Veterinary Jobs : వియ్యంకుడి వీరంగం!
ABN, Publish Date - Dec 26 , 2023 | 01:30 AM
పీవీ నరసింహారావు పశువైద్య విశ్వవిద్యాలయంలో ఆయనో ఉన్నతాధికారి! గత కేసీఆర్ ప్రభుత్వంలో పని చేసిన ఒక మంత్రికి వియ్యంకుడు! అప్పటి మంత్రి గారి చలవతోనే ఆయన యూనివర్సిటీ వీసీ అయ్యారన్న చర్చ బాహాటంగానే జరిగింది. ఆ
‘వెటర్నరీ’లో దొడ్డిదారిన నియామకాలు
ఉమ్మడి రాష్ట్రం నాటి 420 జీవోతో పోస్టుల భర్తీ
ఆ జీవోను గతంలోనే రద్దు చేసిన ఏపీ హైకోర్టు
కానీ.. బీఆర్‌ఎస్ హయాంలో ప్రత్యేక అనుమతి
వీసీ.. అప్పటి మంత్రికి వియ్యంకుడవడం వల్లే..
కాంగ్రెస్ సర్కారు వచ్చినా ఆయన తీరు మారలే
పదవీ విరమణకు మరో 15 రోజులే ఉన్నా
అపాయింట్‌మెంట్ ఆర్డర్లిచ్చేందుకు రంగం సిద్ధం
గతంలోనే గవర్నర్ తమిళిసైకి పలువురి ఫిర్యాదు
తెలంగాణ హైకోర్టులోనూ పెండింగ్‌లో విచారణ
హైదరాబాద్, డిసెంబరు 25 (ఆంధ్రజ్యోతి): పీవీ నరసింహారావు పశువైద్య విశ్వవిద్యాలయంలో ఆయనో ఉన్నతాధికారి! గత కేసీఆర్ ప్రభుత్వంలో పని చేసిన ఒక మంత్రికి వియ్యంకుడు! అప్పటి మంత్రి గారి చలవతోనే ఆయన యూనివర్సిటీ వీసీ అయ్యారన్న చర్చ బాహాటంగానే జరిగింది. ఆ తర్వాత యూనివర్సిటీలో ఆయన ఆడిందే ఆట... పాడిందే పాట! అన్నట్లు సాగింది. సీన్ కట్ చేస్తే.. ఇప్పుడు రాష్ట్రంలో ప్రభుత్వం మారింది. కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరింది. అయినా, ఆ యూనివర్సిటీ ఉన్నతాధికారి తీరు మాత్రం మారడం లేదు. పదవీ విరమణకు ఆరు నెలల ముందు నియామకాలే చేపట్టొద్దని నిబంధనలున్నా.. పట్టించుకోవడం లేదు. రిటైర్మెంట్‌కు నాలుగు నెలల ముందు నోటిఫికేషన్ వేసి... విరమణ తేదీ పట్టుమని పక్షం రోజులు లేకపోయినా అపాయింట్‌మెంట్ ఆర్డర్లు ఇచ్చేందుకు రంగం సిద్ధం చేశారు. పోనీ.. ఆ నియామకాలేమైనా సక్రమంగా జరిగాయా? అంటే అదీ లేదు. ఉమ్మడి రాష్ట్రంలో జారీ చేసిన జీవోను ఆధారంగా చేసుకొని.. అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులను దొడ్డిదారిలో భర్తీ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. మహిళలు, దివ్యాంగుల కోటాలో నిబంధనలకు నీళ్లొదిలేయడమే కాకుండా.. తమ వారికి అనుకూలంగా రోస్టర్ జాబితాను మార్చేందుకు ఓ పోస్టునే ఎత్తేశారు. మహాప్రభో! ఈ అక్రమ నియామకాలు ఆపండి.. అంటూ... బాధితులు గవర్నర్‌కు ఫిర్యాదు చేసినా, కోర్టును ఆశ్రయించినా... ఐ డోంట్ కేర్! అంటూ వర్సిటీ బాస్ తన పని తాను చేసుకుపోతున్నారు.
ఆగమేఘాలపై ఇంటర్వ్యూల నిర్వహణ
సిద్దిపేట, వరంగల్ జిల్లాల్లోని వెటర్నరీ కళాశాలల్లో పోస్టుల భర్తీ కోసం పీవీ నరసింహారావు వెటర్నరీ యూనివర్సిటీ గత ఆగస్టు నెల 29 తేదీన నోటిఫికేషన్ జారీ చేసింది. వెటర్నరీ సైన్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు 56, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులు 28 కలిపి మొత్తం 84 పోస్టుల భర్తీ ప్రక్రియ ప్రారంభించింది. అభ్యర్థులు దరఖాస్తులు సమర్పించడానికి గత సెప్టెంబరు 30 తేదీ వరకు గడువు ఇచ్చింది. ఆ తర్వాత నాలుగు రోజులకే (అక్టోబరు 5వ తేదీ నుంచి) ఇంటర్వ్యూల ప్రక్రియ చేపట్టిన వీసీ.. ఆగమేఘాలపై మూడు రోజుల్లోనే ముగించారు. కానీ.. అప్పటికే రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో అపాయింట్‌మెంట్ ఆర్డర్లు ఇవ్వలేదు. ఈనెల 28 తేదీన పరిమిత సంఖ్యలో ఉన్న బోర్డు సభ్యుల అనుమతి తీసుకొని అపాయింట్‌మెంట్ ఆర్డర్లు ఇచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే, ఈ నియామకాల్లో అక్రమాలు జరుగుతున్నాయని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రద్దు చేసిన జీవో 420 ప్రకారం రోస్టర్ సిస్టమ్ అమలు చేయడం సరి కాదని, అన్ని కాలేజీలు, అన్ని సబ్జెక్టులను కలిపేసి ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ప్రకారం రోస్టర్ అమలు చేస్తే తీవ్ర నష్టం జరుగుతుందని అభ్యర్థులు వాపోతున్నారు.
