ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

TSPSC Groups : గ్రూప్స్‌ గజిబిజి!

ABN, Publish Date - Dec 26 , 2023 | 01:32 AM

తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(టీఎ్‌సపీఎస్సీ) పరీక్షల నిర్వహణ, పలు పరీక్షల తేదీల ప్రకటన, ఇప్పటికే పూర్తైన పరీక్షల ఫలితాలపై నిరుద్యోగులు ఎదురుతెన్నులు కాస్తున్నారు. గత ఏడాది వరుస నోటిఫికేషన్లు విడుదలైనా.. ఈ ఏడాది ఆరంభంలో

టీఎస్‌పీఎస్సీ పరీక్షలు, ఫలితాల కోసం నిరుద్యోగుల ఎదురుచూపులు..!

10 రోజుల్లో గ్రూపు-2 పరీక్షలు.. ఏర్పాట్లు చేయని వైనం

మళ్లీ వాయిదా పడే చాన్స్‌.. నిలిచిన కమిషన్‌ కార్యకలాపాలు

రాజీనామాలు, పలు పోస్టుల పరీక్షల ఫలితాలు పెండింగ్‌లోనే

హైదరాబాద్‌, డిసెంబరు 25 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(టీఎ్‌సపీఎస్సీ) పరీక్షల నిర్వహణ, పలు పరీక్షల తేదీల ప్రకటన, ఇప్పటికే పూర్తైన పరీక్షల ఫలితాలపై నిరుద్యోగులు ఎదురుతెన్నులు కాస్తున్నారు. గత ఏడాది వరుస నోటిఫికేషన్లు విడుదలైనా.. ఈ ఏడాది ఆరంభంలో ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారం వెలుగులోకి రావడంతో పలు పరీక్షలు రద్దయిన విషయం తెలిసిందే..! మరికొన్ని పరీక్షల తేదీలను రీషెడ్యూల్‌ చేశారు. అయినా.. నియామకాల ప్రక్రియ డోలాయమానంగా సాగింది. అప్పట్లో నిరుద్యోగులకు అండగా ఉండి.. పోరాటాల్లో పాల్గొన్న కాంగ్రెస్‌ పార్టీ ఇప్పుడు అధికారంలోకి వచ్చింది. ప్రభుత్వ మార్పులో నిరుద్యోగుల భాగస్వామ్యం కూడా కీలకమే..! సీఎం రేవంత్‌రెడ్డి వరుస సమీక్షలతో పాలనను ఉరుకులు-పరుగులు పెట్టిస్తున్నా.. టీఎ్‌సపీఎస్సీ విషయంలో త్వరితగతిన నిర్ణయాలు తీసుకోవాలని నిరుద్యోగులు కోరుతున్నారు. గ్రూప్‌-2 పరీక్షకు పట్టుమని పదిరోజుల వ్యవధి మాత్రమే ఉండడంతో.. షెడ్యూల్‌ ప్రకారమే జరుగుతుందా? లేక తొలుత ప్రకటించిన జాబ్‌ క్యాలెండర్‌నే కాంగ్రెస్‌ సర్కారు అనుసరిస్తుందా? అనేదానిపై స్పష్టత లేదు. ఒకవేళ జాబ్‌ క్యాలెండర్‌ మేరకు సర్కారు ముందుకెళ్తే.. ఫిబ్రవరి దాకా ఆగాల్సిందే..! ఆలోగా లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ వస్తే.. మళ్లీ కథ మొదటికే అని నిరుద్యోగులు ఆవేదన చెందుతున్నారు.

కోర్టులో గ్రూపు-1 అభ్యర్థుల భవిత..!

గ్రూపు-1 పోస్టుల అభ్యర్థుల భవిత కోర్టు నిర్ణయంపై ఆధారపడి ఉంది. 503 గ్రూపు-1 పోస్టుల కోసం మొదటిసారి 2022 అక్టోబరు 16న నిర్వహించిన ప్రిలిమ్స్‌ను ప్రశ్నపత్రాల లీకేజీ కారణంగా రద్దు చేశారు. ఈ ఏడాది జూన్‌లో రెండో సారి ప్రిలిమ్స్‌ను నిర్వహించినా.. పరీక్షల నిర్వహణలో లోపాలుండడంతో పలువురు అభ్యర్థులు హైకోర్టుకెక్కారు. అధికారులు పొరపాట్లు చేశారని నిర్ధారించిన కోర్టు.. పరీక్షను రద్దుచేసింది. దాంతో ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఆ కేసు విచారణకు రావాల్సి ఉంది. సుప్రీంకోర్టు తీర్పును బట్టి గ్రూపు-1 పరీక్ష ఉంటుందా? రద్దవుతుందా? అనేది తేలుతుంది.

గ్రూపు-2 ఏర్పాట్లకు సమయమేది?

షెడ్యూల్‌ ప్రకారం.. ఆగస్టు 29, 30 తేదీల్లో జరగాల్సిన గ్రూప్‌-2 పరీక్షలను లీకేజీ తర్వాత నిరుద్యోగుల ఆందోళనతో నవంబరు 2, 3 తేదీలకు వాయిదా వేశారు. అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ వెలువడడం.. నవంబరు 3 నుంచి నామినేషన్ల ప్రక్రియ కారణంగా పరీక్షలకు బందోబస్తు కుదరదని పోలీసుశాఖ పరోక్షంగా తేల్చిచెప్పడంతో ఆ పరీక్షలు జనవరి 6, 7 తేదీలకు వాయిదా పడ్డ విషయం తెలిసిందే. 783 గ్రూప్‌-2 పోస్టుల భర్తీకి నియామకాలు చేపట్టగా.. 5.51లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. తాజా తేదీలకు తిప్పికొడితే 10రోజుల వ్యవధే ఉంది. ప్రశ్నపత్రాల తయారీ విషయాన్ని పక్కనపెడితే.. పరీక్ష కేంద్రాల ఎంపిక, హాల్‌టికెట్ల జారీకి కూడా సమయం పెద్దగా లేదు. దీంతో.. ఆ పరీక్ష మళ్లీ వాయిదా పడే సూచనలు కనిపిస్తున్నాయి.

