సింగరేణి ఎన్నికలు 27నే
ABN, Publish Date - Dec 22 , 2023 | 02:36 AM
సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు వాయిదా వేయాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన మధ్యంతర పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసింది. గతంలో ఆదేశించిన విధంగా ఈ నెల 27న యధావిధిగా ఎన్నికలు నిర్వహించాలని స్పష్టం చేసింది.
యథావిధిగా నిర్వహించాల్సిందే
వాయిదాకు హైకోర్టు నిరాకరణ
రాష్ట్ర ప్రభుత్వ పిటిషన్ కొట్టివేత
పొత్తా.. పోరాటమా?
సింగరేణి ఎన్నికలపై నేడు కాంగ్రెస్, సీపీఐ సమావేశం
హైదరాబాద్/గోదావరిఖని/కొత్తగూడెం, డిసెంబరు 21 (ఆంధ్రజ్యోతి): సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు వాయిదా వేయాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన మధ్యంతర పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసింది. గతంలో ఆదేశించిన విధంగా ఈ నెల 27న యధావిధిగా ఎన్నికలు నిర్వహించాలని స్పష్టం చేసింది. డిసెంబరు చివరి వారంలో హైకోర్టు పేర్కొన్న తేదీన కచ్చితంగా ఎన్నికలు నిర్వహిస్తామని అసెంబ్లీ ఎన్నికల ముందు అప్పటి రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చిందని గుర్తుచేసింది. దాని ప్రకారం ఎన్నికలు నిర్వహించి తీరాల్సిందేనని హైకోర్టు తేల్చి చెప్పింది. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడినందున పరిపాలనాపరమైన ఇబ్బందుల దృష్ట్యా సింగరేణి ఎన్నికల నిర్వహణకు కొంత సమయం కావాలంటూ రాష్ట్ర ప్రభుత్వం తరపున ఇంధన శాఖ కార్యదర్శి ఈ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై గురువారం చీఫ్ జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ అనిల్ కుమార్ ధర్మాసనం విచారణ చేపట్టింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అదనపు అడ్వకేట్ జనరల్ తేరా రజనీకాంత్ రెడ్డి వాదనలు వినిపించారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారినందున పోలీసు శాఖలో బదిలీలు జరుగుతున్నాయని, సింగరేణి ఎన్నికలకు బందోబస్తు కల్పించాల్సి ఉన్నందున మరికొంత సమయం ఇవ్వాలని కోరారు. వాదనలు నమోదు చేసుకున్న ధర్మాసనం... అప్పటి ఏఏజీ డిసెంబరులో నిర్వహించే సింగరేణి ఎన్నికలకు అన్ని రకాలుగా సహకరిస్తామని హైకోర్టుకు అండర్‌టేకింగ్ ఇచ్చారని పేర్కొంది.
రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఉన్న పరిస్థితులు ఇప్పుడు లేవని, ఎన్నికలు వాయిదా వేయడానికి తగిన కారణాలు ఏమీ కనిపించడం లేదని వ్యాఖ్యానించింది. హైకోర్టు ఆదేశాలతో ఎన్నికల ప్రచారంలో నిమగ్నమై ఉన్న కార్మిక సంఘాలు ఊపిరి పీల్చుకున్నాయి. కాగా, సింగరేణి ఎన్నికలపై నాలుగేళ్లుగా వివాదం కొనసాగుతోంది. 2017లో జరిగిన ఎన్నికల్లో బీఆర్‌ఎస్ అనుబంధ కార్మిక సంఘమైన టీబీజీకేఎస్ విజయం సాధించింది. రెండేళ్ల పాటు గుర్తింపు సంఘంగా కొనసాగేందుకు కేంద్ర లేబర్ కమిషనర్ డిక్లరేషన్ ఇచ్చారు. అయితే గుర్తింపు కాలపరిమితి అంతకుముందు నాలుగేళ్లు ఉందని, తమకు కూడా నాలుగేళ్లు ఇవ్వాలని టీబీజీకేఎస్ కోర్టుకు వెళ్లింది. ఆ వ్యాజ్యం కొనసాగుతుండగానే 2021 అక్టోబరులోనే నాలుగేళ్ల కాలపరిమితి ముగిసిపోయింది. కానీ కరోనా ప్రభావంతో 2022 వరకు ఎన్నికలు వాయిదా పడుతూ వచ్చాయి. ఏఐటీయూసీ హైకోర్టును ఆశ్రయించడంతో నవంబరులోపు ఎన్నికలు నిర్వహించాలని కోర్టు ఆదేశించింది. దీంతో అక్టోబరు 30న ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలై నామినేషన్ల ప్రక్రియ కూడా ముగిసింది. ఆ తరువాత అసెంబ్లీ ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడింది. సింగరేణి యాజమాన్యం, ప్రభుత్వం, కొన్ని కార్మిక సంఘాలు అసెంబ్లీ ఎన్నికల తరువాత సింగరేణి ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టును ఆశ్రయించాయి. దీంతో డిసెంబరు 27వరకు వాయిదా వేస్తూ హైకోర్టు తీర్పునిచ్చింది. కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం కూడా సింగరేణి ఎన్నికలను మార్చికి వాయిదా వేయాలని వారం రోజుల క్రితం పిటిషన్ వేసింది. హైకోర్టు తాజా ఆదేశాలతో 27న ఎన్నికలు జరగనున్నాయి.
పొత్తా.. పోరా?..నేడు కాంగ్రెస్, సీపీఐ భేటీ
జాతీయ, రాష్ట్ర స్థాయిల్లో మిత్రపక్షాలుగా ఉన్న కాంగ్రెస్, సీపీఐ.. 27న జరిగే సింగరేణి ఎన్నికల్లో అవగాహనకు రావాలా.. లేక ఎవరికి వారుగా పోటీ చేయాలా అన్నది తేల్చుకోలేకపోతున్నాయి. కాంగ్రెస్ అనుబంధ ఐఎన్‌టీయూసీ, సీపీఐ అనుబంధ ఏఐటీయూసీ మాత్రం ఎవరికి వారుగా పోటీ చేసేందుకే మొగ్గు చూపుతున్నాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి, సింగరేణి బెల్టులోని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, ఆ పార్టీ నాయకులు భేటీ అవుతున్నారు. రెండు పార్టీలూ ఒక అవగాహనకు రావాలంటే.. ఒక సంఘం పోటీ నుంచి తప్పుకుని మద్దతు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ చిక్కుముడిని ఎలా విప్పుతారన్నది చర్చనీయాంశంగా మారింది.
Updated Date - Dec 22 , 2023 | 02:36 AM