SCCL ; సింగరేణిని గట్టెక్కిస్తారా?
ABN, Publish Date - Dec 26 , 2023 | 12:39 AM
నల్లబంగారం తెల్లబోతోంది..! లాభాల్లో ఉన్న సింగరేణి సంస్థ.. క్రమంగా నష్టాల బాటలో పయనిస్తోంది..! తెలంగాణ ఏర్పడితే ఓపెన్ కాస్టులే ఉండవని, భూగర్భ గనుల సంఖ్యను భారీగా పెంచి సింగరేణిలో ఉద్యోగావకాశాలు కల్పిస్తామని ఉద్యమ సమయంలో బీఆర్‌ఎస్ హామీ ఇచ్చింది..!
పదేళ్లలో కుదేలైన సంస్థ!.. కొత్త భూగర్భ గనుల ఊసే లేదు
వస్తున్నవన్నీ ఓసీపీలే.. భారీగా తగ్గిన కార్మికులు
హామీలు నెరవేర్చని గత సర్కారు
కొత్త గనులు రాకుంటే మనుగడెట్లా..?
మరో 20 ఏళ్లకు మాత్రమే నిక్షేపాలు
బొగ్గు గనుల వేలానికి దూరంగా సింగరేణి
రేపే సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలు
(ఆంధ్రజ్యోతి, భూపాలపల్లి)
నల్లబంగారం తెల్లబోతోంది..! లాభాల్లో ఉన్న సింగరేణి సంస్థ.. క్రమంగా నష్టాల బాటలో పయనిస్తోంది..! తెలంగాణ ఏర్పడితే ఓపెన్ కాస్టులే ఉండవని, భూగర్భ గనుల సంఖ్యను భారీగా పెంచి సింగరేణిలో ఉద్యోగావకాశాలు కల్పిస్తామని ఉద్యమ సమయంలో బీఆర్‌ఎస్ హామీ ఇచ్చింది..! స్వరాష్ట్రం ఏర్పడడంతో సింగరేణికి పూర్వవైభవం వస్తుందని ఆశపడ్డ కార్మికులకు నిరాశే మిగిలింది..! తెలంగాణ ఏర్పడిన తర్వాత ఓసీపీల సంఖ్య తగ్గకపోవడమేగాక.. కొత్తగా భూగర్భ గనులూ రాలేదు. తట్టా చెమ్మాస్ స్థానంలో యాంత్రీకరణ వచ్చేసింది..! ఫలితంగా 2013-14లో 61,778గా ఉన్న కార్మికుల సంఖ్య ప్రస్తుతం 39,748కి తగ్గిపోయింది! కొత్త కొలువుల మాట దేవుడెరుగు.. పదేళ్లలో ఉన్న కార్మికులే తగ్గిపోయారు! రాష్ట్రం సిద్ధించిన తర్వాత సింగరేణి పరిస్థితి తలకిందులైంది! కొత్త గనుల ప్రస్తావన లేకపోవడం, బొగ్గు బ్లాకులను కేంద్ర ప్రభుత్వం వేలంలో పెడుతుండడంతో సింగరేణి మనుగడపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. ఒకప్పుడు 56 భూగర్భ గనులు ఉండగా, నేడు 29కి తగ్గాయి. సింగరేణిలో ఓపెన్‌కాస్టులు 19కి పెరగడంతో కార్మికుల సంఖ్య తగ్గిపోయింది. కొత్త గనులు రాకపోతే సంస్థ మనుగడ కష్టమేనన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ తరుణంలో కాంగ్రెస్ సర్కారు కొలువుదీరడంతో సింగరేణి కార్మికుల్లో ఆశలు చిగురిస్తున్నాయి.
సింగరేణికి భవిష్యత్తు ఏదీ..?
తెలంగాణ ప్రాంతంలోని గోదావరి, ప్రాణహిత పరీవాహక ప్రాంతాల్లో అపార బొగ్గు నిక్షేపాలు ఉన్నాయి. 1870లో విలియం కింగ్ అనే శాస్త్రవేత్త ఈ నిక్షేపాలను కనుగొన్నారు. నాటి లెక్కల ప్రకారం 11 వేల మిలియన్ టన్నుల బొగ్గు ఉన్నట్లు గుర్తించారు. ఎలాంటి సమస్యలు లేకుండా కనీసం మూడు వేల మిలియన్ టన్నుల బొగ్గును వెలికి తీయొచ్చని పేర్కొన్నారు. ఇప్పటి వరకు సుమారు 1,600 మిలియన్ టన్నుల బొగ్గు మాత్రమే సింగరేణి సంస్థ వెలికితీసింది. సింగరేణి జియాలజికల్ విభాగం లెక్కల ప్రకారం ఇంకా 1,400 మిలియన్ టన్నుల బొగ్గు నిక్షేపాలే ఉన్నాయి. వీటిని వెలికి తీసేందుకు మరో 20 నుంచి 25 ఏళ్ల సమయం పట్టే అవకాశం ఉంది. తెలంగాణలో కోయగూడెం, ఓసీ-3, శ్రావణపల్లి ఓసీపీ, సత్తుపల్లి ఓసీపీలకు ఇటీవలే కేంద్ర ప్రభుత్వం వేలం వేసింది. సింగరేణి సంస్థ మాత్రం వివిధ కారణాలు చెబుతూ ఈ వేలంలో పాల్గొనలేదు. ఈ మూడు గనుల్లో బొగ్గు నిక్షేపాల గుర్తింపు, ఇతర పనుల కోసం సింగరేణి సంస్థ సుమారు రూ.60 కోట్లకు పైగాఖర్చు చేసింది. పైగా రూ.25 లక్షలు వెచ్చించి, టెండర్ ఫామ్‌లు కూడా కొనుగోలు చేసింది. అయినప్పటికీ వేలంలో పాల్గొనలేదు. దీంతో సుమారు 300 మిలియన్ టన్నుల బొగ్గు సింగరేణికి దూరమైంది. కొత్త గనుల కోసం సింగరేణి ముందడుగు వేయకపోతే.. మరో 20 ఏళ్ల తర్వాత సంస్థ భవిష్యత్తు ఏంటన్నది ప్రశ్నార్థకంగా మారింది.
ఓసీపీలతో కార్మికులకు కష్టాలే..!
భూగర్భ గనులతో నష్టం వస్తోందనే సాకుతో సింగరేణి యాజమాన్యం ఓపెన్ కాస్టుల వైపు మొగ్గు చూపుతోంది. 1998-2000లో 59 భూగర్భగనులు 1.20లక్షల మంది కార్మికులతో సింగరేణి కళకళలాడింది. ప్రస్తుతం 29 భూగర్భ గనులే మిగిలాయి. అధిక ఉత్పత్తిపై దృష్టిపెట్టి అండర్‌గ్రౌండ్ మైన్లను ఓసీపీలుగా మార్చడం మొదలుపెట్టారు. ప్రస్తుతం 19 ఓసీపీల్లో బొగ్గు ఉత్పత్తి చేస్తున్నారు. రాబోయే కాలంలో భూగర్భ గనులు ఇంకా తగ్గిపోయే తగ్గే అవకాశం ఉంది. ఓసీపీల్లో తక్కువ ఖర్చు, తక్కువ కాలంలో ఎక్కువ ఉత్పత్తి జరుగుతోంది. దీంతో యాజమాన్యం యాంత్రీకరణ వైపు మొగ్గు చూపుతోంది. ఫలితంగా బొగ్గు బావుల్లో చాలా విభాగాలు కనుమరుగవుతున్నాయి. చాలా చోట్ల కాంట్రాక్టు కార్మికులను నియమిస్తున్నారు. సింగరేణిలో కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులే 25 వేలకు పైగా ఉన్నారు. ప్రైవేటీకరణ పెరుగుతుండడంతో కార్మికుల మనుగడ చర్చనీయాంశంగా మారింది.
రాష్ట్రం ఏర్పడ్డాక అప్పుల్లోకి..
