సందేహాల గణన..!
ABN, Publish Date - Jan 29 , 2024 | 12:34 AM
జిల్లాలో కుల గణన సర్వే గందరగోళంగా సాగుతోంది. పేరుకు కులగణనే అయినా.. అందులో ఆస్తిపాస్తులు, వ్యక్తిగత వివరాలపై ప్రశ్నలు ఉండటంతో జనంలో అనుమానాలు తలెత్తుతున్నాయి. ఈ నెల 19 నుంచి జిల్లాలో కులగణన జరుగుతోంది. క్షే త్ర స్థాయిలో 28వ తేదీకల్లా పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. అనంతరం సచివాలయ పరిధిలో మరో ఐదు రోజులపాటు సర్వే ప్రక్రియ కొనసాగుతుంది.
కులమే కాదు.. ఆస్తిపాస్తుల వివరాల సేకరణ
వ్యక్తిగత వివరాలపైనా అనేక ప్రశ్నలు
చెప్పేందుకు జంకుతున్న సామాన్యులు
సర్వర్ సమస్యతో వలంటీర్ల తంటాలు
జిల్లాలో కుల గణన సర్వే గందరగోళంగా సాగుతోంది. పేరుకు కులగణనే అయినా.. అందులో ఆస్తిపాస్తులు, వ్యక్తిగత వివరాలపై ప్రశ్నలు ఉండటంతో జనంలో అనుమానాలు తలెత్తుతున్నాయి. ఈ నెల 19 నుంచి జిల్లాలో కులగణన జరుగుతోంది. క్షే త్ర స్థాయిలో 28వ తేదీకల్లా పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. అనంతరం సచివాలయ పరిధిలో మరో ఐదు రోజులపాటు సర్వే ప్రక్రియ కొనసాగుతుంది. క్షేత్రస్థాయిలో ఈ పనిని వలంటీర్లు, సచివాలయ సిబ్బందికి అప్పగించారు. ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు చేయాల్సిన ఈ పనిలో వలంటీర్లను భాగస్వాములను చేయడం గమనార్హం. ఎన్నికలు సమీపిస్తున్న వేళ, అదీ కూడా తక్కువ వ్యవధిలో హడావుడిగా కులగణన సర్వే చేయాల్సిన అవసరం ఏమిటన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఇది ఒక ఎత్తయితే, సర్వేలో కులాలతో సంబంధం లేని ప్రశ్నలు వేస్తున్నారని జనం అంటున్నారు. కళ్యాణదుర్గం నియోజక వర్గవ్యాప్తంగా రెండు లక్షలకు పైగా ఓటర్లు ఉన్నారు. నిబంధనల ప్రకారం ఒక్కో సచివాలయ పరిధిలో 20 మంది వలంటీర్లు ఉండాలి. ప్రస్తుతం 13 నుంచి 15 మందిలోపే ఉన్నారు. ఒక్కో వలంటీరు 90 కుటుంబాలను సర్వే చేయాల్సి ఉంది. సర్వర్ సమస్యతో సర్వేలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. సర్వర్ సమస్య పట్టిపీడిస్తుండటంతో ఎక్కడా పూర్తిస్థాయిలో జరగడం లేదు. దీంతో ఏం చేయాలో దిక్కుతోచక ఉన్నారు. దీంతో ఒకటి, రెండు రోజులు సర్వర్ సమస్యతో అలాగే గడిచిపోయాయి.
-కళ్యాణదుర్గం
మ్యాపింగ్ మాయం
అద్దె ఇళ్లలో నివాసం ఉంటున్నవారు తరచుగా మారుతుంటారు. ఇలాంటి కుటుంబాలు ప్రతి సచివాలయం పరిధిలో 10 నుంచి 15 వరకు ఉంటాయి. వీరు ఉన్నది ఒకచోట కాగా.. మ్యాపింగ్ (వలంటీరు దగ్గర) మరోప్రాంతంలో ఉంటుంది. దీంతో ఎవరు ఎక్కడున్నారో తెలియక వలంటీర్లు ఇబ్బంది పడుతున్నారు. ఇతర ప్రాంతాల్లో ఉన్న వలంటీరు దగ్గర మ్యాపింగ్ చేయించుకుంటే, గతంలో ఉన్న వలంటీర్ లాగినలో ఆ వివరాలు పోతాయి. అద్దె ఇళ్లకు మారినవారు స్థానికంగా లేరు. ఇతర ప్రాంతాల్లో మ్యాపింగ్ కాకపోవడంతో సమస్యలు ఎదురవుతున్నాయి. చాలా కుటుంబాలు సర్వేకు దూరమవుతున్నారు. వారిని వెతికి పట్టుకుని మ్యాపింగ్ చేయించి సర్వే చేయాల్సి ఉంది. ఉన్న కొద్దిరోజుల్లో ఇది సాధ్యమయ్యే పనికాదు. సర్వే సమయంలో కుటుంబాలు అందుబాటులో లేకుంటే ఫిబ్రవరి 2 వరకు మరో తమ పరిధిలోని సచివాలయాలకు వెళ్లి కులగణన సర్వే చేయించుకోవాలని వలంటీర్లు క్షేత్రస్థాయిలో చెబుతున్నారు.
స్థిర, చరాస్తుల వివరాలు చెప్పాలట..
కులగణన యాప్‌లోని సెక్షన-1లో వ్యక్తికి సంబంధించిన ప్రస్తుత జీవన స్థితి, చిరునామా వివరాలు నమోదు చేస్తారు. కుటుంబంలో ఎంతమంది ఉన్నారో, అంతమంది నుంచి అన్ని ప్రశ్నలకు సమాధానాలు నమోదు చేయాల్సిందే. స్థిర, చరాస్తుల వివరాలతో పాటు కోళ్లు, పందులు, మేకలు, గొర్రెలు, పశువుల లెక్క.. ఇలా 18 సమాధానాలు నింపాల్సి వస్తోంది. రేషనకార్డు సంఖ్య, నివాసం ఉంటున్న ఇంటి రకం (పూరి గుడిసె, పెంకుటిల్లు, ఆర్‌సీసీ బిల్డింగ్, డూప్లెక్స్ తదితరాలు), మరుగుదొడ్ల సదుపాయం, తాగునీరు, గ్యాస్ సదుపాయం ఉందా లేదా నమోదు చేస్తున్నారు. ఈ వివరాలు చెప్పడానికి జనం జంకుతున్నారు. సెక్షన-2లో కుటుంబ వివరాలు నమోదవుతాయి. ఇందులో పుట్టిన తేదీ, వివాహ స్థితి, కులం, ఉప కులం, మతం, విద్యార్హత, వృత్తి, పంట భూమి, నివాస భూమి వివరాలు నమోదు చేస్తున్నారు. ఆయా వివరాలను బహిరంగ పరిచేందుకు పలువురు వెనుకాడుతున్నారు.
సతాయిస్తున్న సర్వర్
కులగణన సర్వేలో ఎన్యూమరేటర్లుగా వలంటీర్లు, సూపర్‌వైజర్లుగా సచివాలయ ఉద్యోగులు వ్యవహరిస్తున్నారు. తమ పరిధిలోని ప్రతి ఇంటికి వెళ్లి యాప్‌లో కుటుంబ వివరాలు నమోదు చేయాల్సి ఉంది. వలంటీర్లు తమ సెల్‌ఫోన్లల్లో జీఎ్‌సడబ్ల్యూఎస్ అనే యాప్‌లో వివరాలు నమోదు చేయాలి. ఇంటి యజమాని వేలిముద్ర తీసుకుని, వలంటీరుతో పాటు సచివాలయ ఉద్యోగి బయోమెట్రిక్ వేస్తేనే యాప్ తెరుచుకుంటుంది. సర్వే పూర్తి చేసేందుకు ఒక్కో ఇంటి వద్ద 30 నుంచి 45 నిమిషాలు పడుతోంది. వలంటీరు, కుటుంబ యజమాని, సచివాలయ ఉద్యోగి.. ఈ ముగ్గురూ కలిసి రెండుసార్లు ఈ-కేవైసీ (వేలిముద్రలు) పూర్తివేస్తేనే ఆ కుటుంబ కులగణన పూర్తయినట్లు. ఒక్కో సభ్యుడి వద్ద వివరాలు సేకరించే సమయంలోనే సాంకేతిక సమస్యలు రావడంతో నమోదు చేసిన వివరాలు డిలీట్ అవుతున్నాయి. మళ్లీ మొదటి నుంచి నమోదు చేయాల్సి వస్తోంది. ఎవరికైనా వేలిముద్రలు పడకపోతే ఐరిస్, ఓటీపీ ద్వారా కూడా యాప్ ఓపెన చేయొచ్చు. ఏ ప్రక్రియలోనూ యాప్ తెరుచుకోకపోవడంతో ఇళ్ల వద్ద సిగ్నళ్ల కోసం తంటాలు పడుతున్నారు. ఉదయం 8 నుంచి 10 గంటలలోపు మాత్రమే యాప్ పనిచేస్తోందని, ఆ తర్వాత ఎర్రర్ కోడ్ పదేపదే వస్తోందని అంటున్నారు. ఈ కారణంగా ఉదయం పది గంటల తరువాత సర్వేను చాలాచోట్ల ఆపేస్తున్నారు.
వీరి పరిస్థితి ఏమిటి..?
బీసీ-సీ కింద క్రిస్టియన్లు ఉన్నారు. కులాల విభాగంలో బీసీ-సీ దగ్గర క్రిస్టియన్లు అన్న సమాచారం లేదు. యాప్‌లో క్రిస్టియన అని టైప్ చేసినా తీసుకోవడం లేదు. మతం విభాగం వద్ద హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు, సిక్కులు, జైనులు, ఇతరులు, మతం లేనివారు అని ఉంది. ఉప కులం దగ్గర క్రిస్టియన అన్న ఆప్షన లేదు. ఇదో పెద్ద సమస్యగా మారింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, సంపన్నవర్గాలకు రేషనకార్డులు లేవు. కులగణన సర్వేలో రేషనకార్డు నంబరు నమోదు చేయాల్సి ఉంది. కార్డు లేకపోతే నంబరు ఎలా నమోదు చేయాలో తెలియక వలంటీర్లు తలలు పట్టుకుంటున్నారు. ఏవైనా పొరపాట్లు చేసి ఉంటే వాటిని సవరించుకునేందుకు ఆప్షన లేకపోవడం, ఇంటి విషయంలో పూరిల్లు, గుడిసెలు, ఆర్‌సీసీ, డూప్లెక్సులో నివాసమున్నారా అని ప్రశ్నలు ఉన్నాయి. కానీ అది అద్దె ఇల్లా, సొంతమా అన్న ఆప్షన లేదు.
Updated Date - Jan 29 , 2024 | 12:34 AM