ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

CM KCR : ఎమ్మెల్యేలను కొంటూ రూ.50 లక్షలతో దొరికిన రేవంత్‌.. నాపై పోటీయా?

ABN, First Publish Date - 2023-11-10T03:26:40+05:30

తెలంగాణ వచ్చి బీఆర్‌ఎస్‌ సర్కారు ఏర్పడిన తర్వాత ఎమ్మెల్యేలను కొనడానికి ఎన్నో కుట్రలు చేశారని సీఎం కేసీఆర్‌ ఆరోపించారు.

తెలంగాణను విచ్ఛిన్నం చేసేందుకు రేవంత్‌ కుట్ర

కామారెడ్డి ప్రజలు ఆయన్ను ఓడించి బుద్ధి చెప్పాలి

తెలంగాణపై ప్రధాని మోదీ పగబట్టాడు

రాష్ట్రానికి రూ.25 వేల కోట్ల నిధులు నిలిపివేశాడు

కామారెడ్డిసభలో ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డ సీఎం

కొత్తగా వచ్చిన బీడీ కార్మికులందరికీ పెన్షన్‌లు

రైతుబంధు ఉండాలంటే బీఆర్‌ఎస్‌ సర్కార్‌ రావాలి

మా అమ్మ పుట్టింది ఇక్కడే.. ప్రచార సభలో కేసీఆర్‌

కామారెడ్డి బీఆర్‌ఎస్‌ నేతల తీరుపై అసంతృప్తి

గజ్వేల్‌, కామారెడ్డిల్లో నామినేషన్‌లు దాఖలు

ఎన్నో ఉద్యమాలు, ఎంతో మంది బలిదానాలతోనే తెలంగాణ వచ్చింది. ప్రత్యేక రాష్ట్రంలో తొలిసారి బీఆర్‌ఎస్‌ సర్కారు ఏర్పడిన తర్వాత ఎమ్మెల్యేలను కొనడానికి ఎన్నో కుట్రలు చేశారు. తెలంగాణను విచ్ఛిన్నం చేయాలని, అనిశ్చితి సృష్టించాలని సమైక్యాంధ్రులు, వారి తొత్తులు తీవ్రంగా ప్రయత్నించారు. అలాంటి కుట్రదారుల్లో రేవంత్‌ ఒకడు. ఎమ్మెల్యేల కొనుగోలుకు వెళ్లి రూ.50 లక్షలతో పట్టుబడ్డ వ్యక్తి కామారెడ్డిలో నాపై పోటీకి దిగాడు. అతన్ని చిత్తుగా ఓడించాలి. తెలంగాణ ద్రోహ పార్టీలైన కాంగ్రెస్‌, బీజేపీ ఎన్నో హామీలు, మరెన్నో అబద్ధపు ప్రచారాలు చేస్తాయి. ప్రజలు ఆలోచించి ఓటువేయాలి. - కేసీఆర్‌

కామారెడ్డి/గజ్వేల్‌, నవంబరు 9 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ వచ్చి బీఆర్‌ఎస్‌ సర్కారు ఏర్పడిన తర్వాత ఎమ్మెల్యేలను కొనడానికి ఎన్నో కుట్రలు చేశారని సీఎం కేసీఆర్‌ ఆరోపించారు. ఎమ్మెల్యేలను కొనేందుకు రూ.50 లక్షలతో దొరికిన రేవంత్‌రెడ్డి కామారెడ్డిలో తనపై పోటీ చేస్తున్నారని.. అలాంటి కుట్రదారుణ్ని చిత్తుగా ఓడించి, తగిన బుద్ధి చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు. గురువారం కామారెడ్డిలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద బహిరంగ సభలో సీఎం కేసీఆర్‌ మాట్లాడారు. ప్రతిపక్షాలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఎన్నో ఉద్యమాలు చేసి, ఎంతోమంది బలిదానాలు చేయడం వల్లే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని చెప్పారు. వచ్చిన తెలంగాణను విచ్ఛిన్నం చేయాలని, అనిశ్చితి సృష్టించాలని సమైక్యాంధ్రులు, వారి తొత్తులు ఎన్నో ప్రయత్నాలు చేశారని ఆరోపించారు. రాష్ట్రానికి తీరని అన్యాయం చేసిందే కాంగ్రెస్‌ అన్నారు. ఇక ప్రధాని మోదీ తెలంగాణపై పగబట్టారన్నారు. తొమ్మిదేళ్లుగా ఆయన రాష్ట్రానికి తీరని అన్యాయం చేశారని ధ్వజమెత్తారు.

