అసైన్డ్ భూములపై ప్రతీ ఏటా యాజమాన్య హక్కుల జాబితా విడుదల
ABN, Publish Date - Jan 21 , 2024 | 02:11 AM
యాజమాన్య హక్కులు పొందే అర్హత ఉన్న అసైన్డ్ భూముల జాబితాను ఇక ప్రతీ ఏటా విడుదల చేయనున్నారు. ఈ మేరకు సాగు భూములు,
వాటిని ప్రభుత్వం తీసుకుంటే మార్కెట్ విలువ మేర పరిహారం
అసైన్డ్ చట్టం నిబంధనల్లో సవరణలు
(అమరావతి - ఆంధ్రజ్యోతి)
యాజమాన్య హక్కులు పొందే అర్హత ఉన్న అసైన్డ్ భూముల జాబితాను ఇక ప్రతీ ఏటా విడుదల చేయనున్నారు. ఈ మేరకు సాగు భూములు, ఇంటి స్థలాలపై ఏటేటా మండల స్థాయిలో అర్హత జాబితాలు తయారు చేయాలని రెవెన్యూ శాఖ ఆదేశాలు ఇచ్చింది. ఆ మేరకు వాటిని ఖరారు చేసి భూములకు యాజమాన్య హక్కులు (ఫ్రీ హోల్డ్ రైట్స్) ఇచ్చేలా ఆంధ్రప్రదేశ్ అసైన్‌మెంట్ చట్టం 1977 అమలుకు ఉద్దేశించిన అసైన్‌మెంట్ రూల్స్ (2007)లో సవరణలు చేస్తూ రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ ఉత్తర్వులు (జీఓ-23) జారీ చేశారు. ఆ ఉత్తర్వులను శనివారం నోటిఫై చేస్తూ ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చింది. ప్రభుత్వం పేదలకు సాగు, నివాస యోగ్యమైన భూములను అసైన్ చేస్తోన్న సంగతి తెలిసిందే. అసైన్ చేసి 20 ఏళ్లు పూర్తయిన సాగు భూములు, 10 ఏళ్లు పూర్తయిన ఇంటి స్థలాలకు పూర్తి యాజమాన్య హక్కులు కల్పించేలా గత ఏడాది ఆంధ్రప్రదేశ్ అసైన్‌మెంట్ చట్టం-1977లో సవరణలు తీసుకొచ్చింది. ఇప్పుడు ఈ చట్టం అమలుకు ఉద్దేశించిన నిబంధనల్లో సవరణలు చేసింది. చట్టం అమలులో భాగంగా ఇక ప్రతీ యేటా యాజమాన్య హక్కులకు అర్హత కల సాగు, ఇంటి స్థలాలను గుర్తించి వాటి జాబితాలను మండల స్థాయిలో తహశీల్దార్ రూపొందించాలి. అందులో వాస్తవిక అసైనీలు లేదా వారి వారసుల వివరాలను పొందుపరచాలి. వాటిపై అభ్యంతరాలను మండల స్థాయిలో పరిష్కరించాలి. ఆపై తుది జాబితాను సాగు భూములకు ఫామ్-7, ఇంటి స్ధలాల కోసం ఫామ్-8లను రూపొందించి వాటిని జిల్లా కలెక్టర్ ఆమోదం కోసం పంపాలి. కలెక్టర్ వాటిని ఆమోదించాక జిల్లా రిజిస్ట్రార్‌కు పంపించాలి. ఆ జాబితాలో ఉన్న భూములను రిజిస్ట్రేషన్ చట్టం 1908లోని నిషేధ జాబితా 22(ఏ)నుంచి తొలగించాలని జిల్లా రిజిస్ట్రార్‌ను కలెక్టర్ ఆదేశించాలి. ఈ నిబంధన ప్రకారం యాజమాన్య హక్కులు పొందేందుకు అర్హత కల భూముల జాబితాను ఇక ప్రతి సంవత్సరం తయారుచేసి వాటిని మండల స్థాయిలో ప్రచురించాలి.
అసైన్డ్ భూములకూ మార్కెట్ విలువ
పేద రైతులకు కేటాయించిన అసైన్డ్ భూములను ప్రజా ప్రయోజనాల కోసం ప్రభుత్వం తిరిగి తీసుకున్నా, లేక భూ సేకరణలో భాగంగా తీసుకుంటే వాటికి మార్కెట్ విలువ ప్రకారం పరిహారం చె ల్లించాలని అసైన్డ్ చట్టం నిబంధనలు (రూల్ 9(1)లో పొందుపరిచారు. ఇతర భూముల యజమానులతో సమానంగా అక్కడ ఉన్న మార్కెట్ విలువ ప్రకారమే అసైన్డ్ రైతుకు పరిహారం చెల్లించాలని ఇందులో స్పష్టం చే శారు. అయితే, ధర విషయంలో సంప్రదింపులకు వీల్లేదని, ప్రభుత్వం ఖరారు చేసిన మార్కెట్ విలువే ప్రామాణికమని పేర్కొన్నారు. సంప్రదింపుల ప్రక్రియ ఆ భూములకు వర్తించదని నిబంధన 9(2)లో స్పష్టం చేశారు. కాగా నిబంధనలు 10, 11లను తొలగించారు.
Updated Date - Jan 21 , 2024 | 07:12 AM