అమాత్య...!
ABN, First Publish Date - 2023-12-09T23:36:47+05:30
సీఎం రేవంత్‌రెడ్డి మంత్రి వర్గంలో ఉమ్మడి భూపాలపల్లి జిల్లాకు కీలక మంత్రిత్వ శాఖలు లభించాయి. ఈ నెల 7వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తన మంత్రి వర్గంలోకి మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, ములుగు ఎమ్మెల్యే సీతక్కలను తీసుకున్నారు.
ఉమ్మడి భూపాలపల్లి జిల్లాకు కీలక మంత్రిత్వ శాఖలు
ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల మంత్రిగా దుద్దిళ్ల శ్రీధర్‌బాబు
పంచాయతీరాజ్, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రిగా సీతక్క
అడవి బిడ్డకు తొలిసారిగా కీలక శాఖలు అప్పగింత
ఇద్దరు మంత్రులపైనే అభివృద్ధి ఆశలు
భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్తన్నను విప్‌గా నియమించే ఛాన్స్
భూపాలపల్లి, డిసెంబరు 9 (ఆంధ్రజ్యోతి): సీఎం రేవంత్‌రెడ్డి మంత్రి వర్గంలో ఉమ్మడి భూపాలపల్లి జిల్లాకు కీలక మంత్రిత్వ శాఖలు లభించాయి. ఈ నెల 7వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తన మంత్రి వర్గంలోకి మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, ములుగు ఎమ్మెల్యే సీతక్కలను తీసుకున్నారు. ఈ ఇరువురికి ఎలాంటి శాఖలు లభిస్తాయో అనే ఆసక్తి ప్రజల్లో నెలకొంది. శనివారం సీఎం మంత్రులకు శాఖలు కేటాయించటంతో సీనియర్ మంత్రిగా ఉన్న శ్రీధర్‌బాబుకు అత్యంత కీలకమైన పదవులు వరించాయి. దీంతో కొత్త మంత్రులు భూపాలపల్లి, ములుగు జిల్లాలను అభివృద్ధి చేస్తారనే ఆశతో స్థానికులు ఉన్నారు. కాగా, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావుకు కూడా కీలకమైన ప్రభుత్వ విప్ పదవి ఇవ్వనున్నట్లుగా ప్రచారం జరుగుతోంది.
రెండోసారి కీలక బాధ్యతలు
కొత్త జిల్లాలు ఏర్పడిన తరువాత ఉమ్మడి భూపా లపల్లి జిల్లాకు కీలక పదవులు దక్కడం ఇది రెండో సారి. 2014లో తెలంగాణ రాష్ట్రం వచ్చాక బీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. 2016 అక్టోబరు 11న భూపాలపల్లి కేంద్రంగా 20 మండలాలతో జయ శంకర్ భూపాలపల్లి జిల్లాను ఏర్పాటు చేశారు. ఆ సమయంలోనే భూపాలపల్లి నుంచి గెలిచిన సిరికొండ మధుసూదనాచారిని తొలి స్పీకర్‌గా, ములుగు నుంచి గెలిచిన అజ్మీర చందూలాల్ రాష్ట్ర గిరిజన శాఖ మంత్రిగా వ్యవహరించారు. కేసీఆర్ క్యాబినెట్‌లో కీలక పదవులు లభించాయి. అయితే 2018లో మరోసారి బీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చినప్పటికి ములుగు, భూపాలపల్లి, మంథని, భద్రాచలం నియోజకవర్గాల నుంచి కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించటంతో కేసీఆర్ మంత్రివర్గంలో ఎవరికి చోటు దక్కకుండా పోయింది. కొద్ది నెలలకే భూపాలపల్లి ఎమ్మెల్యేగా గెలిచిన గండ్ర వెంకటరమణారెడ్డి బీఆర్‌ఎస్‌లో చేరిన ప్పటికి మంత్రి పదవి దక్కలేదు. తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మూడు చోట్ల కాంగ్రెస్ ఎమ్మెల్యేలే గెలవటంతో పాటు రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావటంతో మరోసారి ఉమ్మడి భూపాలపల్లి జిల్లాకు అమాత్య అనే పిలిచే అవకాశం దక్కింది.
ఐటీ మంత్రి ధన్వాడ బిడ్డ..
భూపాలపల్లి జిల్లా కాటారం మండలం ధన్వాడ గ్రామానికి చెందిన మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్‌బాబుకు రేవంత్‌రెడ్డి మంత్రి వర్గంలో కీలక పదవులు లభించాయి. 1999లో మహదేవపూర్ మండలం అన్నారం అటవీ ప్రాంతంలో శ్రీధర్‌బాబు తండ్రి, మాజీ స్పీకర్ శ్రీపాదరావును మావోయిస్టులు హతమార్చారు. దీంతో వారసుడిగా రాజకీయాల్లోకి అడుగు పెట్టిన ఆయన అదే ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆ తరువాత 2004, 2009లో వరుసగా గెలిచి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా నిలిచారు. ఆ తరువాత 2018, 2023 ఎన్నికల్లోనూ విజయం సాధించి ఐదోసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగు పెట్టారు. వివాదరహితుడిగా పేరున్న శ్రీధర్‌బాబుకు ముఖ్యమంత్రిగా అవకాశం ఇవ్వాలని సీనియర్ నేతలు కాంగ్రెస్ అధిష్టానికి విజ్ఞప్తి చేశారు. అధిష్టానం రేవంత్‌రెడ్డి వైపు మొగ్గుచూపటంతో శ్రీధర్‌బాబుకు ఐటీ మంత్రిత్వ శాఖతో పాటు పరిశ్రమల శాఖ అప్పగించారు. అలాగే శాసనసభ వ్యవహారాల బాధ్యతలు అప్పగించారు. కీలకమైన బాధ్యతలు శ్రీధర్‌బాబుకు అప్పగించటంతో కాటారం డివిజన్‌తో పాటు భూపాపలపల్లి జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణుల్లో హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. కాగా, 2004లో వైఎస్.రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వంలో ప్రభుత్వ విప్‌గా బాధ్యతలు నిర్వహించారు. 2009 లోనూ ఉన్నత విద్యాశాఖ, పౌర సరఫరాల శాఖ మంత్రిగా పనిచేశారు. వైఎస్‌ఆర్ మరణం తరువాత రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డిల మంత్రి వర్గంలోనూ శ్రీధర్‌బాబు పౌర సరఫరాల శాఖ మంత్రిగా వ్యవహరించారు.