రాష్ట్రానికి రావాల్సిన రూ.25 వేల కోట్ల నిధులను నిలిపివేశారని.. నవోదయ, మెడికల్‌ కళాశాలను కూడా ఇవ్వలేదని విమర్శించారు. ఓట్ల కోసం వచ్చే బీజేపీ అభ్యర్థులను నిలదీయాలని, వారికి ఒక్క ఓటు కూడా వేయొద్దని ప్రజలకు సూచించారు. రాష్ట్రంలోని రైతుల వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టాలని మోదీ ఒత్తిడి చేస్తే తాను జగమొండిగా వ్యవహరించి అడ్డుకున్నానన్నారు. కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీకి యవుసం.. ఎద్దు ఏమైనా తెలుసా? ఆయన ఎప్పుడైనా నాగలి పట్టుకున్నడా? అంటూ కేసీఆర్‌ ఎద్దేవా చేశారు. అలాంటి రాహుల్‌ రైతులు, వ్యవసాయం గురించి మాట్లాడడం, అధికారంలోకి వస్తే ధరణిని బంగాళాఖాతంలో వేస్తామని చెప్పడం విడ్డూరంగా ఉందని చెప్పారు. రైతుల భూముల సమస్యలు తీర్చేందుకే ధరణిని తీసుకొచ్చామన్నారు. ధరణిని రద్దు చేస్తామంటున్న కాంగ్రె్‌సనే బంగాళాఖాతంలో కలిపేయాలని కోరారు.

తెలంగాణను 50 ఏళ్లుగా చావుదెబ్బ కొట్టింది కాంగ్రెస్‌ పార్టీయే అన్నారు. రైతుబంధు ఉండాలంటే బీఆర్‌ఎస్‌ సర్కారే రావాలని చెప్పారు. తెలంగాణ ద్రోహ పార్టీలైన కాంగ్రెస్‌, బీజేపీ నేతలు ఎన్నో హామీలు, మరెన్నో అబద్ధపు ప్రచారాలు చేస్తారని.. ప్రజలు ఆలోచించి ఓటువేయాలని కోరారు. అభ్యర్థి ఎవరు?.. ఏ పార్టీ? ఆయన పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎలాంటి అభివృద్ధి చేసిందనే అంశాలను చూసి ఓటు వేసి గెలిపించాలని సూచించారు. కామారెడ్డి బరిలో నిలిచిన తనను ఆశీర్వదించి గెలిపించాలని కోరారు. ఇప్పటికే బీడీ కార్మికులకు పింఛన్లు ఇస్తున్నామని.. గతంలో బీడీ పింఛన్లపై కటాఫ్‌ డేట్‌ పెట్టడంతో కొత్తవారికి అవకాశం లేకుండా పోయిందని ఎమ్మెల్యేలు తన దృష్టికి తీసుకువచ్చారని తెలిపారు. బీఆర్‌ఎస్‌ మరోసారి అధికారంలోకి రాగానే రాష్ట్రంలోని కొత్త బీడీ కార్మికులందరికీ పింఛన్లు అందజేస్తామని హామీ ఇచ్చారు.

కామారెడ్డిని బంగారు తునకగా మారుస్తా

తాను గెలవగానే కామారెడ్డిని బంగారు తునకగా మారుస్తానని సీఎం కేసీఆర్‌ హామీ ఇచ్చారు. తన పుట్టుకకు కామారెడ్డితో సంబంధం ఉందన్నారు. ‘నియోజకవర్గంలోని బీబీపేట మండలం కోనాపూర్‌ గ్రామం (అప్పట్లో పోసానిపల్లి)లో మా అమ్మ పుట్టింది. ఆర్గోండలో నా మేనమామ ఉండేవారు’ అని కేసీఆర్‌ చెప్పారు. ఉద్యమ సమయంలో జలసాధన పోరును కామారెడ్డి నుంచే ప్రారంభించానని, స్థానిక బీడీ ఫ్యాక్టరీలో గులాబీ కూలి చేసి ఉద్యమానికి నిధులు సేకరించానని తెలిపారు. కామారెడ్డికి కేసీఆర్‌ వస్తున్నాడంటే పరిశ్రమలు, ఐటీ కంపెనీలు వస్తాయని.. కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గాలకు కాళేశ్వరం ద్వారా ఏడాదిలో సాగునీటిని అందించే బాధ్యత తనదేనని చెప్పారు. ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ తన పదవిని త్యాగం చేసి, తనకు కామారెడ్డి స్ధానాన్ని ఇచ్చారని చెప్పారు. కామారెడ్డిలో గురువారం కేసీఆర్‌ నామినేషన్‌ వేశారు. ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ నివాసంలో నామినేషన్‌ పత్రాలను పరిశీలించి మధ్యాహ్నం 2 గంటలకు ఆర్డీవో కార్యాలయానికి వెళ్లారు. ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌, మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ నిట్టు జాహ్నవి, జిల్లా అధ్యక్షుడు ముజీబొద్దీన్‌తో కలిసి ఒక్కో సెట్‌ చొప్పున కేసీఆర్‌ రెండు సెట్ల నామినేషన్‌ దాఖలు చేశారు.

నియోజకవర్గ నేతల తీరుపై అసంతృప్తి

కామారెడ్డిలో ముఖ్యనేతల మధ్య సమన్వయ లేమిపై కేసీఆర్‌ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. గురువారం నామినేషన్‌ వేసేముందు గంప గోవర్ధన్‌ ఇంట్లో గంటన్నర పాటు ముఖ్యనేతలతో కేసీఆర్‌ సమావేశమయ్యారు. ఎన్నికల సమయంలో గ్రూపు తగాదాలు వీడాలని, గీత దాటితే క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరించినట్లు సమాచారం.

49 నామినేషన్లు వేసిన వట్టినాగులపల్లి బాధితులు

గజ్వేల్‌ అసెంబ్లీ నియోజకవర్గానికి రంగారెడ్డి జిల్లా వట్టినాగులపల్లి గ్రామానికి చెందిన శంకర్‌హిల్స్‌ లేఅవుట్‌ బాధితులు 49 నామినేషన్లను దాఖలు చేశారు. అనంతరం శంకర్‌హిల్స్‌ లేఅవుట్‌ అసోసియేషన్‌ అధ్యక్ష, కార్యదర్శులు సువర్ణారెడ్డి, కృష్ణారెడ్డి విలేకరులతో మాట్లాడారు. తమ సమస్యను సీఎం కూడా పరిష్కరించలేదని ఆరోపించారు. తమ బాధను తెలియజేయడానికే నామినేషన్లను వేసినట్లు తెలిపారు.

గజ్వేల్‌లో కేసీఆర్‌ నామినేషన్‌

గజ్వేల్‌ బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా కేసీఆర్‌ గురువారం నామినేషన్‌ దాఖలు చేశారు. ఎర్రవల్లిలోని తన వ్యవసాయ క్షేత్రం నుంచి గజ్వేల్‌లోని ఐవోసీ మైదానానికి హెలికాప్టర్‌లో వచ్చిన ముఖ్యమంత్రి.. ప్రత్యేక వాహనంలో ఆర్డీవో కార్యాలయానికి వెళ్లి నామినేషన్‌ను సమర్పించారు. సరిగ్గా 11.18 నిమిషాలకు నామినేషన్‌ పత్రాలను ఆర్డీవో బన్సీలాల్‌కు అందజేశారు. తిరుగు ప్రయాణంలో హెలీప్యాడ్‌ వద్ద వేచి ఉన్న యాదవరెడ్డి, ప్రతా్‌పరెడ్డి, ఎలక్షన్‌రెడ్డి, భూంరెడ్డి, ఇతర నాయకులతో మాట్లాడిన ఆయన.. అంతా కలిసి పనిచేయాలని సూచించారు.

Updated Date - 2023-11-10T03:58:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising