ఆర్‌ఆర్‌ఆర్.. లోక్‌సభ ఎన్నికల తర్వాతే!
ABN, Publish Date - Dec 24 , 2023 | 03:55 AM
రీజినల్ రింగురోడ్డు(ఆర్‌ఆర్‌ఆర్) వ్యవహారం పార్లమెంటు ఎన్నికల తర్వాతే ముందుకుసాగే అవకాశం ఉన్నట్లు సమాచారం.
ప్రస్తుతానికి పక్కనబెట్టిన కేంద్రం..
గత ప్రభుత్వం తీరు వల్లే నిర్మాణంలో జాప్యం?
రాష్ట్ర వాటా, యుటిలిటీ చార్జీలపై నాన్చడంతో ఇబ్బందులు
హైదరాబాద్, డిసెంబరు 23 (ఆంధ్రజ్యోతి): రీజినల్ రింగురోడ్డు(ఆర్‌ఆర్‌ఆర్) వ్యవహారం పార్లమెంటు ఎన్నికల తర్వాతే ముందుకుసాగే అవకాశం ఉన్నట్లు సమాచారం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య కొన్ని అంశాల్లో ఏకాభిప్రాయం కుదరకపోవడం, త్వరలో లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఆ తర్వాతే ఆర్‌ఆర్‌ఆర్‌పై కేంద్రం దృష్టి పెట్టనున్నట్లు సమాచారం. కేంద్రంతో గత బీఆర్‌ఎస్ ప్రభుత్వానికి సత్సంబంధాలు ఉన్న సమయంలో ఆర్‌ఆర్‌ఆర్‌కు ఆమోదం లభించింది. కొద్దికాలానికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య రాజకీయ అంశాల పరంగా గ్యాప్ ఏర్పడటంతో ఆ ప్రభావం ఆర్‌ఆర్‌ఆర్‌పై పడింది. తెలంగాణ ఏర్పాటయ్యాక కేంద్రం నుంచి పలు జాతీయ రహదారులు మంజూరయ్యాయి. అదే సమయంలో హైదరాబాద్ చుట్టూ ప్రస్తుతం ఉన్న నెహ్రూ ఔటర్ రింగు రోడ్డుకు వెలుపల వైపు మరొక రింగు రోడ్డు ఉంటే రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచి రాజధానికి వచ్చి వెళ్లడానికి సమయం తగ్గడంతో పాటు, వ్యాపార లావాదేవీలు పెరుగుతాయని గత ప్రభుత్వం భావించి రీజినల్ రింగు రోడ్డును మంజూరు చేయాలని కేంద్రాన్ని కోరింది. కేంద్రం రింగురోడ్డును మంజూరు చేసినా నిర్మాణానికి అవసరమైన నిధులను సమయానికి చెల్లించకపోవడంతో రోడ్డు నిర్మాణంలో తీవ్ర జాప్యం జరిగింది.
ఆర్‌ఆర్‌ఆర్‌ను మంజూరు చేస్తే భూ సేకరణకు అవసరమైన పరిహారంలో 50శాతం వాటాను తాము రాష్ట్ర వాటాగా చెల్లిస్తామని 2018 ఆగస్ట్టు 29న అప్పటి సీఎం కేసీఆర్ కేంద్రానికి రాసిన లేఖలో పేర్కొన్నారు. కానీ అప్పటి ప్రభుత్వం ఎన్‌హెచ్‌ఏఐకు ఆశించిన మేర చెల్లింపులు చేయలేదు. ప్రాజెక్టు కోసమంటూ బడ్జెట్లో నిధులను కేటాయిస్తూ వచ్చినా ఆ మేరకు కూడా చెల్లించలేదు. ఒకానొకదశలో అసలు ఆ ప్రాజెక్టు రద్దవుతుందనే చర్చ కూడా విస్తృతంగా జరిగింది. ఆ సమయంలోనే జాతీయ రహదారుల విభాగం రాష్ట్ర ప్రభుత్వానికి లేఖలు రాసింది. స్పందించిన అప్పటి రాష్ట్ర ప్రభుత్వం భూ పరిహారంలో రాష్ట్ర వాటా చెల్లింపుల్లో భాగంగా రూ.100కోట్లను మాత్రమే చెల్లించింది. భూ పరిహారంతో పాటు యుటిలిటీ షిఫ్టింగ్ (ఉత్తర భాగం మార్గంలో ఉన్న విద్యుత్తు, టెలికం, తాగునీటి పైపులు, ఇతరత్రా వినిమయ వస్తువుల తరలింపు)కు అవసరమైన చార్జీలను రాష్ట్రమే చెల్లించాల్సి ఉన్నా దానిపై ఎలాంటి సమాధానం చెప్పలేదు. ఫలితంగా యుటిలిటీ షిఫ్టింగ్ చార్జీల అంశంపై సందిగ్ధత నెలకొంది. వాస్తవానికి ఆర్‌ఆర్‌ఆర్ ఉత్తర భాగంలో (సంగారెడ్డి, నర్సాపూర్, తూఫ్రాన్, గజ్వేల్, ప్రజ్ఞాపూర్, భువనగిరి, యాదాద్రి, చౌటుప్పల్) భూ సేకరణకు రూ.5,200కోట్లు ఖర్చకానుందని డీపీఆర్‌లో పొందుపర్చారు. ఆ మేరకు రూ.2,600కోట్లతో పాటు, యుటిలిటీ షిఫ్టింగ్‌కు రూ.363.43కోట్లు కలిపి మొత్తం రాష్ట్ర వాటా కింద 2,948.43కోట్లను ఎన్‌హెచ్‌ఏఐకు చెల్లించాల్సి ఉంది. కానీ గత ప్రభుత్వం రాష్ట్ర వాటా, యుటిలిటీ షిఫ్టింగ్ ఛార్జీల చెల్లింపులపై నాన్చుడు ధోరణితో వ్యవహరించడంతోనే ప్రాజెక్టు నిర్మాణంలో తీవ్ర జాప్యం జరిగిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
రాయిగిరి నుంచి అలైన్‌మెంట్ మారేనా?
యాదాద్రి: యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మునిసిపాలిటీ పరిధిలోని రాయిగిరి వద్ద నుంచి కాకుండా ఆర్‌ఆర్‌ఆర్ అలైన్‌మెంట్‌ను మార్చాలని డిమాండ్ చేస్తూ రైతులు ఏడాదిగా ఆందోళనలు చేస్తున్నారు. దీనికి కాంగ్రెస్, బీజేపీ, సీపీఎం, సీపీఐ తదితర పార్టీలు మద్దతు ప్రకటించాయి. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆర్‌ఆర్‌ఆర్ అలైన్‌మెంట్‌ను మారుస్తామని ఎన్నికల సమయంలో నాటి భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి రైతులకు భరోసా ఇచ్చారు. రైతులకు మార్కెట్ విలువ ప్రకారం రూ.మూడు కోట్ల వరకు ఉందని, వారికి ఎలాంటి పరిహారం నిర్ణయించకుండానే భూసేకరణ చేపట్టింని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి లేఖ రాశానని, జాతీయ రహదారుల అథారిటీ చైర్మన్, సీజీఎంల దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిపారు. బీజేపీ అభ్యర్థి గూడూరు నారాయణరెడ్డిని గెలిపిస్తే... ఆర్‌ఆర్‌ఆర్ అలైన్‌మెంట్‌ను మార్పు చేస్తామని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాగూర్ హామీ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడటం, కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్లగొండ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా బాధ్యతలు స్వీకరించటంతో నాటి హామీల అమలుపై రైతుల్లో ఆశాభావం వ్యక్తమవుతోంది.
Updated Date - Dec 24 , 2023 | 04:00 AM