అడవి బిడ్డ చేతికి గ్రామీణం..
సామాన్య కుటుంబం నుంచి వచ్చి నక్సలైట్ జీవితం నుంచి రాజకీయాల్లో అడుగు పెట్టిన ధనసరి అనసూయ అలియాస్ సీతక్కకు రేవంత్‌రెడ్డి మంత్రి వర్గంలో కీలక బాధ్యతలు అప్పగించారు. ములుగు మండలం జగ్గన్నపేట గ్రామానికి చెందిన సీతక్క అప్పటి సీఎం చంద్రబాబునాయుడు పిలుపు మేరకు అజ్ఞాతం వీడి రాజకీయాల్లోకి వచ్చారు. 2004లో టీడీపీ తరుపున ములుగు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అయితే 2009లో తొలిసారి టీడీపీ తరుపున ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో అడుగు పెట్టారు. ఆ తరువాత 2014లో మరోసారి ఓటమి పాలయ్యారు. 2018లో రేవంత్‌రెడ్డితో పాటు కాంగ్రెస్‌లో చేరి ములుగు ఎమ్మెల్యేగా గెలిచారు. తాజాగా 2023 ఎన్నికల్లో మూడోసారి ఎమ్మెల్యేగా విజయం సాధించిన సీతక్కకు రేవంత్‌రెడ్డి మంత్రి వర్గంలో చోటు దక్కింది. గ్రామీణ నేపథ్యం నుంచి ఎదిగిన సీతక్కకు పంచాయతీరాజ్ శాఖతో పాటు ఆర్‌డబ్ల్యుఎస్ శాఖలను కూడా అప్పగించారు. అలాగే మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రిగా కూడా సీతక్కకు బాధ్యతలు అప్పగించారు. అత్యంత కీలకమైన శాఖలు సీతక్కకు దక్కడంతో కాంగ్రెస్ శ్రేణుల్లో హర్షం వ్యక్తం అవుతుంది.
విప్‌గా గండ్ర సత్తన్న..?
భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావుకు సీఎం రేవంత్‌రెడ్డి కీలక బాధ్యతలు అప్పగిం చే అవకాశం ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. 2014, 2018లో వరుసగా ఓటమి చెందిన సత్యనా రాయణరావు 2023 ఎన్నికల్లో 52వేల పైచిలుకు ఓట్ల మెజారిటీతో విజయం అందించారు. ఉమ్మడి జిల్లాలో అత్యంత మెజారిటీ ఆయనకే దక్కింది. అయితే మొదటి నుంచి రేవంత్‌రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా ఉన్న సత్యనారాయణరావుకు అసెంబ్లీలో ప్రభుత్వ చీఫ్ విప్‌గా లేదా విప్‌గా కానీ అవకాశం కల్పించనున్నట్లుగా సమాచారం. తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన సత్యనారాయణరావుకు సీఎం నుంచి ఈ మేరకు హామీ లభించిందనే ప్రచారం జరుగుతోంది.
అభివృద్ధిపై ఆశలు
ఉమ్మడి భూపాలపల్లి జిల్లాకు చెందిన దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, సీతక్కకు రేవంత్‌రెడ్డి మంత్రి వర్గంలో చోటు దక్కడంతో ఈ ప్రాంత అభివృద్ధిపై ప్రజల ఆశలు చిగురిస్తున్నాయి. భూపాలపల్లిలో ఐటీ టవర్ నిర్మాణం, మైనింగ్ ఇంజనీరింగ్ కాలేజీ ఏర్పాటు చేయాలని కొంతకాలంగా డిమాండ్ ఉంది. ఐటీ మినిస్టర్‌గా ఈ జిల్లావాసే ఉండటంతో ఐటీ టవర్ మంజూరు అవుతుందనే ఆశ యువతలో వ్యక్తమవుతోంది. అలాగే ములుగు జిల్లా కమలాపూర్‌లో మూతపడిన బిల్ట్ ఫ్యాక్టరీ పునరుద్ధరణ లేదా దాని స్థానంలో మరో పరిశ్రమ ఏర్పాటు చేయాలని డిమాండ్ ఉంది. వీటితో పాటు గిరిజన ప్రాంతమైన ములుగులో సీతక్క మంత్రిగా అభివృద్ధి చేస్తారనే ఆశతో జిల్లా వాసులు ఉన్నారు. మొత్తానికి కొత్త ప్రభుత్వంలో జిల్లాల అభివృద్ధిపై ప్రజలు గంపెడు ఆశలు పెట్టుకున్నారు.
Updated Date - 2023-12-11T07:30:49+05:30 IST