పశువైద్యం.. దైవాధీనం!
ABN, Publish Date - Dec 26 , 2023 | 11:08 PM
జిల్లాలో మూగజీవాలకు పశువైద్యం అందని ద్రాక్షలా మారింది. పశువైద్యశాలల్లో సిబ్బంది కొరతతో పాటు సరిపడా వసతులు లేక పశువులకు సరైన వైద్యం అందడం లేదు. పశువైద్యశాలల్లో గడిచిన పదేళ్ల కాలంగా ఖాళీ పోస్టులు భర్తీకి నోచుకోకపోవడం లేదు. దీంతో మూగజీవాలకు సరైన వైద్యం అందక మృత్యువాత పడుతున్నాయి. కొత్తగా ఇటీవలే కొలువు దీరిన కాంగ్రెస్ ప్రభుత్వంపై కోటి ఆశలు పెట్టుకున్నారు. ఈ సారైనా పశుసంవర్ధక శాఖలో ఫోస్టుల భర్తీకి మోక్షం కలగక పోదా అని పాడి రైతులు కోటి ఆశలతో ఎదురు చూస్తున్నారు.
పదేళ్లుగా భర్తీకాని వైద్య సిబ్బంది పోస్టులు
వైద్య సిబ్బంది కొరతతో మూగ జీవాలకందని వైద్యం
ప్రైవేట్ వైద్యులను ఆశ్రయిస్తున్న పశు పోషకులు
జిల్లాలో ఖాళీగా దర్శనమిస్తున్న 105 పోస్టులు
కొత్త ప్రభుత్వంలోనైనా ఖాళీగా ఉన్న వైద్య సిబ్బంది భర్తీ అయ్యేనా?
కోటి ఆశలతో ఎదరు చూస్తున్న పాడి రైతులు
జిల్లాలో మూగజీవాలకు పశువైద్యం అందని ద్రాక్షలా మారింది. పశువైద్యశాలల్లో సిబ్బంది కొరతతో పాటు సరిపడా వసతులు లేక పశువులకు సరైన వైద్యం అందడం లేదు. పశువైద్యశాలల్లో గడిచిన పదేళ్ల కాలంగా ఖాళీ పోస్టులు భర్తీకి నోచుకోకపోవడం లేదు. దీంతో మూగజీవాలకు సరైన వైద్యం అందక మృత్యువాత పడుతున్నాయి. కొత్తగా ఇటీవలే కొలువు దీరిన కాంగ్రెస్ ప్రభుత్వంపై కోటి ఆశలు పెట్టుకున్నారు. ఈ సారైనా పశుసంవర్ధక శాఖలో ఫోస్టుల భర్తీకి మోక్షం కలగక పోదా అని పాడి రైతులు కోటి ఆశలతో ఎదురు చూస్తున్నారు.
ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి అర్బన్, డిసెంబరు 26 : రైతులకు పాడి, పంట రెండు కళ్లలాంటివి. వ్యవసాయంలో చేదోడు వాదోడుగా ఉండే పశువులను కంటికి రెప్పలా కాపాడుకుంటారు. రైతులు ప్రాణం కన్న ఎక్కువగా ఆశలు పెట్టుకుని కన్న కొడుకులా సాదుకునే పాడి పశువులకు రోగం వస్తే చికిత్స చేసే దిక్కే లేదు. వేల రూపాయలు పెట్టి కొనుగోలు చేసిన పశువులకు సరైన వైద్యం అందక మృత్యువాత పడుతుండడంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. సీజనల్ వ్యాధుల ప్రబలి పశువులు మృతి చెందుతున్నా పట్టించుకునే పరిస్థితి లేదు. జిల్లాలోని వివిధ మండలాల్లో పశువైద్యం, పశువుల పరిస్థితి, వ్యాధుల పరిస్థితి అధ్వానంగా మారుతోంది. ఏటా వర్షాల సమయంలో పశువులు, గొర్రెలు, మేకలు, ఇతర జంతువులు వ్యాధుల బారిన పడుతున్నాయి. పశువులకు జబ్బు చేసినప్పుడు తగినంత మంది సిబ్బంది లేకపోవడంతో సకాలంలో వైద్యం అందటం లేదు. పశు వైద్యశాలల్లో సిబ్బందితో పాటు మందుల కొరత, ఆధునిక పరికరాలు లేకపోవడంతో మూగజీవాల పోషకులు ప్రైవేట్ ఆసుపత్రుల బాట పడుతున్నారు. ఈ పరిస్థితి షాద్‌నగర్ నియోజకవర్గంలోని కేశంపేట, చౌదరిగూడ, కొందుర్గు, యాచారం, చేవెళ్ల, షాబాద్, మొయినాబాద్ మండలాల్లో ఎక్కవగా కనిపిస్తోంది.
మూతబడిన పశు వైద్య కేంద్రాలు...
వైద్య సిబ్బంది లేకపోవడంతో వైద్య కేంద్రాలు ఒక్కోటిగా మూత పడుతున్నాయి. చేవెళ్ల మండలంలోని కౌకుంట్ల, కమ్మెట, ఖానాపూర్, చెన్‌వెల్లి, గుండాల, ముడిమ్యాల గ్రామాల్లో పశువైద్య కేంద్రాలు మూత పడ్డాయి. ఏడు సంవత్సరాలుగా వీటిల్లో లైవ్‌స్టాక్ అసిస్టెంట్లు, వెటర్నరీ లైవ్‌స్టాక్ అధికారుల పోస్టులు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. చేవెళ్ల మండలంలోని ఆరు అటెండర్ పోస్టులు భర్తీకి నోచుకోవడం లేదు. అటెండర్లు రిటైర్డ్ అవున్నారు.. కానీ.. తిరిగి ఆ పోస్టులు భర్తీ కావడం లేదు. ప్రస్తుతం కొన్నిచోట్ల ఔట్ సోర్సింగ్ విధానంలో తీసుకుని పని చేయించుకుంటున్నారు.
అసాంఘిక కార్యక్రమాలకు నిలయాలుగా..
ఎనిమిదేళ్ల క్రితం చేవెళ్ల మండల కేంద్రంలో మిషన్ భగీరథ నీటి కోసం పైపులు వేశారు. నీటి పైపులు వేసేందుకు కాలువ తవ్వారు. ఈ తవ్వకాల్లో పశుసంవర్ధకశాఖ కార్యాలయ ప్రహరీ కూలి పోయింది. తిరిగి మరమ్మత్తు చేయిస్తామని మిషన్ భగీరథ అధికారులు అప్పట్లో ఒప్పుకున్నారు. కానీ.. మరమ్మత్తులు చేపట్టలేదు. పశుసంవర్ధక శాఖ పరిధిలో పాత భవనాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. అందులో కొందరు పోకిరీలు పుల్లుగా తాగి బీరు సీసాలు అందులో పడేస్తున్నారు. అంతే కాకుండా అసాంఘిక కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు.
డివిజన్స్ ఎత్తేశారు..!
చేవెళ్ల మండల కేంద్రంలో పశుసంవర్ధకశాఖ ఏడీ కార్యాలయం ఉండేది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన కొన్నాళ్లకే డివిజన్స్ ఎత్తేయడంతో చేవెళ్లలోని ఏడీ కార్యాలయాన్ని వికారాబాద్‌కు తరలించారు. లక్షల రూపాయలు వెచ్చించి నిర్మించిన భవనాలన్నీ నిరుపయోగంగా మారాయి. దీంతో ఎస్టీవో కార్యాలయానికి పక్కా భవనం లేకపోవడంతో పశువైద్య భవనంలోకి షిప్టు చేశారు. చేవెళ్ల పార్లమెంట్ హెడ్‌క్వార్టర్‌లో ఉండాల్సిన ఏడీ కార్యాలయం ఇతర ప్రాంతానికి తరలించినా.. పాలకులు చూస్తున్నారే తప్ప పట్టించుకోలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
హెచ్‌ఆర్‌ఏ ప్లేసులోనే పశు వైద్య సిబ్బంది
హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో పశువైద్యులు పని చేసేందుకు మక్కువ చూపుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పని చేసేందుకు ముందుకు రావడం లేదు. ఇందుకు ప్రధాన కారణం హెచ్‌ఆర్‌ఏ ప్లేసుల్లో ఎక్కడా కూడా వైద్య సిబ్బంది కొరత లేదు. మొయినాబాద్ మండలం కనకమామిడి నగర శివారుకు దగ్గరగా ఉన్నప్పటికీ.. గ్రామీణ ప్రాంతం ఉండటంతో అక్కడ హెచ్‌ఆర్‌ఏ రాదు. దీంతో అక్కడ పని చేసేందుకు వైద్య సిబ్బంది అయిష్టత చూపుతున్నారు.
జిల్లాలో పశు సంపద వివరాలు
పశువులు 1,88,182
గేదేజాతి పశువులు 1,22,857
గొర్రెలు 5,78,254
మేకలు 1,88,190
కోళ్లు 1,78,09,207
-------------------------------------------
పశువైద్యశాలల వివరాలు..
ప్రాంత పశు వైద్యశాలలు : 04
పశువైద్య కేంద్రాలు : 46
గ్రామీణ పశు వైద్య కేంద్రాలు : 87
---------------------------------------------------------
పశువైద్య సిబ్బంది వివరాలు..
సిబ్బంది ఉండాల్సింది ఉన్నది ఖాళీలు
జిల్లా పశువైద్యాధికారి 01 01 00
సహాయ సంచాలకులు 06 06 00
పశువైద్య సహాయ శస్త్ర చికిత్సకులు 48 45 03
వెటర్నరీ లైవ్‌స్టాక్ ఆఫీసర్ 16 16 00
జూనియర్ వెటర్నరీ ఆఫీసర్ 31 31 00
లైవ్‌స్టాక్ అసిస్టెంట్ 53 16 37
వెటర్నరీ అసిస్టెంట్ 37 34 03
ఆఫీస్ సబార్డినేటర్స్ 117 55 62
మొత్తం 309 204 105
రెండేళ్ల నుంచి డాక్టర్ లేడు
రెండేళ్ల నుంచి ఎవరు రావడం లేదు. అంతకు ముందున్న డాక్టర్ కూడా అందుబాటులో లేదు. కుమ్మర, రావులపల్లి, ముడిమ్యాల గ్రామాలకు పశు వైద్యుడు లేడు. పశువులు సుస్తి చేస్తే చేవెళ్ల తీసుకు వెళుతున్నాం. ఇటీవలే దూడ పిల్లకు కుక్క కరిస్తే డాక్టర్ లేక ఇబ్బంది పడ్డాం. ప్రస్తుతం ఉన్న చోట కూడా సమయానికి వైద్యులు ఉండటం లేదు.
జగన్, పాడిరైతు, ముడిమ్యాల
Updated Date - Dec 26 , 2023 | 11:08 PM