శ్వేత పత్రం.. స్వేద పత్రం.. రెండూ అవినీతి పత్రాలే
ABN, Publish Date - Dec 26 , 2023 | 01:21 AM
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన శ్వేతపత్రం, బీఆర్‌ఎస్ విడుదల చేసిన స్వేద పత్రం.. రెండూ అవినీతి పత్రాలే అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర కిషన్‌రెడ్డి విమర్శించారు. ఇరు పార్టీలు పచ్చి అబద్ధాలతో ప్రజలను మోసం చేస్తున్నాయని
కాంగ్రెస్, బీఆర్‌ఎ్‌సవి పచ్చి అబద్ధాలు
అయోధ్యలో రామాలయం వాజ్‌పేయి కల
అటల్ గొప్ప నేత: కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
హైదరాబాద్, డిసెంబరు 25 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన శ్వేతపత్రం, బీఆర్‌ఎస్ విడుదల చేసిన స్వేద పత్రం.. రెండూ అవినీతి పత్రాలే అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర కిషన్‌రెడ్డి విమర్శించారు. ఇరు పార్టీలు పచ్చి అబద్ధాలతో ప్రజలను మోసం చేస్తున్నాయని మండిపడ్డారు. శ్వేతపత్రాలు, స్వేదపత్రాలను రాష్ట్ర ప్రజలు నమ్మడం లేదని చెప్పారు. మాజీ ప్రధాని వాజ్‌పేయి జయంతి సందర్భంగా సోమవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కిషన్‌రెడ్డి, బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్, ఎమ్మెల్యే రాజాసింగ్‌తో పాటు పలువురు పార్టీ నాయకులు అటల్ చిత్రపటానికి నివాళులర్పించారు. అనంతరం కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. అయోధ్యలో రామాలయ నిర్మాణం వాజ్‌పేయి కల అని, ఆయన కలను ప్రధాని మోదీ సాకారం చేశారని చెప్పారు. నిజాయితీ, చిత్తశుద్ధితో పనిచేసిన గొప్ప నాయకుడు వాజ్‌పేయి అని కొనియాడారు. వాల్మీకి అంబేద్కర్ ఆవాస్ యోజన, సడక్ యోజన పథకాలకు శ్రీకారం చుట్టిన ఘనత ఆయనది అని పేర్కొన్నారు. వాజ్‌పేయి స్ఫూర్తితో మోదీ ప్రభుత్వం సేవ చేస్తోందని కిషన్‌రెడ్డి వివరించారు.
28న రాష్ట్రానికి అమిత్ షా రాక..
కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈనెల 28న హైదరాబాద్ రానున్నారని కిషన్‌రెడ్డి వెల్లడించారు. ఆ రోజున ఉదయం పార్టీ ముఖ్యనేతలతో అనంతరం రంగారెడ్డి జిల్లా కొంగర్‌కలాన్‌లో పార్టీ మండల స్థాయి అధ్యక్షులు, ఆపై స్థాయి నేతలతో సమావేశమవుతారని పేర్కొన్నారు. పార్లమెంటు ఎన్నికల సన్నద్ధతపై పార్టీ శ్రేణులకు అమిత్ షా దిశానిర్దేశం చేస్తారని తెలిపారు.
ఎల్లుండి బీజేఎల్పీ నేత ఎంపిక..
బీజేపీ శాసనసభాపక్ష (బీజేఎల్పీ) నేత ఎంపిక గురువారం జరుగనుంది. ఆ రోజు రాష్ట్ర పర్యటనకు వస్తున్న అమిత్ షా పార్టీ ఎమ్మెల్యేలతో భేటీ కానున్నారు. అనంతరం ఎల్పీ నేతపై ప్రకటన వెలువడే అవకాశం ఉంది. గత అసెంబ్లీలో బీజేఎల్పీ నేతగా వ్యవహరించిన ఎమ్మెల్యే రాజాసింగ్, నిర్మల్ నుంచి గెలుపొందిన మహేశ్వర్‌రెడ్డిలో ఒకరు పార్టీ ఎల్పీ నేతగా ఎంపికయ్యే అవకాశం ఉందని బీజేపీ వర్గాలు తెలిపాయి.
Updated Date - Dec 26 , 2023 | 01:21 AM