KTR : మూడు నెలల్లో అట్టర్‌ఫ్లాప్
ABN, Publish Date - Dec 17 , 2023 | 03:55 AM
మూడు నెలల సమయంలోనే కాంగ్రెస్ పాలన అంతా అట్టర్ ఫ్లాప్ అవుతుందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ చెప్పారు.
50 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో అంతా విధ్వంసమే
కరువు, ఆకలిచావులు, వలసలే కనిపించాయి
గవర్నర్ ప్రసంగం అసత్యాలు, తప్పుల తడక
‘కరెంటు’ అప్పులే చెప్పారుగానీ.. ఆస్తులు చెప్పలే
అప్పుల నెపంతో ‘గృహజ్యోతి’ని ఎగ్గొడతారా?
శ్వేతపత్రాలను కొత్తగా ప్రకటిస్తే..
కొండను తవ్వి ఎలుకను పట్టే పరిస్థితీ ఉండదు
నియంతృత్వంపై మాట్లాడడం మిలీనియం జోక్
విదేశీ వ్యక్తికి అధ్యక్ష బాధ్యతలు అప్పగించిన వారు
ఎన్నారైల గురించి మాట్లాడమేమిటి?
ముఖ్యమంత్రి అయినాకైనా మర్యాదగా
మాట్లాడతారనుకున్నా.. కానీ మారరని తేలింది
చీమలు పెట్టిన పుట్టలో దూరిన పాము ఆయన
పంటల బీమా, రైతుబీమాకు తేడా తెలియని వ్యక్తి
సీఎం అయినందుకు ప్రజలు సిగ్గు పడుతున్నారు
నాది మేనేజ్‌మెంట్ కోటా అయితే,
ఆయనది పేమెంట్ కోటా: అసెంబ్లీలో కేటీఆర్
హైదరాబాద్, డిసెంబరు 16 (ఆంధ్రజ్యోతి): మూడు నెలల సమయంలోనే కాంగ్రెస్ పాలన అంతా అట్టర్ ఫ్లాప్ అవుతుందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ చెప్పారు. 50 ఏళ్ల కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలో అంతా విధ్వంసమే జరిగిందన్నారు. కరువు, ఆకలిచావులు, వలసలే కనిపించాయని పేర్కొన్నారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై శనివారం శాసనసభలో కేటీఆర్ మాట్లాడారు. గవర్నర్ ప్రసంగమంతా అసత్యాలతో, తప్పుల తడకగా ఉందన్నారు. ఇలాంటి ప్రసంగం వినడానికి సభలో ఉన్నందుకు ఒక సభ్యుడిగా సిగ్గు పడుతున్నానని, ఇంతటి దారుణమైన, అపసవ్యపు ప్రసంగం శాసనసభ చరిత్రలో ఎన్నడూ లేదని చెప్పారు. చేయాల్సిన దారుణాలు, ఘాతుకాలన్నీ కాంగ్రెస్ చేసి, నెపాన్ని పదేళ్లు నడిపిన తమ పార్టీపై నెట్టే ప్రయత్నం చేసిందన్నారు. గవర్నర్ దారుణమైన ప్రసంగాన్ని చూసిన తర్వాత రాబోయే ఐదేళ్లలో ప్రభుత్వ పాలన ఎలా ఉండబోతుందో తమకు, ప్రజలకు అర్థమైందన్నారు. ‘విద్యుత్ సంస్థల అప్పుల లెక్కలు చెప్పారు. కానీ కేసీఆర్ ప్రభుత్వం సృష్టించిన ఆస్తుల విలువ చెప్పలేదు. అప్పుల గురించి చెప్పి కాంగ్రెస్ ప్రకటించిన గృహజ్యోతి గ్యారెంటీని ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఆనాడు కరెంటు లోటు, అప్పులతో మాకు విద్యుత్ సంస్థలను అప్పజెప్పారు. ఎంతో కష్టపడి ట్రాన్స్‌కో, జెన్‌కో ఆస్తులను పెంచాం. 81 వేల కోట్ల అప్పులున్నాయన్నారు. కానీ, రూ.1,37,571 కోట్లకుపైగా మేం కూడబెట్టిన విద్యుత్ ఆస్తుల గురించి చెప్పడం లేదు. సబ్‌స్టేషన్ల సంఖ్య పెంచాం. విద్యుత్ రంగం గురించి శ్వేతపత్రం ప్రకటిస్తామని అంటున్నారు. కొత్తగా ప్రకటించాల్సిందేమీ లేదు. అన్ని శాఖల శ్వేతపత్రాలు మేం ప్రకటించాం’ అని కేటీఆర్ పేర్కొన్నారు.
ప్రధాన ప్రతిపక్షంగా బరాబర్ లెక్కలను, కాంగ్రెస్ దురాగతాలను చెబుతామన్నారు. పడావుబడిన భూములు, పాడుబడిన ఇళ్లు, ఆకలి కేకలు, ఆత్మహత్యలు, వలసలు, కరువులు, కర్ఫ్యూలు, ఎన్‌కౌంటర్లు, కరెంటు కోతలు, కటిక చీకట్లు, నెర్రెలు బారిన నేలలు, నెత్తురుగారిన నేలలు... ఇదే కదా ఆనాటి మీ ఘనత వహించిన ప్రభుత్వంలో చూపెట్టిన అద్భుతాలు అని అన్నారు. రేవంత్‌రెడ్డి నియోజకవర్గంలో ప్రతి రోజూ రెండు బస్సులు ముంబైకి పోతుండేవని చెప్పారు. పరిశ్రమలకు వారానికి రెండు రోజులు పవర్ హాలీడేలు, సబ్‌స్టేషన్ల ముందు ధర్నాలు, ఇదే నాటి పరిస్థితి అని ఎద్దేవా చేశారు. అప్పట్లో విద్యుత్, ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న రోశయ్య ఏడాదిన్నరలో కరెంటు సమస్యను పరిష్కరించకపోతే ఉరేసుకుంటానని, సభకు బ్యాగులో ఉరితాడు కూడా తెచ్చుకున్నారని గుర్తు చేశారు. దీనిపై స్పీకర్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ, దివంగత రోశయ్య గురించి ఇప్పుడు ప్రస్తావించటం సబబు కాదన్నారు. కాంగ్రెస్ పాలనలో రైతుల ఇంటిపేరే మారిపోయిందని, రాంరెడ్డి అనే రైతు 54 బోర్లు వేయటంతో ఆయన ఇంటిపేరు బోర్ల రాంరెడ్డిగా మారిపోయిందన్నారు. గవర్నర్ ప్రసంగంలో పౌరసరఫరాల శాఖలో అప్పులున్నాయని అసత్యాలు చెప్పారని కేటీఆర్ ఆరోపించారు. రాష్ట్రం దివాలా తీసిందన్నారని, అయితే, ఆ ప్రసంగమే దివాలా రాజకీయ ప్రసంగమని విమర్శించారు.. రైతుల, నిరుద్యోగుల ఆత్మహత్యలు తెలంగాణలో తగ్గాయని.. ఇది తాము చెబుతున్నది కాదని ఎన్‌సీఆర్‌బీ నివేదికలో ఈ విషయం వెల్లడైందన్నారు. కొత్త సచివాలయం, ప్రగతి భవన్, ప్రతి జిల్లాలో కొత్త భవనాలు, కొత్త మెడికల్ కాలేజీలు, ప్రభుత్వ ఆస్పత్రులు నిర్మించామని వివరించారు. గవర్నర్ ప్రసంగంలో పౌరహక్కులు, నియంతృత్వం, నిర్భంధం గురించి మాట్లాడటం జోక్ ఆఫ్ ది మిలీనియం అని కేటీఆర్ పేర్కొన్నారు. చర్చల కోసం నక్సలైట్లను పిలిచి కాల్చి చంపింది మీరు కాదా? వెయ్యి ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రలకు బయలుదేరినట్లు ఇప్పుడు నీతి మాటలు మాట్లాడితే సరిపోదని విమర్శించారు.
మంత్రులకు అంత ఉలికిపాటు ఎందుకు?
