సంచార వైద్యానికి సుస్తీ
ABN, Publish Date - Dec 26 , 2023 | 11:57 PM
ఒకప్పుడు పల్లెల్లో సేవలందించే సంచార వైద్యానికి నేడు సుస్తీ చేసింది. పట్టించుకునే వారు లేక అవస్థలు పడుతోంది. మరమ్మతులకు డబ్బులు లేక ‘104’ వాహనాలు మూలనపడుతున్నాయి. ఫలితంగా గ్రామీణ ప్రజలు ఇబ్బందిపడుతున్నారు. నెలనెలా మందులు అందక ఆందోళన చెందుతున్నారు.
తుప్పు పడుతున్న ‘104’ వాహనాలు
ఒకప్పుడు జిల్లాలో వేలాది మందికి మందుల పంపిణీ
గత పాలకుల నిర్లక్ష్యంతో ఆగిపోయిన సేవలు
కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టి సారించాలంటున్న ప్రజలు
ఒకప్పుడు పల్లెల్లో సేవలందించే సంచార వైద్యానికి నేడు సుస్తీ చేసింది. పట్టించుకునే వారు లేక అవస్థలు పడుతోంది. మరమ్మతులకు డబ్బులు లేక ‘104’ వాహనాలు మూలనపడుతున్నాయి. ఫలితంగా గ్రామీణ ప్రజలు ఇబ్బందిపడుతున్నారు. నెలనెలా మందులు అందక ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా వృద్ధులు, దీర్థకాలిక వ్యాధిగ్రస్థులు పట్టణాలకు వెళ్లలేక, మందులు కొనుక్కునే ఆర్థిక స్థోమత లేక నానా అవస్థలు పడుతున్నారు. గత పాలకుల నిర్లక్ష్యంతో ఆగిపోయిన సేవలను నూతన ప్రభుత్వమైనా పునరుద్ధరిస్తుందన్న ఆశతో ఎదురు చూస్తున్నారు. మరి వారి ఆశలను కాంగ్రెస్ సర్కారు నెరవేరుస్తుందో లేదో వేచి చూడాలి..
స్టేషన్‌ఘన్‌పూర్, డిసెంబరు 26: నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి 2008లో ప్రారంభించిన సంచార వైద్యం బీఆర్‌ఎస్ పాలనలో ఆగిపోయింది. ప్రతీ పల్లెకు వెళ్లి మందులు అందించే 104 వాహనాలు చెట్లకింద మూలుగుతున్నాయి. నాడు ప్రతీ వాహనానికి డ్రైవర్, ఫార్మసిస్ట్, ల్యాబ్‌టెక్నిషియన్ ముగ్గురిని కేటాయించారు. వారు గ్రామాల్లోకి వెళ్లి షుగర్, బీపీ, అస్తమా, ఫిట్స్, జ్వరం, జలబు, దగ్గుతో బాధపడుతున్న వారికి మందులు ఇచ్చేవారు. అంతేగాకుండా గర్భిణులకు పరీక్షలు నిర్వహించి తగు సేవలు అందించేవారు. ప్రతీ ఊరికి నెలకోసారి వెళ్లి బాధితులకు సేవలు అందించేవారు. 2008లో ఉమ్మడి వరంగల్ జిల్లాకు 20 వాహనాలను కేటాయించగా తెలంగాణ రాష్ట్ర సాకారం అయిన తరువాత 2016లో జనగామ జిల్లాకు నాలుగు వాహనాలను సమకూర్చారు. వాటిని స్టేషన్‌ఘన్‌పూర్, పాలకుర్తి, బచ్చన్నపేట, జనగామ జిల్లా కేంద్రానికి కేటాయించారు. ప్రస్తుతం అందులో ఒక్కటి కూడా పనిచేయడంలేదు.
పాలకుల నిర్లక్ష్యం.. ప్రజలకు శాపం..
ఆరంభం నుంచి 2021 వరకు విజయవంతంగా సేవలు అందించిన సంచార వైద్యం ఆ తర్వాత ఆగిపోయింది. వాహనాలకు మరమ్మతులు చేయించేవారు లేక పక్కకు పెట్టేశారు. కొన్ని చోట్ల కనీసం డిజిల్ డబ్బులు లేక సేవలు పూర్తిగా నిలిచిపోయాయి. దీంతో జిల్లా వ్యాప్తంగా సుమారు 10 వేల మందికి మందులు అందడం లేదు. కొన్ని సందర్భాల్లో బీపీ, షుగర్ ఎక్కువై ప్రజలు పడరాని పాట్లు పడుతున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆశలు..
కాంగ్రెస్ పాలనలో ప్రారంభమైన సంచార వైద్యం బీఆర్‌ఎస్ పాలనలో ఆగిపోగా.. ఇపుడు మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినందున సేవలు పునరుద్ధరిస్తారని పల్లె ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం సీఎం రేంవత్‌రెడ్డి 104 వాహనాలను అందుబాటులోకి తీసుకువస్తారని, ఎప్పటిలాగే నిరుపేద ప్రజలకు దీర్ఘకాలిక వ్యాధులకు మందులు అందిస్తారని ఎదురుచూస్తున్నారు.
ప్రజావైద్యంపై దృష్టిసారించాలి : గాండ్ల దేవేందర్, రాఘవపూర్
ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం సంచారవైద్యం (104)పై దృష్టిసారించాల్సిన అవసరం ఉంది. బీఆర్‌ఎస్ ప్రభుత్వం చేసిన నిర్లక్ష్యం వల్ల ఆగిపోయిన వైద్యసేవలను కాంగ్రెస్ ప్రభుత్వం పునరుద్ధరించాలి. తిరిగి సేవలు కొనసాగించి ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందుబాటులోకి తీసుకురావాలి.
షుగర్ పరీక్షలు చేసేవాళ్లు కరువయ్యారు : గూడెల్లి సత్తెమ్మ, కోమటిగూడెం
గతంలో ప్రతీ నెల గ్రామానికి 104 వాహనం రావడంతో వాహనం వద్దకు వెళ్లి షుగర్, బీపీ పరీక్షలు చేయించుకొనేవాళ్లం. అంతేగాకుండా నెలకు సరిపడా బీపీ, షుగర్ మాత్రలు ఇచ్చేవారు. ఏడాది కాలంగా వాహనం రాకపోవడంతో మాత్రలు లేక ఇబ్బందులు పడుతున్నాను. కొత్త సర్కారు స్పందించి గ్రామాలకు వాహనాలను పంపించి వృద్ధులకు మందులు అందించాలి.
ఉద్యోగ భద్రత లేకుండా పని చేస్తున్నాం : వెంకటకృష్ణరావు, 104 ఫార్మసిస్ట్
2008 నుంచి 2021 వరకు 104 వాహనంలో ఫార్మసి్‌స్టగా విధులు నిర్వహించాను. 2022 నుంచి సేవలు నిలచిపోవడంతో ఘన్‌పూర్ పీహెచ్‌సీకి అనుసంధానించారు. ఫార్మసి్‌స్టగా విధులు నిర్వహిస్తున్నప్పటికీ ఉద్యోగభద్రత లేకుండా పోయింది. కొన్ని నెలలుగా ప్రభుత్వం వేతనాలు ఇవ్వకపోవడంతో ఇబ్బందులు పడుతున్నాం. ప్రస్తుత ప్రభుత్వం 104ను పునరుద్ధరిస్తే మాకు ఉద్యోగభద్రత లభించడమే కాకుండా ప్రజలకు తిరిగి సేవలు అందించే అవకాశం వస్తుంది.
Updated Date - Dec 26 , 2023 | 11:57 PM