వైద్య శాఖలో విభాగాధిపతుల బదిలీలు?
ABN, Publish Date - Dec 18 , 2023 | 03:18 AM
వైద్య ఆరోగ్య శాఖలో విభాగాధిపతుల బదిలీకి రంగం సిద్ధమైంది. బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో నియమితులైనవారికి కాంగ్రెస్ సర్కారు మారుస్తోంది.
ప్రభుత్వానికి చేరిన డీఎంఈ, డీహెచ్ సీనియారిటీ జాబితా
నేడో, రేపో డీఎంఈ, ఆ తర్వాత డీహెచ్‌కు స్థాన చలనం
హెల్త్ డైరెక్టర్ పోస్టు కోసం భారీఎత్తున లాబీయింగ్
హైదరాబాద్, డిసెంబరు 17(ఆంధ్రజ్యోతి): వైద్య ఆరోగ్య శాఖలో విభాగాధిపతుల బదిలీకి రంగం సిద్ధమైంది. బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో నియమితులైనవారికి కాంగ్రెస్ సర్కారు మారుస్తోంది. ఇప్పటికే వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వీ స్థానంలో డాక్టర్ క్ట్రిస్టినా జేడ్ చోంగ్తును నియమించింది. ఆర్నెల్లుగా వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ పోస్టు ఖాళీగా ఉంది. దీనిని అదనపు బాధ్యతగా రిజ్వీనే చూశారు. ప్రభుత్వం తాజాగా నల్లగొండ జిల్లా కలెక్టర్‌గా పనిచేసిన కర్ణన్‌కు అప్పగించింది. ఇప్పుడు విభాగాధితులపై దృష్టిపెట్టింది. రెండ్రోజుల క్రితం ప్రజారోగ్య సంచాలకుల పరిధిలో సీనియారిటీ జాబితాను ప్రభుత్వం తెప్పించుకుంది. అదనపు సంచాలకుల వివరాలను పంపాలని ఆదేశించగా డాక్టర్ రవీంద్రనాయక్, డాక్టర్ అమర్‌సింగ్‌నాయక్, డాక్టర్ పుష్పలీల, డాక్టర్ మోజీరాం, డాక్టర్ పద్మజ పేర్లను పంపినట్లు తెలిసింది. కాగా, వీరిలో ఇద్దరిపై గతంలో అవినీతి ఆరోపణలు వచ్చాయి. చార్జి మెమోలు కూడా ఉన్నాయి. మరొకరిపై వైద్య శాఖలో కీలక పోస్టులో ఉండగా తీవ్ర అవినీతి ఆరోపణలు వచ్చాయి. మీడియా కథనాలతో తప్పించారు. డీహెచ్ పోస్టుకు ఆయనా పోటీ పడుతున్నారు. మరొకరైతే.. ఢిల్లీ స్థాయిలో పైరవీ చేస్తున్నట్లు చెబుతున్నారు.
రెండు రోజుల్లో కొత్త డీఎంఈ
వైద్య విద్య సంచాలకులు (డీఎంఈ)గా ఒకటి రెండు రోజుల్లో కొత్తవారిని నియమించే అవకాశం ఉందని జోరుగా ప్రచారం జరుగుతోంది. డీఎంఈ రమేశ్‌రెడ్డి ఆరున్నరేళ్లుగా కొనసాగుతున్నారు. ఎన్నికల సమయంలో బీఆర్‌ఎస్ సర్కారుకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ ఈయనపై ఈసీకి కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు చేసింది. రమేశ్‌రెడ్డి ఇంచార్జి డీఎంఈగా కొనసాగడంపై కోర్టు ఽధిక్కరణ ఉత్తర్వులు కూడా ఉన్నాయి. ఇదే విషయంపై ఈ నెల 21న హాజరుకావాలని హెల్త్ సెక్రటరీ, డీఎంఈకి కోర్టు నోటీసులిచ్చింది. దీంతో తన కొనసాగింపుపై నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వానికి డీఎంఈ లేఖ రాశారు. కాగా, ఇప్పటికిప్పుడు డిపార్ట్‌మెంట్ ప్రమోషన్ కమిటీ (డీపీసీ) వేసి డీఎంఈని ఎంపిక చేయడం కష్టం. అందుకే ముందుగా ఇన్‌చార్జిని, తర్వాత పూర్తి స్థాయి డీఎంఈని నియమించే అవకాశం ఉందని వైద్యవర్గాలు వెల్లడించాయి. కోర్టు కేసు వచ్చేలోగానే కొత్తవారికి ఇంచార్జి ఇవ్వవచ్చని సమాచారం. కొత్త సర్కారు వైద్యశాఖలో అందరినీ మార్చేయాలనే యోచనలో ఉంది. అయితే, ఇలా చేస్తే ఇబ్బందులు ఎదురవుతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.
Updated Date - Dec 18 , 2023 | 03:18 AM