తమపై ఆరోపణలు చేస్తుండటంతో కేటీఆర్ ప్రసంగానికి కాంగ్రెస్ సభ్యులు, మంత్రులు అడ్డుతగిలారు. 2014 వరకు తెలంగాణ ప్రాంతానికి అన్యాయం జరిగిందనే కొట్లాడి ప్రత్యేక రాష్ట్రం తెచ్చుకున్నామని, విభజన తర్వాత ఏం చేశారో చెప్పమంటున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రశ్నించారు. తిరిగి తన ప్రసంగాన్ని ప్రారంభించిన కేటీఆర్.. కాంగ్రెస్ గత పాలన గురించి మాట్లాడటం ప్రారంభించారు. దీంతో మళ్లీ భట్టి లేచి.. ప్రస్తుతం ప్రభుత్వం మారిందని, ప్రజాస్వామ్యయుతంగా ప్రభుత్వాన్ని నడుపుతున్నామన్నారు. తొలిరోజే కేటీఆర్ దాడి చేయటం సరికాదన్నారు. తిరిగి తన ప్రసంగాన్ని ప్రారంభించిన కేటీఆర్.. మంత్రులందరికీ అంత ఉలికిపాటు ఎందుకన్నారు. పదేళ్ల తమ పాలనను విధ్వంసమంటే... 50 ఏళ్ల కాంగ్రెస్ పాలనను ఏమనాలని ప్రశ్నించారు. కల్పించుకున్న భట్టి.. తెలంగాణ మిగులు బడ్జెట్ రాష్ట్రాన్ని అప్పులకుప్పగా మార్చారని, స్వేచ్ఛ లేకుండా చేశారని విమర్శించారు. కేటీఆర్ స్పందిస్తూ.. గొంతు పెంచి, దాడి చేసి, గావు కేకలు పెడితే ఎలా.. అధికార పక్షానికి ఇంతటి ఆవేశం పనికిరాదన్నారు. కాంగ్రె్‌సకు 64 మంది సభ్యులుంటే...తాము 39 మంది ఉన్నామని వ్యాఖ్యానించారు.
ఎన్నారైలకు టికెట్లు అమ్ముకున్నారు
వంద కోట్ల జనాభాను కాదని బయటి దేశం నుంచి వచ్చిన వారిని పార్టీ జాతీయ అధ్యక్షులుగా పెట్టుకున్న కాంగ్రెస్ పార్టీ ఎన్నారైల గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని కేటీఆర్ అన్నారు. ఎన్నారై అంటే నాన్ రిలయబుల్ ఇండియన్స్ అన్నారని, దీన్నిబట్టి కాంగ్రెస్ పార్టీకి ఎన్నారైలపై ఉన్న ప్రేమ ఏమిటో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఎన్నారైలు గుర్తించాలన్నారు. ఎన్నారైలకు టికెట్లు అమ్ముకున్నదెవరో అందరికీ తెలుసన్నారు. సీఎం రేవంత్‌పై విమర్శలు చేస్తూ.. ‘సీఎం అయిన తర్వాతైనా మర్యాదగా మాట్లాడతారనుకున్నా. కొంత మందికి అది సాధ్యం కాదు. తెలంగాణ తెచ్చిన నాయకుడ్ని పట్టుకుని కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అని ఏక వచనంతో మాట్లాడారు. తెలంగాణను వ్యతిరేకించిన వారిని గారు... అని సంబోధించినప్పుడే సంస్కారం అర్థమైంది. అచ్చోసిన ఆంబోతు అని కూడా అన్నారు. మా భట్టి అన్న, మా శ్రీధరన్న, మా దామోదరన్న, మా ప్రభాకరన్న, మా ఉత్తమన్న, మా కోమటిరెడ్డి వెంట్‌రెడ్డి అన్న.. వీరందరు కలిసి పెట్టిన కాంగ్రెస్ పార్టీలో దూరి ముఖ్యమంత్రి పదవి తీసుకున్న వ్యక్తి చీమలు పెట్టిన పుట్టలో పాముల గురించి మాట్లాడితే చాలా చెండాలంగా ఉంటుంది’ అని కేటీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రి కాదని, ఢిల్లీ నామినేట్ చేసిన ముఖ్యమంత్రి అని విమర్శించారు. కేటీఆర్‌ది మేనేజ్‌మెంట్ కోటా అని సీఎం రేవంత్ ఎద్దేవా చేయటంపై స్పందిస్తూ.. ‘నాది మేనేజ్‌మెంట్ కోటా అయితే, ఆయనది పేమెంట్ కోటా. పీసీసీ అధ్యక్ష పదవిని ఢిల్లీలో డబ్బులు పోసి కొన్నాడని కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డే గతంలో చెప్పారు. పంటబీమాకు రైతుబీమాకు తేడా తెలియని వ్యక్తి సీఎం అయినందుకు తెలంగాణ ప్రజలు సిగ్గు పడుతున్నారు’ అని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఐటీఐఆర్ అంటే ఎవరికీ తెలియదు