పత్తా లేని గ్రూపు-3.. గ్రూప్‌-4 ఫలితాలెప్పుడు?

1,363 గ్రూపు-3 పోస్టుల నియామకానికి గత ఏడాది నోటిఫికేషన్‌ విడుదలైనా.. ఇప్పటికీ పరీక్షలను ప్రకటించలేదు. ఈ పోస్టులకు 5.8 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఇక లీకేజీ కారణంగా డివిజనల్‌ అకౌంట్స్‌ అధికారి(డీఏవో) పరీక్షలు రద్దయినా.. తదుపరి పరీక్షల తేదీని ప్రకటించలేదు. ఇక, 8,039 గ్రూప్‌-4 పోస్టుల కోసం పరీక్షలను నిర్వహించారు. గ్రూప్‌-1 మాదిరిగా తప్పులు చేయకుండా.. నిర్వహణలో లోటుపాట్లు లేకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకున్నారు. ఫైనల్‌ కీని కూడా ప్రకటించారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఫలితాల విడుదలను టీఎ్‌సపీఎస్సీ వాయిదా వేసింది. అయితే.. ఈనెల 10న ఫలితాలను విడుదల చేస్తామంటూ తొలుత ప్రకటన వెలువడ్డా.. ఆ దిశగా చర్యలు తీసుకోలేదు. మహిళా రిజర్వేషన్‌కు సంబంధించి కోర్టులో కేసు కొనసాగుతుండడమే ఇందుకు కారణమని తెలుస్తోంది.

పెండింగ్‌లోనే మరికొన్ని..

మరికొన్ని పోస్టుల విషయంలోనూ ఫలితాలు పెండింగ్‌లోనే ఉన్నాయి. లైబ్రేరియన్‌ (71), డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్‌ (18), జూనియర్‌ లెక్చరర్లు(1,392), అసిస్టెంట్‌ ఇంజనీర్‌(833), వెటర్నరీ సర్జన్లు(185), టౌన్‌ప్లానింగ్‌ బిల్డింగ్‌ ఓవర్‌సీర్‌(175), ఉద్యాన అధికారులు(22), అకౌంట్స్‌ ఆఫీసర్స్‌, పాలిటెక్నికల్‌ లెక్చరర్లు, భూగర్భ అధికారులు, ఏఎంవీఐ, వ్యవసాయ అధికారుల పోస్టుల భర్తీకి పరీక్షలను నిర్వహించినా.. ఫలితాలను పెండింగ్‌లో పెట్టారు.

గవర్నర్‌ ఆమోదించకపోతే.. ప్రత్యామ్నాయమేంటి!

టీఎ్‌సపీఎస్సీ చైర్మన్‌ బి.జనార్దన్‌రెడ్డి, సభ్యులు లింగారెడ్డి, కారెం రవీందర్‌రెడ్డి, ఆర్‌.సత్యనారాయణ రాజీనామాను గవర్నర్‌ ఇంకా ఆమోదించలేదు. కోట్ల అరుణకుమారి, సుమిత్ర ఆనంద్‌ మాత్రం సభ్యులుగా కొనసాగుతున్నారు. రాజీనామాలు ఆమోదం పొందకపోవడంతో కమిషన్‌ మనుగడలో ఉన్నట్లా..? లేనట్లా..? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. గవర్నర్‌ మరికొంతకాలం రాజీనామాలను పెండింగ్‌లో పెడితే పరిస్థితి ఏమిటనే ప్రశ్న తలెత్తుతోంది. గవర్నర్‌ నిర్ణయం తీసుకునేవరకు టీఎ్‌సపీఎస్సీ కార్యకలాపాలు స్తంభించిపోతాయా? అనే చర్చ జరుగుతోంది. గవర్నర్‌ ఆ రాజీనామాలను పెండింగ్‌లోనే పెడితే.. ప్రభుత్వం ముందు ప్రత్యామ్నాయం ఉందని నిపుణులు చెబుతున్నారు. టీఎ్‌సపీఎస్సీలో చైర్మన్‌ సహా.. మొత్తం 11 మంది సభ్యులు ఉండాలి. చైర్మన్‌, ముగ్గురు సభ్యులు రాజీనామా చేయగా.. ఇద్దరు సభ్యులు కొనసాగుతున్నారు. మరో ఐదు పదవులు ఖాళీగానే ఉన్నాయి. ఈ ఐదు పదవులను భర్తీ చేసి.. వారిలో ఒకరిని ఇన్‌చార్జి చైర్మన్‌గా నియమించవచ్చని నిపుణులు వివరిస్తున్నారు. ఇలా చేయడం వల్ల ఉద్యోగాల భర్తీ ప్రక్రియను ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉందని చెబుతున్నారు. ఆ అంశం ప్రభుత్వ నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని అభిప్రాయపడుతున్నారు.

Updated Date - Dec 26 , 2023 | 01:32 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising