక సంస్థలకు సంబంధించి కాగ్ ఆడిట్ నివేదికలో వెల్లడించింది. దీంతో గత వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్రంలో ఉపాధి హామీ పథకంలో అవినీతి నియంత్రణ చేయాల్సిన సంస్థలు ఎలా నిర్వీర్యం అయ్యాయో కాగ్ నివేదికతో వెల్లడైంది. మరోవైపు పట్టణాల్లో ఘన వ్యర్థాల నిర్వహణపై 2018లో రాష్ట్ర విధానం రూపొందించారు. మొత్తం 17 పట్టణ స్థానిక సంస్థలను పరిశీలిస్తే, 2022 డిసెంబరు నాటికి అందులో కేవలం ఐదింటికి మాత్రమే విధివిధానాలు రూపొందించారని కాగ్ పేర్కొంది. ఐదు పట్టణాల్లో మాత్రమే ఘన వ్యర్థాల నిర్వహణ యూనిట్లు కాలుష్య నియంత్రణ మండలి అనుమతి పొందాయని తెలిపింది. ఘన వ్యర్థాల నిర్వహణ యూనిట్‌ల కార్యకలాపాల కోసం 2022 నవంబరు వరకు రాష్ట్ర వాటా కింద రూ.42.53 కోట్లను ఆయా పట్టణ స్థానిక సంస్థలకు విడుదల చేయలేదు.
చెత్తను వేరు చేయడంలో లోపించిన చిత్తశుద్ధి
పట్టణాల్లో కాగ్ ఆడిట్ తనిఖీ చేసిన చోట నూరు శాతం వ్యర్థాలను వేరు చేయాల్సి ఉంటే, కేవలం 75 శాతం మాత్రమే జరిగిందని తేలింది. ఇళ్లల్లో ఉన్న చెత్తను వేరు చేయడంలో రాజమహేంద్రవరం, విజయవాడ కార్పొరేషన్లలో తప్ప మిగతా తనిఖీ చేసిన పట్టణాల్లో జరగలేదని పేర్కొంది. చాలా చోట్ల వేరుచేసిన చెత్తను సైతం రవాణా చేసే క్రమంలో కలిపి తరలించారని స్పష్టం చేసింది. జంగారెడ్డిగూడెం, భీమవరంలో నిబంధనలకు విరుద్ధంగా డంపింగ్ వ్యర్థాలను నీటి వనరులకు దగ్గరలో ఏర్పాటు చేశారని తెలిపింది. ఒంగోలు, తెనాలి మున్సిపాలిటీల్లో బహిరంగ ప్రదేశాల్లో చెత్తను తగులబెట్టడాన్ని కాగ్ గమనించింది. 85.89 లక్షల టన్నుల చెత్తను తరలించే పనులు ఇంకా ప్రారంభం కాలేదని కాగ్ పేర్కొంది. రూ.30 లక్షలు పెట్టి చెత్తను వేరు చేసే మెషిన్‌ను రాజమహేంద్రవరం పట్టణ స్థానిక సంస్థ కొనుగోలు చేసినప్పటికీ, దానిని ఉపయోగించకపోవడంతో నిర్వీర్యమైపోయింది. ఎయిర్‌పోర్టులకు 20 కి.మీ దూరంలో మాత్రమే డంపింగ్ యార్డులు ఉండాలని ఘన వ్యర్థాల నిర్వహణ పాలసీ పేర్కొంటోందని, అయితే రాజమహేంద్రవరం, పుట్టపర్తిలలో డంపింగ్ యార్డ్‌లు 11.9, 10 కి.మీలు దూరంలో మాత్రమే ఉన్నాయని, ఆయా స్థానిక సంస్థలు సివిల్ ఏవియేషన్ అథారిటీ నుంచి ఎన్‌ఓసీ కూడా తీసుకోలేదని కాగ్ పేర్కొంది. డంపింగ్ యార్డులన్నింటినీ ఉపయోగంలోకి తీసుకొచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, ఘన వ్యర్థాల నిర్వహణ తనిఖీలు తరచూ నిర్వహించాలని సూచించింది.
లేని జీఎస్‌టీ వసూలు చేసిన ఆప్కోస్
చెత్తరహిత పట్టణాలకు సంబంధించి ‘7 స్టార్స్’ పొందిన పట్టణం ఒక్కటి కూడా లేదని, మొత్తం 123 పట్టణ స్థానికసంస్థల్లో కేవలం ఏడు మాత్రమే స్టార్ సర్టిఫికేషన్ పొందాయని తెలిపింది. చెత్త పన్ను వసూళ్లు కూడా అన్ని పట్టణ స్థానిక సంస్థల్లో ఒకే మాదిరిగా లేవని పేర్కొంది. విజయవాడ కార్పొరేషన్ తప్ప ఎక్కడా వెబ్‌సైట్‌లో పూర్తి సమాచారం లేదని తెలిపింది. రాష్ట్రస్థాయి సలహా బోర్డు మార్చి 2022 నాటికి తొమ్మిది సమావేశాలు నిర్వహించాల్సి ఉంటే ఒక్క సమావేశం మాత్రమే నిర్వహించింది. భవన నిర్మాణ అనుమతులు మంజూరు చేసే విషయంలో 9 పట్టణ స్థానిక సంస్థల్లో నిబంధనలను తుంగలో తొక్కి రూ.8.26 కోట్లు తక్కువ చేసి అనుమతులిచ్చారని కాగ్ నివేదికలో పేర్కొంది. రాష్ట్రంలో 14 పట్టణ స్థానిక సంస్థలు, ఏపీ గ్రీన్ అండ్ బ్యూటిఫికేషన్ సంస్థలు స్వచ్ఛ సేవల కింద తమ పరిధిలో పనిచేసే ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు జీఎ్‌సటీ చెల్లించాల్సిన అవసరం లేకపోయినా ఔట్‌సోర్సింగ్ కార్పొరేషన్(ఆప్కో్‌స)కు 18 శాతం జీఎ్‌సటీ(రూ.37.21 కోట్లు) చెల్లించాయి.
Updated Date - Nov 25 , 2024 | 04:17 AM