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వె్‌స్టమెంట్ రీజన్ (ఐటీఐఆర్) వచ్చి ఉంటే ఏదో జరిగేదంటూ గవర్నర్ ప్రసంగంలో చెప్పించారని, అసలు ఐటీఐఆర్ అంటే ఏమిటో కాంగ్రెస్ పార్టీలో ఏ ఒక్కరికీ తెలియదని కేటీఆర్ ఆరోపించారు. ఐటీఐఆర్‌లో 2035 నాటికి ఐటీ ఎగుమతులు రూ.2 లక్షల 9 వేల కోట్లకు చేరుకుంటాయని ఉమ్మడి రాష్ట్రంలో చెప్పారని, కానీ, కేసీఆర్ ప్రభుత్వం 2022-23 నాటికేఐటీ ఎగుమతుల్ని రూ.2 లక్షల 41 వేల కోట్లకు చేర్చిందన్నారు. ఐటీఐఆర్‌ను ఇవ్వకపోయినా ఆ టార్గెట్ చేరుకున్నామని చెప్పారు. ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ ఇచ్చిన గ్యారెంటీలను ప్రస్తావిస్తూ కేటీఆర్ విమర్శలు గుప్పించారు. ‘మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణంలో సూపర్ లగ్జరీ బస్సు కూడా ఫ్రీ అన్నారు. కానీ, ఇప్పుడు ఆర్డినరీ, ఎక్స్‌ప్రె్‌సలకే పరిమితం చేశారు. మహిళలకు నెలకు రూ.2500 ఇస్తామన్నారని కోటిన్నర మంది ఆడబిడ్డలు ఎదురుచూస్తున్నారు. వంద రోజుల్లో హామీలు అమలు చేస్తామన్నారు. మార్చి 17తో వంద రోజులు ముగుస్తుంది. ఇప్పటి నుంచే కౌంట్‌డౌన్ మొదలైంది. ఆరోగ్యశ్రీ కింద రూ.10 లక్షల చికిత్సను మేం అమలు చేసి సంవత్సరం అవుతోంది. మీరు రెండు గ్యారెంటీల్లో అమలు చేసింది పావలా వంతు కూడా కాదు. ప్రతి సోమవారం కలెక్టర్ కార్యాలయాల్లో ప్రజావాణి కొనసాగుతోంది. ఇప్పుడు దానిని ప్రారంభించడమేంటి? ఇనుప కంచెలు తొలగించామంటున్నారు. 2012లో వాళ్లే కంచెలేసి 2023లో వాళ్లే తీశారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు’ అని కేటీఆర్ చెప్పారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే మొట్టమొదటి క్యాబినెట్ సమావేశంలోనే ఆరు గ్యారెంటీలకు చట్టబద్ధత కల్పిస్తామని రాహుల్‌గాంధీ చెప్పారని, ఇప్పటికి మూడు క్యాబినెట్ సమావేశాలు ముగిశాయని ఏం చేశారో చెప్పాలన్నారు. మెగా డీఎస్సీ వేస్తామన్నారని, ఎంబీసీలకు ప్రత్యేక మంత్రిత్వశాఖను ఏర్పాటు చేస్తామన్నారని, కానీ, ఇప్పటి వరకు కదలిక లేదని విమర్శించారు. ‘మైనార్టీలకు, బీసీలకు సబ్‌ప్లాన్ తెస్తామన్నారు. ఆటోడ్రైవర్లకు నెలకు రూ. 1200 ఇస్తామన్నారు. మొదటి ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలిస్తామన్నారు. హామీలు ఒకటి రెండు కాదు చాలా చెప్పారు. వాటిని నిలబెట్టుకోవాలి’ అని ప్రభుత్వాన్ని కేటీఆర్ డిమాండ్ చేశారు.
Updated Date - Dec 17 , 2023 | 04:05 AM