తెలంగాణ ఏర్పడిన తర్వాత సింగరేణి సంస్థ అప్పుల్లో కూరుకుపోవడంతో సంస్థ మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. రాష్ట్రం ఏర్పడినప్పుడు రూ.3,540 కోట్ల బ్యాంక్ బ్యాలెన్స్ ఉండేది. అయితే లాభాల్లో ఉన్న సింగరేణి సంస్థ పదేళ్ల కాలంలో రూ.5 వేల కోట్లకు పైగా అప్పుల్లో కూరుకుపోయినట్లు కార్మికవర్గం ఆరోపిస్తోంది. దీనికి తోడు జెన్‌కో, ట్రాన్స్‌కో సంస్థల నుంచి రూ.27 వేల కోట్ల బకాయిలు కూడా రాకుండా గత ప్రభుత్వం అడ్డుకుందనే ఆరోపణలు ఉన్నాయి. లాభాల్లో ఉన్న సంస్థ అప్పుల్లోకి వెళ్లడంతో కార్మికుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఇక తెలంగాణ ఏర్పడగానే కొత్తగా కనీసం 15 అండర్‌గ్రౌండ్ గనులను ఏర్పాటు చేసి, కొత్తగా లక్ష ఉద్యోగాలను సృష్టించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే పదేళ్ల కాలంలో 2018లో మణుగూరు ఏరియాలోని కొండాపూర్‌లో మాత్రమే భూగర్భ గనిని ఏర్పాటు చేశారు. అలాగే ఇందారం ఓసీపీ, భూపాలపల్లిలో ఓసీపీ-3లను ఏర్పాటు చేశారు. కేవలం ఒక భూగర్భ గని, రెండు ఓపీపీలు మాత్రమే సింగరేణి సంస్థ ఏర్పాటు చేసింది. గడిచిన పదేళ్లలో సింగరేణిలో కేవలం 4,253 పోస్టులను మాత్రమే భర్తీ చేశారు. ఇవి కూడా జూనియర్ అసిస్టెంట్, వెల్ఫేర్ ఆఫీసర్, జూనియర్ మైనింగ్ ఇంజనీర్ (ట్రైనీస్), ఇంజనీరింగ్ అండ్ మెకానిక్, డాక్టర్ తదితర పోస్టులే.
కొత్త ప్రభుత్వంపైనే ఆశలు
తెలంగాణలో తొలిసారి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వంపై సింగరేణి కార్మికులు ఆశతో ఉన్నారు. సింగరేణి ఏరియాలో కొత్తగా భూగర్భ గనులను ఏర్పాటు చేయడంతో పాటు స్థానికులకు ఉద్యోగావకాశాలు కల్పించాలని కోరుతున్నారు. సింగరేణి ప్రాంతాల్లో మైనింగ్ ఇంజనీరింగ్ కాలేజీలతో పాటు 100 పడకల ఆస్పత్రులు ఏర్పాటు చేయాలని, ప్రతి కార్మికుడికీ సొంతింటి కల నిజం చేసేలా కొత్త ప్రభుత్వం దృష్టి పెట్టాలని కోరుతున్నారు. నష్టాల్లో ఉన్న సంస్థను గట్టెక్కించే బాధ్యతను కూడా కొత్త ప్రభుత్వం తీసుకుంటుందనే ఆశతో ఉన్నారు. ఈ నెల 27న జరగనున్న గుర్తింపు సంఘం ఎన్నికల్లో అన్ని సంఘాలు అనేక హామీలు ఇస్తున్నాయి. ప్రధానంగా ఐఎన్‌టీయూసీ, ఏఐటీయూసీ, టీబీజీకేఎస్ మధ్యే పోటీ నెలకొంది. కోల్‌బెల్ట్ ఏరియా మంత్రులు, ఎమ్మెల్యేలు ఐఎన్‌టీయూసీ గెలుపు కోసం విస్తృతంగా ప్రచారం చేశారు.
Updated Date - Dec 26 , 2023 | 12:39 AM