రద్దయిన జీవోతో నియామకాలా?
విభజన చట్టంలోని సెక్షన్- 101 ప్రకారం... ఉమ్మడి రాష్ట్ర జీవోలను తెలంగాణ ప్రభుత్వం అడాప్ట్ చేసుకొంది. ఆ క్రమంలోనే తెలంగాణలోకి జీవో నంబర్ 420 వచ్చింది. అయితే, జీవో 420 ని అమలు చేయకూడదని, కళాశాలలు, సాంక్షన్ పోస్టులు, సబ్జెక్టుల ప్రకారమే రోస్టర్ అమలు చేయాలని ఏపీలో కొందరు నిరుద్యోగులు 2017లో అక్కడి హైకోర్టును ఆశ్రయించగా.. ఆ జీవోను కోర్టు కొట్టివేసింది. దీంతో ఏపీలోని అన్ని యూనివర్సిటీలు జారీ చేసిన నోటిఫికేషన్లన్నీ రద్దు అయ్యాయి. 2017 తర్వాత జీవో నంబరు 420 ప్రకారం చేపట్టిన నియామకాలను హైకోర్టు టర్మినేట్ చేసింది. కానీ... ఆ జీవోను అనుసరించి తెలంగాణలో పీవీ నరసింహారావు వెటర్నరీ యూనివర్సిటీలో నియామకాలు చేపట్టడంపై అభ్యర్థుల నుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. తెలంగాణ ‘యూనివర్సిటీ’ బిల్లు పెండింగ్‌లో ఉండగా.. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం నుంచి ప్రత్యేక అనుమతి తీసుకొని మరీ నియామకాలు చేపట్టాల్సిన అవసరం ఏమొచ్చిందన్న ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయి. ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ 16 మంది విద్యార్థులు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. తెలంగాణ ప్రభుత్వం కొత్త చట్టం తెచ్చే వరకు... సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాల మేరకు రోస్టర్ సిస్టమ్ అమలు చేయాలని కోరారు. ఆ పిటిషన్‌పై విచారణ ఇంకా పెండింగ్‌లో ఉంది. అదే అంశంపై గవర్నర్ తమిళిసైకి సైతం పలువురు అభ్యర్థులు ఫిర్యాదు చేశారు. మరోవైపు.. మొత్తం 17 సబ్జెక్టులకు గాను.. వెటర్నరీ ఫిజియాలజీలో అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టును ఎత్తివేయడంతో రోస్టర్ విధానం మారిపోయింది. మంజూరైన పోస్టులను భర్తీ చేయకుండా, కొన్ని పోస్టులు ఎత్తివేయడం వెనుక ఉన్న ఆంతర్యమేంటని అభ్యర్థులు ప్రశ్నిస్తున్నారు.
మహిళలు, దివ్యాంగుల కోటాకు నీళ్లు
మహిళల రిజర్వేషన్‌ను వర్టికల్‌గా కాకుండా హారిజంటల్ విధానంలో అమలు చేయాలని గతంలోనే కోర్టులు ఆదేశించాయి. వాటిని పీవీ నరసింహారావు వెటర్నరీ యూనివర్సిటీ వీసీ బేఖాతరు చేస్తున్నారు. అలాగే, దివ్యాంగుల చట్టం-2016 ప్రకారం... దివ్యాంగులు చేయగలిగే పనికి అనుగుణంగా ప్రతి వంద పోస్టుల్లో నాలుగు కేటాయించాలి. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల మెరిట్ ప్రకారం వారికి సబ్జెక్టులు కేటాయించాలి. కానీ, దివ్యాంగుల విషయ పరిజ్ఞానానికి విరుద్ధంగా వర్సిటీ అధికారులే సబ్జెక్టులను నిర్ణయించారు. వెటర్నరీ గైనకాలజీలో కొన్ని పోస్టులను బధిరులకు నోటిఫై చేయడంతో అర్హులైన ఇతర దివ్యాంగులు నష్టపోతున్నారని పలువురు వాపోతున్నారు. ఇంత జరుగుతున్నా యూనివర్సిటీ వీసీ మాత్రం తన పని తాను చేసుకుపోతున్నారు. వచ్చే నెల 12న ఆయన పదవీ విరమణ చేయనుండగా.. ఆ లోపే అపాయింట్‌మెంట్ ఆర్డర్లు ఇచ్చేందుకు ప్రయత్నిస్తుండడం చర్చనీయాంశంగా మారింది.
అభ్యర్థుల డిమాండ్లివే!
గత ప్రభుత్వం ప్రత్యేక అనుమతితో వెటర్నరీ వర్సిటీలో చేపడుతున్న నియామకాలను నిలిపివేయాలి. 2018లో చేపట్టిన నియామకాలనూ పునఃసమీక్షించాలి. 2018, 2023 నియామకాలపై సిట్టింగ్ జడ్జితో విచారణ చేపట్టాలి.
ఎస్సీ, ఎస్టీ, బీసీ బ్యాక్‌లాగ్ పోస్టుల సంఖ్యను తేల్చాలి.
హారిజంటల్ రోస్టర్ సిస్టమ్‌ను అమలు చేయాలి.
కొత్త చట్టాన్ని అమలులోకి తీసుకొచ్చి... ఖాళీగా ఉన్న అధ్యాపకుల పోస్టులను భర్తీ చేయాలి.
యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్‌గా సీనియర్ ఐఏఎస్ అధికారిని నియమించాలి.
Updated Date - Dec 26 , 2023 | 01:30 AM