తెనగల్లులో పేలిన గ్యాస్ సిలిండర్
ABN, Publish Date - Jan 29 , 2024 | 11:41 PM
మండలంలోని తెనగల్లు గ్రామంలోని ఓ ఇంటిలో సోమవారం సిలిండర్ పేలిన ఘటనలో ఇల్లు నేలమట్టమయ్యింది. ఈ సంఘటనలో ఆరుగురు గాయపడగా, వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.
ఫ ఆరుగురికి గాయాలు... ఇల్లు నేలమట్టం
ఫ రూ. పది లక్షలకు పైగా ఆస్తి నష్టంకుందుర్పి, జనవరి 29: మండలంలోని తెనగల్లు గ్రామంలోని ఓ ఇంటిలో సోమవారం సిలిండర్ పేలిన ఘటనలో ఇల్లు నేలమట్టమయ్యింది. ఈ సంఘటనలో ఆరుగురు గాయపడగా, వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి... తెనగల్లు గ్రామంలోని షేక్ ముస్తాబ్ ఇంట్లో రెండు గ్యాస్ సిలిండర్లను ఉంచాడు. రాత్రంగా ఒక సిలిండర్ లీక్ అవుతుండగా, ఉదయం కరెంటు బల్బును ముస్తాబ్ ఆన్ చేశాడు. వెంటనే పొగలు వ్యాపించడంతో బయటకు కేకలు పెడుతూ వచ్చాడు. చుట్టుపక్కల వారు సంఘటనా స్థలానికి చేరుకుని ఇంట్లో ఉన్న మరో సిలిండర్‌ను బయటకు తీసుకువచ్చారు. ఈ సమయంలో మరో సిలిండర్ పెద్దశబ్దంతో పేలింది. వెంటనే మంటలు వ్యాపించాయి. ఈ ఘటనలో బాధితుడికి సహాయం చేయడానికి వచ్చిన ఆరుగురు గాయపడ్డారు. వారిని 108లో కళ్యాణదుర్గం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో సిద్దేశ్వర, చౌడప్పలను అనంతపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. భీమరాజు, నారాయణస్వామి, రామాంజనేయులు, మారుతిలకు స్వల్ప గాయాలు కాగా కళ్యాణదుర్గం ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. సంఘటనా స్థలానికి అడిషనల్ ఎస్పీ రామిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి, డీఎస్పీ శ్రీనివాసులు, ఏఈ నాగరాజు, ఎస్‌ఐ వెంకటస్వామి చేరుకుని స్థలాన్ని పరిశీలించి గ్యాస్ పేలేందుకు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. బాధితుడు ముస్తాబ్ చిల్లర దుకాణం నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. ఈ ఘటనలో రూ.10 లక్షల వరకు ఆస్తి నష్టం సంభవించిందని బాధితుడు తెలిపాడు. ఫైరింజన్ సమయానికి చేరుకోవడంతో సిబ్బంది మంటలను ఆర్పారు. రెస్క్యూటీమ్ ఎక్స్‌కవేటర్ సహాయంతో రోడ్డుపై పడివున్న రాళ్లను తొలగించారు. అనంతరం పేలిన గ్యాస్ సిలిండర్‌ను పరిశీలించారు. తమను ప్రభుత్వమే ఆదుకోవాలని బాధితుడు కోరుతున్నాడు.
Updated Date - Jan 29 , 2024 | 11:41 PM